నాడు పోస్టు చేయడమైనది:
20 NOV 2026 5:53PM by PIB Hyderabad
కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ భోపాల్‌లో తొలి దేశీయ ‘ఏవియన్ ఇన్ఫ్లుయెంజా’ (హెచ్5ఎన్1-బర్డ్ ఫ్లూ) టీకాను జాతికి అంకితం చేశారు. శాస్త్రవిజ్ఞాన సామర్థ్యం, స్వావలంబన దిశగా భారత్ ప్రస్థానంలో దీన్నొక కీలక ఘట్టంగా పేర్కొనవచ్చు. బర్డ్ ఫ్లూలోని ఈ నిర్దిష్ట రకానికి ప్రపంచంలోనే ఇది తొలి టీకా కావడంతోపాటు ఒక్కో డోసు ₹1 నుంచి 2కే లభించడం విశేషం. ఇది ముఖ్యంగా పౌల్ట్రీ రంగంలో వ్యాధి నివారణ బలోపేతానికి తోడ్పడటం సహా లక్షలాది కోళ్ల పెంపకందారుల జీవనోపాధికి ఊతమిస్తుంది. జంతువులకు సోకే వ్యాధులతో వాటిల్లే భారీ ఆర్థిక నష్టాన్ని ఇది తగ్గించగలదు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రసంగిస్తూ- భోపాల్‌లో దాదాపు ₹300 కోట్లతో అత్యాధునిక పశువ్యాధుల పరిశోధన ప్రయోగశాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు
విదేశాల్లో భారత్‌ను చులకన చేసేవారు నేటి స్వయంసమృద్ధ నవ భారత్‌ను చూడాలి
భారత రాజ్యాంగ సంస్థలను, శాస్త్రవేత్తల సామర్థ్యాన్ని అంతర్జాతీయ వేదికలపై చులకన చేసే ప్రతిపక్ష నాయకులపై ఈ సందర్భంగా ఆయన విమర్శలు గుప్పించారు. విదేశాల్లో స్వదేశాన్ని విమర్శించే వారు భారత్ సాధించిన విజయాలను, ఇనుమడిస్తున్న శాస్త్ర విజ్ఞాన సామర్థ్యాన్ని గుర్తించాలని సూచించారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి కూడా విదేశాల్లో రాజ్యాంగాన్నే ప్రశ్నించేవారు, వాటిని బలహీనపరిచేవారు, సాయుధ దళాలు, శాస్త్రవేత్తలు సహా శ్రమించే పౌరుల కృషిపై అనుమానాలు వెలిబుచ్చే... నేటి పరిణామశీల భారత్‌ను రెండు కళ్లూ తెరిచి చూడాలని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వాన ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ ద్వారా భారత శాస్త్రవేత్తలు కేవలం 9 నెలల్లోనే రెండు స్వదేశీ కోవిడ్-19 టీకాలను రూపొందించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలోనే తొలి బర్డ్ ఫ్లూ టీకాను రూపొందించడం దేశ శాస్త్రవిజ్ఞాన సామర్థ్యానికి, స్వావలంబనకు మరో నిదర్శనమన్నారు.
భోపాల్‌లో ₹300 కోట్లతో అత్యాధునిక ప్రయోగశాల ఏర్పాటు
భోపాల్‌లోని ‘ఐసీఏఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్’ (ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ) సాధించిన విజయాలను శ్రీ చౌహాన్ ప్రస్తావించారు. ఈ నగరంలో ₹300 కోట్లతో కొత్త అత్యాధునిక ప్రయోగశాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భారత శాస్త్రవిజ్ఞాన నైపుణ్యానికి ‘ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ’ ఒక ప్రతీకగా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ టీకాను ఢిల్లీలో కాకుండా భోపాల్‌లో దేశానికి అంకితం చేయడంపై-
“దేశ రాజధానిలోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, టీకా రూపకల్పనలో అహర్నిశలూ శ్రమించిన శాస్త్రవేత్తల మధ్య, భోపాల్ ప్రజల సమక్షంలో నిర్వహించడమే సముచితమని ఈ నిర్ణయం తీసుకున్నాం” అని ఆయన ప్రకటించారు. ఈ ఘనత పూర్తిగా ఆ శాస్త్రవేత్తలదేనని, టీకా ఎక్కడ రూపొందిందో అక్కడే వారి కృషికి గుర్తింపునివ్వడం ప్రధానమని ఆయన అన్నారు.
