గోవాలో 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫి) ప్రారంభమైన సందర్భంగా ఫెస్టివల్ డైరెక్టర్, ప్రముఖ సినీ దర్శకుడు అశుతోష్ గోవారికర్.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ప్రచురిస్తున్న రోజువారీ చలనచిత్రోత్సవ సమాచార పత్రిక (న్యూస్ లెటర్) ‘ఐఫిలోయిడ్’ అయిదో సంపుటి, తొలి సంచికను నేడు ప్రారంభించారు.
మరోసారి ఇఫి చిత్రోత్సవంలోకి అడుగుపెడుతున్న ‘ఇఫిలోయిడ్’.. పాఠకులకు సినిమా ప్రపంచంలోని సందడిని, వైవిధ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించనుంది. సినిమాలను, దర్శకనిర్మాతలను, సినీ ప్రముఖుల ఆసక్తికర చర్చలను, మధురమైన జ్ఞాపకాలను ఒకే వేదికపైకి తీసుకొస్తూ ఈ చిత్రోత్సవాన్ని ఒక అద్భుతమైన కథా వేడుకగా ఆవిష్కరిస్తుంది.
ఈ న్యూస్ లెటర్‌లో చలనచిత్రోత్సవ ముఖ్య విశేషాలు, ఆసక్తికర కథనాలు, ఛాయాచిత్రాలు, కార్యక్రమాల షెడ్యూల్, కీలక ఈవెంట్లకు సంబంధించిన తాజా సమాచారం ప్రచురించనున్నారు. ప్రత్యేక సినిమా ప్రదర్శనలు, దర్శకులు, నటీనటులతో ముఖాముఖి సంభాషణలు, సినిమా ప్రదర్శనలు, ఇతర ఉత్సవ కార్యక్రమాల వరకు.. చలనచిత్రోత్సవం పొడవునా చోటుచేసుకునే విభిన్న అనుభవాలను ‘ఐఫిలోయిడ్’లో పొందుపరచనున్నారు.
57వ ఇఫి ఇతివృత్తమైన ‘విశ్వజనీన కథనాలు’ స్ఫూర్తితో ఈ న్యూస్ లెటర్ రూపొందింది. ప్రజలు, సంస్కృతులు, విభిన్న దృక్పథాలను అనుసంధానించడంలో సినిమాకు ఉన్న శక్తిని చాటిచెప్పనుంది. చలన చిత్రోత్సవాన్ని కేవలం సినిమా ప్రదర్శన వేదికలకే పరిమితం చేయకుండా, సినీ ప్రియులు, పాఠకులు ఇఫిలో జరుగుతున్న తాజా పరిణామాలతో నిరంతరం అనుసంధానమై ఉండేలా చూడటం దీని లక్ష్యం.
నవంబర్ 20 నుంచి 29 వరకు చలనచిత్రోత్సవం జరిగే ప్రతిరోజూ ‘ఐఫిలోయిడ్’ ప్రచురితమవుతుంది. ఇఫిపై పీఐబీ అందించే అధికారిక సమాచారానికి అదనంగా, చలనచిత్రోత్సవ తాజా సమాచారం, ముఖ్య విశేషాలను సులభంగా చదివేలా, ఆకట్టుకునే దృశ్యరూపంలో అందించనుంది.
***
‘ఐఫిలోయిడ్’ తొలి సంచిక పీఐబీ అధికారిక ఇఫి వేదికలో అందుబాటులో ఉంది. ఆసక్తిగల పాఠకులు ఈ న్యూస్ లెటర్‌ను చదవడంతో పాటు, చలనచిత్రోత్సవం ముగిసే వరకు వెలువడే తదుపరి సంచికలను కూడా అనుసరించవచ్చు.
ఇఫిలోయిడ్‌ను ఇక్కడ చూడవచ్చు:: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48