హిమాలయ ప్రాంతపు పర్వతాలు, బౌద్ధ మఠాలు, మంచుతో కప్పి ఉన్న గ్రామాలు, సజీవ హస్తకళలు గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) వేదికగా ఆవిష్కృతం కానున్నాయి. లదాఖీ, కాశ్మీరీ భాషల్లో తెరకెక్కిన రెండు ఫీచర్, రెండు నాన్-ఫీచర్ చిత్రాలు అక్కడి ప్రకృతి అందాలను, సంప్రదాయాలను, సామాన్యుల జీవిత కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి. ముఖ్యంగా... ఇండియన్ పనోరమా నాన్-ఫీచర్ విభాగంలో ప్రారంభ చిత్రంగా ప్రదర్శించనున్న లదాఖీ లఘుచిత్రం 'బికమింగ్' ఈ ప్రత్యేక ప్రదర్శనకు నాంది పలకనుంది.
లదాఖీ చిత్రాలు:
లీనా యాదవ్ రచన, దర్శకత్వంలో రూపొందిన 11 నిమిషాల లదాఖీ లఘు చిత్రం 'బికమింగ్'... ఇండియన్ పనోరమా నాన్-ఫీచర్ విభాగంలో ప్రారంభ చిత్రంగా ప్రదర్శితమవుతోంది. లదాఖ్ నేపథ్యంలో సాగే ఈ కథ... రిన్‌చెన్ అనే యువ తల్లి, పసితనం నుంచే ప్రకృతితో విడదీయరాని అనుబంధాన్ని కలిగి ఉన్న ఆమె కుమారుడు అగ్యల్ చుట్టూ తిరుగుతుంది. ఏడేళ్ల వయసులో అగ్యల్‌కు వింత దృశ్యాలు కనిపించడం, పురాతన లికిర్ బౌద్ధ మఠం వైపు ఆకర్షితుడవడం, గత జన్మకు సంబంధించిన జ్ఞాపకాలు గుర్తుకురావడం జరుగుతుంది. ఆ మఠంలోని ఒక తాళం వేసిన గదిలో గల పెట్టెను అగ్యల్ గుర్తించడంతో, అందులోని వస్తువులను చూసిన బౌద్ధ సన్యాసులు అతడిని ఒక గౌరవనీయ 'రింపోచే' పునర్జన్మగా విశ్వసిస్తారు. అగ్యల్ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలయ్యే క్రమంలో పునర్జన్మ, విధి, గతం-వర్తమానం-భవిష్యత్తుల మధ్య సంబంధాలను ఈ చిత్రం అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. రిన్‌చెన్ ఆంగ్మో, త్సెరింగ్ వాంగ్‌గైల్ ఇందులో నటించారు. 'పార్చ్‌డ్', 'రాజ్మా చావల్', 'హౌస్ ఆఫ్ సీక్రెట్స్' వంటి పురస్కార చిత్రాలతో పాటు ఆస్కార్ కోసం నామినేట్ అయిన 'టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్' చిత్రానికి పనిచేసిన ప్రముఖ దర్శకురాలు, నిర్మాత లీనా యాదవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
సాహిల్ షా దర్శకత్వంలో రూపొందిన 85 నిమిషాల లదాఖీ ఫీచర్ ఫిల్మ్ 'బర్డ్స్ ఆన్ ఐస్'... ఇండియన్ పనోరమా ఫీచర్ ఫిల్మ్స్ విభాగంతో పాటు ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు కేటగిరీకీ ఎంపికైంది. గొర్రెల కాపరులైన తన తల్లిదండ్రుల రాక కోసం ఎదురుచూస్తూ... తాతయ్య వద్ద పెరుగుతున్న తాషి అనే లదాఖ్ బాలిక చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒకరి వద్ద నుంచి అరువు తెచ్చుకున్న ఐస్-హాకీ స్కేట్స్ ఆమె చేతికి అందడంతో ఆమెలో ఓ కొత్త కల మొలకెత్తుతుంది. కఠినమైన హిమాలయ చలికాలంలో ఎదుగుతున్న క్రమంలో... కుటుంబం, విషాదం, మనుగడకు సంబంధించిన చేదు నిజాలను తాషి తెలుసుకుంటుంది. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా, తన ప్రాణ స్నేహితుడితో కలిసి తన కలను సాకారం చేసుకునేందుకు ఆమె తనదైన మార్గాన్ని ఎంచుకుంటుంది. తాషి పాత్రలో సెమ్జాంగ్ స్కిట్‌డన్ నటించగా... ఎన్. చోపాల్, కుంగా చోస్క్‌యాబ్, పద్మ చోరోల్, సోనమ్ స్టోబ్‌గైస్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. షాన్ పస్రీచా రచన చేయగా, కామియో ఫిల్మ్స్ నిర్మించింది. ఐస్-హాకీ క్రీడాకారుల స్ఫూర్తితో సాహిల్ షా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ఇది.
