‘ఎల్లలు లేని కథా ప్రపంచం’ ఇతివృత్తంతో నిర్వహిస్తోన్న ఈ ఏడాది చలనచిత్రోత్సవం.. వివిధ దేశాలు, సంస్కృతులు, చలనచిత్ర సంప్రదాయాలకు చెందిన చిత్రాలను, సృజనాత్మక స్వరాలను ఒకే చోటికి తీసుకువస్తూ సినిమాకు సార్వత్రిక భాషను వేడుక చేసుకోనుంది.
గోవాలోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరిగే ప్రారంభోత్సవ వేడుకలో సంగీత ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, లాంఛనప్రాయ కార్యక్రమాలు ఉంటాయి. ఇవి తొమ్మిది రోజుల చలనచిత్రోత్సవ ప్రారంభాన్ని తెలియజేస్తాయి.
ఈ వేడుక సౌండ్, లైట్ ప్రజెంటేషన్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జాతీయ గేయం, జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. వెలుతురు, జీవం, నూతన ఆరంభాలకు ప్రతీకగా జ్యోతి ప్రజ్వలన, తులసి మొక్కకు నీరు పోయడంతో లాంఛనప్రాయ ప్రారంభోత్సవం జరుగుతుంది.
పాల్గొననున్న ప్రముఖులు
ఈ వేడుకలో గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, కేంద్ర సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ ప్రముఖులు ప్రసంగించనున్నారు.
ఈ ప్రారంభోత్సవ వేడుకలో పార్లమెంటు సభ్యుడు రవి కిషన్, చలనచిత్ర నిర్మాత- చలనచిత్రోత్సవ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్, చలనచిత్ర నిర్మాత మధుర్ భండార్కర్, చలనచిత్ర నిర్మాత ఆనంద్ ఎల్. రాయ్ సహా భారతీయ సినిమా రంగానికి చెందిన ప్రముఖులతో పాటు స్వదేశీ, అంతర్జాతీయ చలనచిత్ర రంగానికి చెందిన ఇతర ప్రముఖులు పాల్గొంటారు.
రికీ కేజ్ సింఫోనిక్ ఆర్కెస్ట్రా ప్రదర్శన
సాయంత్రం జరగనున్న ప్రారంభోత్సవంలో ప్రధాన ఆకర్షణగా మూడుసార్లు గ్రామీ అవార్డు విజేత, స్వరకర్త, పర్యావరణవేత్త రికీ కేజ్ ‘సంగీతం ద్వారా సినిమా ప్రపంచం’ పేరుతో సింఫోనిక్ ఆర్కెస్ట్రా ప్రదర్శన ఇవ్వనున్నారు. విభిన్న సంస్కృతులు, కథన సంప్రదాయాల మీదుగా సాగే సంగీత ప్రయాణం ద్వారా ఈ ప్రదర్శన సినిమా సార్వత్రిక భాషకు జీవం పోయనుంది.
ఈ సంగీత ప్రదర్శన అనంతరం ‘ఎల్లలు లేని కథా ప్రపంచం’ కార్యక్రమం జరుగుతుంది. చలనచిత్రోత్సవ ఇతివృత్తాన్ని ప్రతిబింబించేలా సంగీత సంప్రదాయాలు, సామరస్యం, సాంస్కృతిక మార్పిడిని తెలియజేస్తూ వివిధ దేశాలకు చెందిన సంగీతకారులను ఇది ఒకే వేదికపైకి తీసుకువస్తుంది.
ఇఫీతో ముడిపడి ఉన్న నెమలి చిహ్నం ‘బియాండ్ ది ఫ్రేమ్’ అనే ప్రత్యేక నృత్య ప్రదర్శన ద్వారా సజీవంగా ఆవిష్కృతం కానుంది. కదలికలు, కళాత్మక వ్యక్తీకరణ ద్వారా ఉత్సవ ఐకానిక్ చిహ్నానికి ఇది జీవం పోస్తుంది.
ఈ వేడుకలో ఇండియన్ పనోరమా, అంతర్జాతీయ పోటీ విభాగాల న్యాయనిర్ణేతల సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది. చలనచిత్రోత్సవ పోటీ విభాగాలకు చిత్రాలను ఎంపిక చేసే బాధ్యతను అప్పగించిన చలనచిత్ర నిర్మాతలు, సినీ నిపుణులను ఈ సందర్భంగా గౌరవిస్తారు.
