57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

సినిమా ద్వారా భారతదేశాన్ని అత్యంత వాస్తవిక రీతిలో ప్రతిబింబించడమే మా ప్రయత్నం: నాన్-ఫీచర్ జ్యూరీ ఛైర్‌పర్సన్ హిమాన్షు శేఖర్ ఖటువా

57వ ఇఫీ వేదికగా కఠినమైన ఎంపిక ప్రక్రియ, భారతీయ కథనాల వైవిధ్యం, చలనచిత్ర నిర్మాణంలో సాంకేతికత పోషిస్తున్న పరిణామశీల పాత్రపై తమ అభిప్రాయాలను పంచుకున్న ఇండియన్ పనోరమా జ్యూరీ

నాడు పోస్టు చేయడమైనది: 21 NOV 2026 7:24PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340168Views: 6

57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (ఇఫీ) ఇండియన్ పనోరమా నాన్-ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. భారతీయ సినిమా వైవిధ్యం, కథన బలం, చలనచిత్ర నిర్మాణంలో సాంకేతికత పోషిస్తున్న పరిణామశీల పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ కఠినమైన ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాలను పంచుకుంది. 358 ఎంట్రీల నుంచి 20 చిత్రాలను ఎంపిక చేయడం వెనుక జరిగిన చర్చలు, విశ్లేషణల తీరును ఈ సమావేశం కళ్లకు కట్టింది.

ఈ సమావేశంలో జ్యూరీ ఛైర్‌పర్సన్ శ్రీ హిమాన్షు శేఖర్ ఖటువాతో పాటు జ్యూరీ సభ్యులు శ్రీమతి ఆర్తి పటేల్, శ్రీ అభిజీత్ అరవింద్ దళ్వీ, శ్రీమతి రాగిణి సోనా, శ్రీ శివ్ సన్నీ, శ్రీ శంఖజీత్ దే, శ్రీ ధనేష్ యాదవ్ టీఆర్ పాల్గొన్నారు. పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ మహేష్ కుమార్ ఈ సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.

ఎంపిక ప్రక్రియ వెనుక ఉన్న తాత్విక దృక్పథం గురించి మాట్లాడుతూ.. సినిమా ద్వారా భారత్‌ను అత్యంత వాస్తవిక రీతిలో ప్రతిబింబించడమే జ్యూరీ ప్రథమ బాధ్యత అని శ్రీ హిమాన్షు శేఖర్ ఖటువా చెప్పారు. ఇఫీ ఇతివృత్తమైన ‘విశ్వజనీయ కథల’ను ప్రస్తావిస్తూ.. ఎంపికైన చిత్రాలు కథనంలోని ఎల్లలు లేని స్ఫూర్తిని ప్రతిబింబిస్తూనే దేశంలోని బహుముఖ అస్తిత్వాలను, వాస్తవ జీవిత అనుభవాలను, సాంస్కృతిక వైభవాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించాయని ఆయన పేర్కొన్నారు.

ఎంపిక విధానాన్ని వివరిస్తూ.. సాంప్రదాయ చలనచిత్ర చట్రాలకు, ప్రధాన స్రవంతి అభిరుచులకు అతీతంగా ఆలోచిస్తూ జ్యూరీ పలు దశలలో కఠినమైన మదింపు చేపట్టిందని శ్రీ హిమాన్షు శేఖర్ ఖటువా తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విభిన్న దృక్కోణాలను, ఆకట్టుకునే కథనాలను అందించే చిత్రాలను గుర్తించడం ఈ ప్రక్రియలో భాగమని ఆయన చెప్పారు. ఎంపికైన చిత్రాలు సమష్టిగా భారత్‌లోని విభిన్న ఆచారాలు, సంప్రదాయాలు, సాంస్కృతిక దృశ్యాలను తెలియజేస్తాయని ఆయన పేర్కొన్నారు. జ్యూరీ సమగ్ర దృక్పథాన్ని వివరిస్తూ.. శైలి లేదా కథనం వంటి విడివిడి అంశాల ఆధారంగా కాకుండా చిత్రాలను సమగ్రంగా మదింపు చేసినట్లు ఆయన వివరించారు.

