57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

భాషలు.. ఎల్లలకు అతీతం: 57వ ‘ఐఐఎఫ్‌ఐ’లో భారతీయ సినిమా వైవిధ్యానికి ఇండియన్ పనోరమా నీరాజనం

· భారతీయ విభిన్న సినీ సంప్రదాయాల సహజత్వం.. నవ్య గళాలు.. సమష్టి భావోద్వేగాలపై న్యాయ నిర్ణేతల సంఘం ప్రశంస

నాడు పోస్టు చేయడమైనది: 21 NOV 2026 3:10PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340167Views: 3

 దక్షిణ భారతం నుంచి ఈశాన్యం దాకా వైవిధ్యభరిత కథలు, సంస్కృతులు, సృజనాత్మక వ్యక్తీకరణలతోనే భారతీయ సినిమా నానాటికీ బలం పుంజుకుంటోంది. అయినప్పటికీ ప్రాంతీయ అస్తిత్వాలు, విభిన్న సినీ శైలులకు అతీతంగా యావద్దేశ ప్రేక్షకులను ఈ కథలతో మమేకం చేసేది వాటిలో ఉట్టిపడే సార్వజనీన మానవీయ భావోద్వేగాలే. ఈ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ ప్రముఖ దర్శకుడు మాధుర్ భండార్కర్ నేతృత్వంలోని ‘ఇండియన్ పనోరమా-2026’ ఫీచర్ ఫిల్మ్ న్యాయ నిర్ణేతల సంఘం భారత 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) వేదికగా ఇవాళ విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ వేడుకలకు వచ్చిన 404 ఎంట్రీల నుంచి 25 చిత్రాల ఎంపికలో తమ అనుభవాలను పాత్రికేయులతో పంచుకుంది.

విభిన్న కళాభిరుచులతో రూపొందిన చిత్రాలన్నింటినీ జ్యూరీ సభ్యులంతా వీక్షించిన తర్వాత ఏకాభిప్రాయంతో తుది జాబితాను ఖరారు చేసినట్లు భండార్కర్ తెలిపారు. ఈ అనుభవం ఎంతో సుసంపన్నమని, కొత్త అంశాలపై అవగాహనకు, నవ్య దృక్కోణాల స్వీకరణకు చలనచిత్రోత్సవాలు వేదికలుగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. తుది ఎంపికపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ- కొన్ని మరాఠీ, లద్దాఖీ, మలయాళ చిత్రాలు తమ బృందంపై బలమైన ముద్ర వేశాయని, అవి ప్రేక్షకులను మంత్రముగ్ధం చేసేలా రూపొందాయని ప్రత్యేకంగా ప్రశంసించారు.

కథల్లోని సహజత్వం, ప్రాంతీయతల ప్రాధాన్యాన్ని జ్యూరీ సభ్యురాలు, సీనియర్ కాలమిస్ట్ భారతి ప్రధాన్ వివరించారు. దేశవ్యాప్త దృక్కోణాలను ఏకతాటిపైకి తెస్తూనే, తమ వాస్తవ దృక్పథాన్ని స్పష్టంగా చాటుకునే చిత్రాలకే తాము ప్రాముఖ్యమిచ్చామని ఆమె పేర్కొన్నారు. ఎంపికైన జాబితాలోని చిత్రాల్లో అఖిల భారత స్థాయి ప్రస్ఫుటం కావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ‘ఇండియన్ పనోరమా ఫీచర్ ఫిల్మ్’ విభాగంతో పోల్చినపుడు ‘మెయిన్‌స్ట్రీమ్ సినిమా’ విభాగంలోని చిత్రాల ఎంపిక ప్రమాణాలు భిన్నంగా ఉంటాయని స్పష్టం చేశారు.