అంతర్జాతీయ పోటీ విభాగం జ్యూరీ
అంతర్జాతీయ పోటీ విభాగం జ్యూరీకి చలనచిత్ర నిర్మాత ఆనంద్ ఎల్. రాయ్ అధ్యక్షత వహిస్తారు. ఇందులో సోల్ బెరూజో పిచోన్-రివియర్ (అర్జెంటీనా), బోగ్డాన్ మురెసాను (రొమేనియా), మరియా అలెజాండ్రా రోజాస్ (కొలంబియా), రాట్చాపూమ్ బూన్‌బంచాచోక్ (థాయిలాండ్) సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశిష్ట సినీ నిపుణులు సభ్యులుగా ఉంటారు. ప్రారంభోత్సవ వేడుకలో ఈ జ్యూరీ సభ్యులను సన్మానించనున్నారు.
ఇండియన్ పనోరమా జ్యూరీ
ఫీచర్ ఫిల్మ్ జ్యూరీకి జాతీయ అవార్డు గ్రహీత, చలనచిత్ర నిర్మాత మధుర్ భండార్కర్ అధ్యక్షత వహిస్తుండగా నాన్-ఫీచర్ ఫిల్మ్ జ్యూరీకి చలనచిత్ర నిర్మాత, సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ హిమాన్షు శేఖర్ ఖతువా అధ్యక్షత వహిస్తారు.
వేవ్స్ ఫిల్మ్ బజార్ రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఒక ప్రత్యేక ప్రదర్శన.. భారతీయ చలనచిత్ర నిర్మాతలను అంతర్జాతీయ చలనచిత్ర పరిశ్రమతో అనుసంధానించే, సృజనాత్మక, వాణిజ్య సహకారాలను సులభతరం చేసే వేదికగా దాని పరిణామ క్రమాన్ని ఆవిష్కరించనుంది.
ప్రపంచం నలుమూలల ప్రతినిధులతో తొమ్మిది రోజుల పాటు చలనచిత్రాల పండుగ
ప్రశంసలు పొందిన అంతర్జాతీయ చిత్రాల నుంచి వర్ధమాన ప్రతిభావంతుల స్వరాలు, వైవిధ్యభరితమైన భారతీయ కథల వరకు ఇఫీ 2026 ప్రేక్షకులకు విస్తృతమైన సినీ అనుభూతిని అందించనుంది. ఈ చలనచిత్రోత్సవంలో 86 దేశాలకు చెందిన 150కి పైగా అంతర్జాతీయ చిత్రాలను ప్రదర్శించనున్నారు. తద్వారా విభిన్న కథన సంప్రదాయాలు, దృక్కోణాలను గోవాకు తీసుకురానున్నారు.
2026 కేన్స్ ఫిల్మ్ చలనచిత్రోత్సవంలో ఉత్తమ దర్శకుడి అవార్డును గెలుచుకున్న ప్రఖ్యాత పోలిష్ చలనచిత్ర నిర్మాత పావెల్ పావ్లికోవ్‌స్కీ దర్శకత్వం వహించిన ‘ఫాదర్‌ల్యాండ్’ చిత్రంతో ఈ చలనచిత్రోత్సవం ప్రారంభమవుతుంది. రొమేనియా-జర్మనీ-బెల్జియం సంయుక్త నిర్మాణంలో రూపొంది రొమేనియన్, రొమానీ భాషల్లో ఉన్న అలినా సెర్బన్ దర్శకత్వం వహించిన ‘ఐ మ్యాటర్’ మిడ్-ఫెస్ట్ చిత్రంగా ప్రదర్శిస్తారు. నవంబర్ 28న జరిగే ముగింపు వేడుకలో సింగపూర్ చలనచిత్ర నిర్మాత ఆంథోనీ చెన్ దర్శకత్వం వహించిన ‘వి ఆర్ ఆల్ స్ట్రేంజర్స్’ చిత్రంతో తొమ్మిది రోజుల ప్రపంచ చలనచిత్ర వేడుక ముగుస్తుంది. స్పెయిన్ గౌరవ దేశంగా, రష్యా భాగస్వామ్య దేశంగా వ్యవహరిస్తూ పోటీలు, ప్రత్యేకంగా ఎంపిక చేసిన ప్రదర్శనలు, దేశాల వారీ ప్రదర్శనల ద్వారా ఈ చలనచిత్రోత్సవం అంతర్జాతీయ సినిమాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది.
18 భాషల్లో 76 చిత్రాలను ప్రదర్శించే ఇండియన్ పనోరమా ద్వారా భారతీయ సినిమాకు ప్రముఖ స్థానం లభించనుంది. బ్రిక్స్ సినిమాపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా సభ్య, భాగస్వామ్య దేశాల చిత్రాలకు మరింత ప్రాధాన్యత దక్కనుంది.