చలనచిత్ర నిర్మాణంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రభావం పెరుగుతున్న అంశాన్ని ప్రస్తావించిన శ్రీ హిమాన్షు శేఖర్ ఖటువా.. మానవ ఊహాశక్తి, సున్నితత్వం, దృక్పథం ఎప్పటికీ విలక్షణమైనవిగా, భర్తీ చేయలేనివిగా ఉంటాయని చెప్పారు. ఒక విలువైన సృజనాత్మక సాధనంగా ఏఐ సామర్థ్యాన్ని అంగీకరిస్తూనే.. సాంకేతికత అనేది కళాత్మక వ్యక్తీకరణకు తోడ్పడుతూ దానిని మరింత సుసంపన్నం చేయాలే తప్ప దాని వెనుక ఉన్న మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాకూడదని ఆయన స్పష్టం చేశారు.

తన అనుభవం గురించి మాట్లాడిన జ్యూరీ సభ్యురాలు శ్రీమతి ఆర్తి పటేల్.. ఈ ఎంపిక ప్రక్రియ అబ్బురపరిచేదిగా, ఎంతో సంతృప్తినిచ్చేదిగా ఉందని తెలిపారు. ముఖ్యంగా వచ్చిన ఎంట్రీలలో ప్రాతినిధ్యం వహించిన అసాధారణమైన ఇతివృత్తాలు, అంశాలు, దృక్కోణాల విస్తృతిని దృష్టిలో ఉంచుకుని ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా అనేది భాషా, భౌగోళిక, సాంస్కృతిక సరిహద్దులను అధిగమిస్తూ ప్రజలను, సమాజాలను మరింత దగ్గర చేసే విశ్వజనీన భాషగా పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు.

ఈ చిత్రాలు జ్యూరీకి భారతదేశ సమగ్ర దృశ్యాన్ని ఆవిష్కరించాయని.. విభిన్నమైన చలనచిత్ర గళాల ద్వారా దేశంలోని వైవిధ్యభరితమైన సామాజిక వాస్తవాలను, సాంస్కృతిక తత్వాన్ని ఆవిష్కరించాయని శ్రీ అభిజీత్ అరవింద్ దళ్వీ వ్యాఖ్యానించారు. దేశంలోని చలనచిత్ర నిర్మాణ సంప్రదాయాల వైభవాన్ని, చిత్రనిర్మాతలు తమ పరిసరాలను అర్థం చేసుకుని చిత్రీకరించిన విభిన్న రీతులను ఈ ఎంట్రీలు తెలియజేసిన తీరును ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

జ్యూరీతో తన అనుబంధాన్ని ఒక విలువైన అభ్యాస అనుభవంగా అభివర్ణించిన శ్రీమతి రాగిణి సోనా.. చలనచిత్రోత్సవ ఇతివృత్తమైన ‘విశ్వజనీన కథలు’ ఎంతో అందమైంది, అర్థవంతమైందని అన్నారు. సరిహద్దులనే అవాంతరాలు దాటి ఉమ్మడి మానవ అనుభవాల ద్వారా ప్రేక్షకులను అనుసంధానించే కథల ప్రాముఖ్యతను ఆమె ప్రధానంగా చెప్పారు.

సినిమాకున్న పరివర్తనాత్మక శక్తిని శ్రీ శివ్ సన్నీ ప్రస్తావించారు. అర్థవంతమైన కథనం కేవలం వినోదానికే పరిమితం కాకుండా ఆలోచనలను రేకెత్తించగలదని, దృక్పథాలను తీర్చిదిద్దగలదని, సానుకూల సామాజిక మార్పుకు స్ఫూర్తినివ్వగలదని చెప్పారు.

చిత్రాల ఎంపిక పట్ల జ్యూరీ అనుసరించిన విధానాన్ని, ఇండియన్ పనోరమా కోసం చిత్రాలను గుర్తించడంలో పరిగణనలోకి తీసుకున్న అంశాలను అర్థం చేసుకోవడానికి ఈ విలేకరుల సమావేశం ఒక చక్కటి అవకాశాన్ని కల్పించింది. విభిన్న ప్రాంతాలు, సంస్కృతులు, వాస్తవ జీవిత అనుభవాల్లో వేళ్లూనుకున్న కథలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా భారతీయ సినిమా వైభవాన్ని చాటిచెప్పడంలో, భౌగోళిక-సాంస్కృతిక సరిహద్దులకు అతీతంగా ప్రేక్షకులను అనుసంధానించడంలో ఇండియన్ పనోరమా పోషిస్తున్న పాత్రను ఈ ఎంపిక పునరుద్ఘాటిస్తోంది.

ఇఫీలోయిడ్ ఇక్కడ చదవండి: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340168
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026