కాశ్మీరీ చిత్రాలు:
రాజా షబీర్ మహమ్మద్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన 75 నిమిషాల కాశ్మీరీ ఫీచర్ ఫిల్మ్ 'స్లెడ్జ్'... ఐఎఫ్ఎఫ్ఐ-2026 వేదికపై ఆసియా ప్రీమియర్‌గా ప్రదర్శితం కానుంది. ఇండియన్ పనోరమా విభాగంలో చోటు దక్కించుకున్న ఈ చిత్రం... భారతీయ చిత్రాల విభాగంలో ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు పురస్కారం కోసం పోటీపడుతోంది. గుల్మార్గ్ సమీపంలోని ఓ మంచుతో కప్పి ఉండే గ్రామంలో నివసించే అలీ కుటుంబానికి మంచుపై లాగే ఓ బండి మాత్రమే ఏకైక జీవనాధారం. అలీ కొన్ని రోజుల పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో... అతడి ముగ్గురు పిల్లలైన హాజిక్, ఈషెల్, రైమా ఆడుకుంటూ అనుకోకుండా ఆ బండిని విరగ్గొడతారు. తండ్రి తిరిగి వచ్చేలోపు దానిని బాగు చేయించాలనే తాపత్రయంతో ఆ చిన్నారులు గుల్మార్గ్ పర్యాటక ప్రాంతంలో డబ్బు సంపాదించేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఎన్నో తిరస్కారాలను, నిశ్శబ్ద అవమానాలను ఎదుర్కొంటారు. సరిగ్గా అప్పుడే వారికి డబ్బు, చాక్లెట్లతో నిండిన బ్యాగ్ దొరుకుతుంది. తమ సమస్యకు పరిష్కారం దొరికిందనుకునే లోపే... ఆ డబ్బును వాడుకోవాలనే ఆశకు, తమ అంతరాత్మకు మధ్య ఆ పిల్లలు నలిగిపోతారు. రాజా ఖాన్... సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ పూర్వ విద్యార్థి. గతంలో ఆయన రూపొందించిన 'షెపర్డ్స్ ఆఫ్ పారడైజ్' డాక్యుమెంటరీకి జాతీయ పురస్కారం లభించింది. రిహానా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో హాజిక్ మహమ్మద్ ఖాన్, ఈషెల్ ఖాన్, రైమా ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు.
బాబా తస్సదుక్ హుస్సేన్ దర్శకత్వ, సినిమాటోగ్రఫీ బాధ్యతలూ నిర్వర్తించిన 12 నిమిషాల కాశ్మీరీ డాక్యుమెంటరీ చిత్రం 'నక్ష్-ఎ-దౌర్'... ఇండియన్ పనోరమా నాన్-ఫీచర్ విభాగంలో ప్రదర్శితం కానుంది. శ్రీనగర్ పాతబస్తీ వీధుల్లో నివసించే గులాం నబీ దార్... గత ఆరు దశాబ్దాలుగా కాశ్మీర్ సంప్రదాయ వాల్‌నట్ చెక్క శిల్ప కళను కొనసాగిస్తున్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన ఆయన... ఆ ప్రాంత చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబించే అత్యంత సున్నితమైన నగిషీలను చెక్కుతుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ కళను సజీవంగా ఉంచేందుకు ఆయన పడుతున్న తపనను, ఆయన జీవిత ప్రయాణాన్ని ఈ చిత్రం కళ్లకు కడుతుంది. ఈ హస్తకళ వైపు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతున్నప్పటికీ... కాశ్మీర్ దారుశిల్ప సంప్రదాయం అంతరించిపోకుండా కాపాడేందుకు ఆయన తన కళను కొనసాగిస్తూనే, తరువాతి తరానికి ఆ నైపుణ్యాన్ని నేర్పిస్తున్నారు. భరత్‌బాల కథ అందించిన ఈ చిత్రాన్ని బీబీపీ స్టూడియో వర్చువల్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది.
***