నాడు పోస్టు చేయడమైనది:
19 NOV 2026 3:10PM by PIB Hyderabad
ఏరో ఇండియా - 2027 ప్రదర్శనకు సంబంధించి మీడియా ప్రతినిధుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసియాలో అతిపెద్ద వైమానిక ప్రదర్శన, ప్రపంచంలోని ప్రముఖ ఏరోస్పేస్ - రక్షణ రంగ ప్రదర్శనల్లో ఒకటైన ఈ 16వ ఎడిషన్.. 2027 ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు కర్ణాటకలోని బెంగళూరు, యలహంక వైమానిక దళ విమానాశ్రయంలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి ఆసక్తి ఉన్న మీడియా ప్రతినిధులు https://aeroindia.gov.in/ వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2027 జనవరి 4వ తేదీతో ముగుస్తుంది.
నమోదు కోసం దరఖాస్తుదారుల వద్ద కింద పేర్కొన్న డాక్యుమెంట్లు తప్పక ఉండాలి:
· గుర్తింపు పొందిన జర్నలిస్టులకు పీఐబీ రాష్ట్ర అక్రెడిటేషన్ కార్డు ఉండాలి. గుర్తింపు పొందని మీడియా వ్యక్తులు చెల్లుబాటు అయ్యే మీడియా గుర్తింపు కార్డును సమర్పించాల్సి ఉంటుంది. (ఫైల్ పరిమాణం 1 ఎంబీ మించకూడదు)
· మీడియా సిబ్బంది అందరికీ ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు. (ఫైల్ పరిమాణం 1 ఎంబీ మించకూడదు)
· తాజా ఫొటో (ఫైల్ పరిమాణం 512 కేబీ మించకూడదు)
· విదేశీ జర్నలిస్టుల కోసం చెల్లుబాటు అయ్యే ‘జె’ వీసా. (ఫైల్ పరిమాణం 1 ఎంబీ మించకూడదు)
రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన రక్షణ ఉత్పత్తుల విభాగం నిర్వహిస్తున్న ‘ఏరో ఇండియా - 2027’.. ప్రముఖ ఏరోస్పేస్, రక్షణ రంగ సంస్థలు, విధాన నిర్ణేతలు, సాంకేతిక నిపుణులు, ఆవిష్కర్తలు, పారిశ్రామిక ప్రతినిధులు, రక్షణ సిబ్బందిని ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రధాన అంతర్జాతీయ వేదికగా నిలవనుంది. అయిదు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో విస్తృతమైన ప్రదర్శనలతోపాటు.. పారిశ్రామిక భాగస్వామ్యాలు, ప్రభుత్వ-పారిశ్రామిక రంగాల మధ్య చర్చలు, సాంకేతిక ప్రదర్శనలు, వైజ్ఞానిక వినిమయానికి వీలు కల్పించే పలు వ్యాపార, వ్యూహాత్మక సమావేశాలను నిర్వహిస్తారు. అత్యాధునిక విమానయాన సాంకేతికతలు, సామర్థ్యాలను చాటేలా.. భారత వైమానిక దళం, ప్రదర్శనలో పాల్గొంటున్న అంతర్జాతీయ వైమానిక బృందాలు ప్రదర్శించే అద్భుతమైన విన్యాసాలు ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
‘ఆత్మనిర్భర్ భారత్’పై దేశ నిబద్ధతను మరింత బలోపేతం చేయడమే కాకుండా.. ప్రపంచ ఏరోస్పేస్, రక్షణ రంగ సరఫరా వ్యవస్థలో ఒక విశ్వసనీయ భాగస్వామిగా భారత్ స్థానాన్ని ఈ 16వ ఏరో ఇండియా ప్రదర్శన సుస్థిరం చేస్తుందని భావిస్తున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థలు సహా భారతీయ రక్షణ రంగ పరిశ్రమలకు తమ సామర్థ్యాలను చాటుకోవడానికి, కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి, భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి ఈ వేడుక ఒక ప్రధాన వేదికను అందిస్తుంది. తద్వారా పెట్టుబడులు, ఎగుమతులు, సాంకేతిక సహకారాలను ప్రోత్సహిస్తుంది.
***