దేశంలోని వివిధ ప్రాంతాల చిత్రాలు అంతర్జాతీయ సినిమాల వీక్షణానుభూతిని కలిగించాయని నటి, జ్యూరీ సభ్యురాలు బిందు చంద్రమౌళి అన్నారు. భాషలు, శైలులు, జానర్లలో భిన్నత్వం నిజమే అయినా, వాటన్నింటినీ కలిపే అంతర్లీన భావోద్వేగాల సూత్రం ఒక్కటేనని ఆమె విశ్లేషించారు. ప్రేక్షకులు తమ భాషా పరిమితులకు అతీతంగా సినిమాలను ఆదరించాలని సూచించారు. భిన్న భాషా చిత్రాలను, విభిన్న కథన శైలులను ఆస్వాదించడంలో తెలుగు ప్రేక్షకులు సదా సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ ఎంపిక ప్రక్రియ భారతీయ ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ ప్రతిబింబించే వర్చువల్ భారత  యాత్రలా సాగిందని ఛాయాగ్రాహకుడు, జ్యూరీ సభ్యుడు ఎం.ఎస్.ప్రభు అభివర్ణించారు. వివిధ ప్రాంతాల సినిమాలను చూస్తున్న కొద్దీ ఆ కథలు, అవి పలికించే భావోద్వేగాల మధ్య గల అనుబంధం మరింత స్పష్టమైందని తెలిపారు. కొత్త దర్శకుల ప్రతిభను అభినందిస్తూ- ఈ ఎంపిక ప్రక్రియ తనకొక విలువైన అభ్యసనానుభవమని పేర్కొన్నారు.

చిత్రాల ఎంపికపై ఛాయాగ్రాహకుడు, జ్యూరీ సభ్యుడు కె.ఎస్.శివరామన్ స్పందిస్తూ-  కొన్ని కథల్లోని భావోద్వేగాలు ఎంతగానో హత్తుకున్నాయన్నారు. వాటిలో కొన్నింటిని దక్షిణాది ప్రేక్షకుల కోసం పునర్నిర్మించాలన్న ఆలోచన కూడా తనలో కలిగిందన్నారు. ఎంపిక ప్రక్రియ సందర్భంగా సినిమాలోని సందేశానికి తామెంతో ప్రాధాన్యమిచ్చామని మరో జ్యూరీ సభ్యుడు సోహమ్ పి.షా తెలిపారు.

మెయిన్‌స్ట్రీమ్ సినిమా విభాగంలోని ఐదు చిత్రాల ఎంపికపైనా జ్యూరీ చర్చించింది. సినిమాల సత్తా, ఇతివృత్తాలు, వాటిలోని వినూత్న ఆలోచనల ఆధారంగా సమష్టి నిర్ణయంతోనే వాటిని ఎంపిక చేశామని భండార్కర్ వివరించారు. ఈ విలేకరుల సమావేశానికి శ్రీ రజిత్ చంద్రన్ సమన్వయకర్తగా వ్యవహరించారు.

ఎంపిక చేసిన ఫీచర్ ఫిల్మ్స్‌ జాబితాలో ‘ఇండియన్ పనోరమా ఫీచర్ ఫిల్మ్’ విభాగంలోని 20, ‘మెయిన్‌స్ట్రీమ్ సినిమా’ విభాగంలోని 5 చిత్రాలున్నాయి. ‘ఇండియన్ పనోరమా-2026’ ప్రారంభ చిత్రంగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘ధురంధర్’ ఎంపికైంది. వీటితోపాటు విస్తృత ఇండియన్ పనోరమా ఎంపికలో 20 నాన్-ఫీచర్ చిత్రాలు కూడా ఉన్నాయి.

ప్రేక్షకుల మనోభావాలను స్పృశించే కథల ద్వారా ప్రాంతీయ అస్తిత్వాలు, విభిన్న సినీ శైలులు ఏకమయ్యే తీరును జ్యూరీ సభ్యుల అభిప్రాయాలు స్పష్టం చేశాయి. ఇఫీ వేదికగా ‘ఇండియన్ పనోరమా’ ఈ వైవిధ్యాన్ని నిరంతరం వెలుగులోకి తెస్తోంది. తద్వారా భాషలు, సంస్కృతులకు అతీతంగా సమకాలీన భారతీయ సినిమాలతో మమేకం కావడానికి, ఆస్వాదనకు విశిష్ట వేదికగా నిలుస్తోంది.

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340167
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026