పశుసంపద రైతుకు ‘నడిచే ఏటీఎం’ వంటిది.. స్వదేశీ టీకాలతో ఏటా ₹56,000 కోట్ల నష్టం నివారణ
పశుసంవర్ధకం, కోళ్ల పెంపకం రంగాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలక పునాదులని శ్రీ చౌహాన్ పేర్కొన్నారు. పశుసంపద రైతుకు ‘నడిచే ఏటీఎం’ వంటిదని, దీనివల్ల వ్యవసాయంతో పాటు వారికి ప్రతి నెలా స్థిరమైన ఆదాయం లభిస్తుందని ఆయన చెప్పారు. స్థూల దేశీయోత్పత్తి ( జీడీపీ)లో పశుసంవర్ధక రంగానికి 14 శాతం, కోళ్ల పెంపకానికి 1 శాతం వాటా ఉందని గుర్తుచేశారు. పశువుల్లో ప్రబలే ప్రధాన వ్యాధుల వల్ల కలిగే భారీ ఆర్థిక భారాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. శ్రీ చౌహాన్ వెల్లడించిన గణాంకాల ప్రకారం- ‘గాలికుంటు వ్యాధి’ వల్ల ఏటా సగటున ₹22,000 కోట్లు, ‘లంపీ స్కిన్ డిసీజ్’ వల్ల ₹20,000 కోట్లు, ‘బ్రూసెల్లోసిస్’ వల్ల ₹9,212 కోట్లు, గొర్రెలు-మేకలకు సోకే ‘పెస్టే డెస్ పెటిట్స్ రుమినెంట్స్’ వ్యాధి కారణంగా ₹4,683 కోట్ల నష్టం వాటిల్లుతోంది. మొత్తంమీద ఈ వ్యాధులన్నింటి వల్ల దేశానికి, రైతులకు ₹56,000 కోట్ల దాకా నష్టభారం పడుతోంది. ఈ నేపథ్యంలో పశుసంపద పరిరక్షణ, రైతు ఆదాయ వృద్ధి, ఆర్థిక భారం తగ్గింపులో్ స్వదేశీ టీకాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన వివరించారు.
కొత్త టీకా ఒక డోసు కేవలం ₹1 నుంచి 2 మాత్రమే… దేశంలో 2006 నుంచి 500కు పైగా బర్డ్ ఫ్లూ కేసుల నమోదు
దేశంలో తొలి 2006లో మహారాష్ట్రలోని నవాపూర్‌లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి నమోదైందని, దీంతో 10 లక్షల కోళ్లు మరణించాయని శ్రీ చౌహాన్ గుర్తు చేశారు. ఈ వ్యాధిని అరికట్టే క్రమంలో మరికొన్ని లక్షల పక్షులను చంపి పాతిపెట్టాల్సి వచ్చిందని తెలిపారు. అటుపైన 2021లో సుమారు 9 లక్షల కోళ్లు, ఈ ఏడాది మరో 2 లక్షల కోళ్లు మరణించాయని చెప్పారు. మొత్తంమీద 2006 నుంచి ఇప్పటిదాకా దేశంలో 500కు పైగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదై కోళ్ల పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగించిందన్నారు. ఈ వ్యాధి క్షీరదాలకు, మనుషులకూ సోకే ముప్పు ఉన్నందున, దీని సమర్థ నివారణ, నియంత్రణ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అందుకే చిన్న తరహా కోళ్ల పెంపకందారులు కూడా కొనుగోలు చేయగలిగేలా ఈ కొత్త స్వదేశీ టీకా ధరను కేవలం ₹1 నుంచి 2గా నిర్ణయించినట్లు వెల్లడించారు. స్వల్ప ధరతో లభ్యమయ్యే ఈ టీకా త్వరలోనే మరింతగా అందుబాటులోకి వస్తుందని, తద్వారా దేశంలోని కోళ్ల పెంపకందారుల జీవనోపాధి రక్షణకు భరోసా లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
పశు వ్యాధులపై జాతీయ టీకా కార్యక్రమంతో నిర్ణయాత్మక ఫలితాలు
పశువులకు సోకే ప్రధాన వ్యాధులను టీకాలతో నియంత్రించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని శ్రీ చౌహాన్ ప్రముఖంగా ప్రస్తావించారు. వ్యాధి నివారణ బలోపేతం, పశువుల రక్షణ లక్ష్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, శ్రీకృష్ణుని జన్మభూమి అయిన మధుర నుంచి జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆయన గుర్తుచేశారు. దీనికింద గాలికుంటు వ్యాధి నివారణ కోసం ఇప్పటిదాకా దాదాపు 147.16 కోట్ల ఉచిత టీకాలను పంపిణీ చేశారని తెలిపారు. అలాగే, బ్రూసెల్లోసిస్ వ్యాధిని కూడా అదుపులోకి తెచ్చామని చెప్పారు. మరోవైపు 2022లో లంపీ స్కిన్ డిసీజ్ (చర్మపు గడ్డలు) వ్యాప్తిని గుర్తుచేస్తూ- 32.80 లక్షల జంతువులు ఈ వ్యాధి బారిన పడగా 1.86 లక్షల జంతువులు మరణించాయని శ్రీ చౌహాన్ అన్నారు. ఆ తర్వాత హిసార్, ఇజత్‌నగర్‌లోని శాస్త్రవేత్తలు ఈ వ్యాధి నివారణకు ‘లంపీ-ప్రోవాక్ఇండ్’ టీకాను రూపొందించారని తెలిపారు. మరోవైపు గంబోరో వ్యాధి, బ్రూసెల్లా అబోర్టస్ ఎస్-19 డెల్టా, క్లాసికల్ స్వైన్ ఫీవర్, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌ల నియంత్రణ కోసం లోగడ భోపాల్‌లోని ‘ఐసీఏఆర్-ఎన్ఐహెచ్ఎస్ఏడీ’ స్వదేశీ టీకాలను రూపొందించిందని ఆయన ప్రశంసించారు. దేశీయ పశు ఆరోగ్య పరిశోధనకు ఈ సంస్థ చేస్తున్న సేవలకు, తాజా హెచ్5ఎన్1 టీకా మరో ఘనతను జోడించిందని పేర్కొన్నారు.