విభిన్న విభాగాలలో సినీ ప్రతిభను గుర్తిస్తూ అంతర్జాతీయ పోటీ విభాగం, ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ మెడల్ వంటి ఇతర పోటీ విభాగాలతో పాటు ఉత్తమ తొలి ఫీచర్ సినిమా పోటీ ద్వారా వర్ధమాన చలనచిత్ర నిర్మాతలను ఈ ఉత్సవం సత్కరించనుంది.
ఇఫీ 2026 లో నూతన విభాగాలు
తన సినీ ప్రదర్శనల పరిధిని విస్తృతం చేయడానికి, విభిన్న కథన రూపాలను వేడుకగా జరుపుకోవడానికి ఈ ఏడాది చలనచిత్రోత్సవం రెండు కొత్త విభాగాలను పరిచయం చేస్తోంది. మొదటి విభాగమైన ‘యానిమేషన్’లో ఐదు అత్యుత్తమ చిత్రాలను ప్రదర్శిస్తారు. ఇవి యానిమేటెడ్ సినిమాలో సృజనాత్మకత, ఆవిష్కరణలను చాటిచెబుతాయి. రెండో విభాగమైన ‘ఫిల్మ్స్ అబౌట్ ఫిల్మ్స్’.. చలనచిత్ర నిర్మాణ కళ, నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఐదు చిత్రాలను ప్రదర్శిస్తుంది.
గోల్డెన్ పీకాక్, సిల్వర్ పీకాక్ అవార్డులు
చలనచిత్రోత్సవ పోటీ విభాగాలు ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ పీకాక్, సిల్వర్ పీకాక్ అవార్డుల ద్వారా సినీ ప్రతిభను గుర్తించి గౌరవిస్తాయి. ఇందులో ఆరు అవార్డులు ఉంటాయి. ఉత్తమ చిత్రానికి గోల్డెన్ పీకాక్ పురస్కారాన్ని ప్రదానం చేయనుండగా.. సిల్వర్ పీకాక్ అవార్డులు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ప్రత్యేక జ్యూరీ అవార్డు, ఒక దర్శకుడి ఉత్తమ తొలి ఫీచర్ ఫిల్మ్ విభాగాలలో ప్రతిభను గుర్తిస్తాయి. సహనం, వివిధ సాంస్కృతుల మధ్య చర్చ, శాంతి సంస్కృతిని ప్రోత్సహించే చిత్రానికి ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ మెడల్‌ను కూడా ఈ ఉత్సవం ప్రదానం చేయనుంది.
‘క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో’ కార్యక్రమంతో యువ ఔత్సాహిక చలనచిత్ర నిర్మాతలకు మాస్టర్‌క్లాస్‌లు, వర్క్‌షాప్‌లు, ఇంటరాక్టివ్ సెషన్‌లు, 48-గంటల ఫిల్మ్‌మేకింగ్ ఛాలెంజ్ ద్వారా పరిశ్రమ నిపుణుల నుంచి నేర్చుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి, చలనచిత్ర నిర్మాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి అవకాశాలు లభిస్తాయి.
చలనచిత్ర ప్రదర్శనలకే పరిమితం కాకుండా ప్రత్యేకంగా రూపొందించిన చర్చా కార్యక్రమాలు, పరిశ్రమ ఆధారిత కార్యక్రమాల ద్వారా చలనచిత్ర నిర్మాతలు, కళాకారులు, విద్యార్థులు, పరిశ్రమ నిపుణుల మధ్య విస్తృత భాగస్వామ్యాన్ని ఈ ఉత్సవం సులభతరం చేయనుంది. ఇఫీతో పాటుగా నిర్వహిస్తున్న ‘వేవ్స్ ఫిల్మ్ బజార్’, చలనచిత్ర నిర్మాతలు, ప్రొడ్యూసర్లను కొనుగోలుదారులు, పంపిణీదారులు, ఇతర భాగస్వాములతో అనుసంధానిస్తూ సృజనాత్మక మార్పిడి, పరస్పర సహకారం, పరిశ్రమ అవకాశాలకు ఒక వేదికను అందించనుంది.
1952లో ఏర్పడిన ఇఫీ.. భారతీయ- అంతర్జాతీయ సినిమాలను ప్రదర్శించడానికి, సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చలనచిత్ర నిర్మాతలు, పరిశ్రమ నిపుణులు, ప్రేక్షకులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఒక ముఖ్యమైన వేదికగా కొనసాగుతోంది.
***