ఈ టీకా తయారీలో శాస్త్రవేత్తలు సెలవు రోజుల్లోనూ శ్రమిస్తూ కఠిన జీవశాస్త్ర రక్షణ నియమాలను పాటించారు.
ఈ టీకా రూపకల్పనలో రాత్రింబవళ్లు శ్రమించిన శాస్త్రవేత్తలకు నివాళి అర్పిస్తూ, ఈ ఘనత సాధనలో అసలైన కథానాయకులు వారేనని శ్రీ చౌహాన్ అభివర్ణించారు. వారి ఈ అసాధారణ నిబద్ధతను, అంకితభావాన్ని ఆయన వేనోళ్ల ప్రశంసించారు. ఈ పరిశోధక బృందంలో డాక్టర్ ఎస్.నాగరాజన్, డాక్టర్ మనోజ్ కుమార్, డాక్టర్ సి.తోష్, డాక్టర్ హెచ్.వి.మురుగ్కర్, డాక్టర్ అనికేత్ సన్యాల్, డాక్టర్ డి.సెంథిల్ కుమార్, డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ ఆర్.యోగిశారాధ్య ఉన్నారు. వీరంతా పరిశోధనలో తలమునకలై తమ వారాంతపు సెలవుల మాట కూడా మరచి నెలల తరబడి పనిచేశారని కొనియాడారు. ఈ క్రమంలో అత్యంత కఠిన జీవశాస్త్ర నియమాలను పాటించాల్సి వచ్చిందని తెలిపారు. ఇందులో భాగంగా ప్రయోగశాలకు రాకపోకల సమయంలో పరిశుద్ధీకరణ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మేరకు స్నానానికి నిత్యం 120 లీటర్ల నీటిని వాడటంతోపాటు పరిశోధన కాలంలో ఇంట్లో ఎలాంటి పెంపుడు జంతువులను ఉంచుకోరాదని వెల్లడించారు. ఈ విధంగా కఠిన నిబద్ధతతో కృషి చేసిన శాస్త్రవేత్తల అంకితభావాన్ని శ్రీ చౌహాన్ అభినందించారు. దేశ రక్షణలో సైనికుల క్రమశిక్షణ, త్యాగాలకు వీరి అవిరళ కృషి ఎంతమాత్రం తీసిపోనిదని అభివర్ణించారు. ఈ విజయం మన శాస్త్రవేత్తల అకుంఠిత దీక్షకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ యువజన సంక్షేమ-క్రీడలు, సహకార శాఖల మంత్రి శ్రీ విశ్వాస్ సారంగ్, భోపాల్ ఎంపీ శ్రీ అలోక్ శర్మ, ఖాటేగావ్ ఎమ్మెల్యే శ్రీ ఆశిష్ శర్మ, భోపాల్ మేయర్ శ్రీమతి మాలతీ రాయ్, సీనియర్ ప్రజాప్రతినిధులు శ్రీ రాకేష్ శర్మ, శ్రీ నరేష్ మేవాడా, శ్రీ రాకేష్ జాదోన్, శ్రీ రాజేష్ చౌక్సే, కుమారి ఛాయా సహా పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. వీరితో పాటు ‘ఐసీఏఆర్’ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.ఎల్.జాట్, ‘ఎన్ఐహెచ్‌ఎస్‌ఏడీ’ డైరెక్టర్ డాక్టర్ అనికేత్ సన్యాల్, ఇతర శాస్త్రవేత్తలు, ప్రముఖులు కూడా హాజరయ్యారు.
***