వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో ఉద్యాన పంటల ఉత్పత్తి 2025-26లో రికార్డు స్థాయిలో 386.9 మిలియన్‌ టన్నులకు చేరే అవకాశం: మూడో ముందస్తు అంచనాలను విడుదల చేసిన శ్రీ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ 4.36 శాతం పెరగనున్న ఉద్యాన ఉత్పత్తి.. పండ్లు, కూరగాయలు, పూలు, తోట పంటల్లో గణనీయమైన వృద్ధి

దాదాపు 12 శాతం పెరగనున్న బంగాళాదుంపల ఉత్పత్తి.. మొత్తం ఉద్యాన పంటల దిగుబడిలో 16.17 మిలియన్‌ టన్నుల వృద్ధి అంచనా

పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, అధిక విలువ కలిగిన పంటల సాగుతో రైతులకు కొత్త అవకాశాలు: శ్రీ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

నాడు పోస్టు చేయడమైనది: 17 NOV 2026 12:25PM by PIB Hyderabad

ఉద్యానవన పంటల విస్తీర్ణం, ఉత్పత్తిపై 2025-28 ఏడాదికి సంబంధించి మూడో ముందస్తు అంచనాలను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ నేడు విడుదల చేశారు. ఈ అంచనాలు దేశంలోని రైతులకు ప్రోత్సాహకరమైన వివరాలను అందిస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం.. 2025-26లో దేశ మొత్తం ఉద్యానవన పంటల ఉత్పత్తి 3,869.15 లక్షల టన్నులకు చేరనుంది. 2024-25లో నమోదైన 3,707.38 లక్షల టన్నులతో పోలిస్తే ఇది 161.77 లక్షల టన్నులు లేదా 4.36 శాతం అధికం. అంచనా వేసిన ఈ వృద్ధిపై శ్రీ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యాన పంటల ఉత్పత్తిలో నమోదైన గణనీయమైన పెరుగుదల భారత రైతుల కష్టానికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ విధానాల ప్రభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ రికార్డు స్థాయి ఉత్పత్తి దేశ పోషకాహార భద్రతను బలోపేతం చేయడమే కాకుండా, ఉద్యాన పంటలు సాగుచేసే రైతుల ఆదాయం పెరగడానికి కూడా నేరుగా దోహదపడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఇందుకు దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ వృద్ధి భారత రైతాంగం అంకితభావానికి, కష్టానికి ప్రతిబింబమని పేర్కొన్నారు.

భారత వ్యవసాయ రంగంలో గణనీయమైన, ప్రోత్సాహకరమైన వైవిధ్యీకరణ చోటుచేసుకుంటోందని శ్రీ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. రైతులు సంప్రదాయ పంటల సాగును దాటి పండ్లు, కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పు, కొబ్బరి, కోకో వంటి తోట పంటలతోపాటు సుగంధ, ఔషధ మొక్కల సాగు వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని తెలిపారు. వాణిజ్యపరమైన, అధిక విలువ కలిగిన పంటలపై రైతుల్లో పెరుగుతున్న ఆసక్తి వారి ఆదాయానికి కొత్త మార్గాలను అందించడంతోపాటు, వ్యవసాయ రంగంలో స్వావలంబన, వృద్ధికి కొత్త అవకాశాలను కల్పిస్తోందని చెప్పారు. తాజా అంచనాల్లో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ ఉత్పత్తి పెరగడం అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఒకటి అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 2024-25లో 301.36 లక్షల హెక్టార్లుగా ఉన్న ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 2025-26లో సుమారు 297.21 లక్షల హెక్టార్లకు తగ్గుతుందని అంచనా వేశారు. సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ పండ్లు, కూరగాయలు, పూలు, తోట పంటలు, సుగంధ, ఔషధ మొక్కల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు.

ఈ అంచనాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి అందిన సమాచారం ఆధారంగా వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఈ గణాంకాలు ఉద్యాన రంగంలో కొనసాగుతున్న వృద్ధితోపాటు మెరుగుపడుతున్న ఉత్పాదకతను ప్రతిబింబిస్తున్నాయి.

పండ్ల ఉత్పత్తిలో 4.60 శాతం వృద్ధి అంచనా
 పండ్ల ఉత్పత్తి 2024-25లో 1,176.49 లక్షల టన్నులుగా ఉండగా, 2025-26లో 1,230.66 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా వేశారు. ఇది 54.18 లక్షల టన్నులు లేదా 4.60 శాతం వృద్ధి. అరటి, మామిడి, బొప్పాయి, ఆపిల్‌, దానిమ్మ, పనస పండ్ల ఉత్పత్తి పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

2,272.68 లక్షల టన్నులకు చేరనున్న కూరగాయల ఉత్పత్తి
కూరగాయల సాగులోనూ రైతులు ప్రోత్సాహకరమైన వృద్ధిని నమోదు చేశారు. కూరగాయల సాగు విస్తీర్ణం 117.91 లక్షల హెక్టార్ల నుంచి 119.31 లక్షల హెక్టార్లకు పెరుగుతుందని అంచనా. 2024-25లో 2,177.97 లక్షల టన్నులుగా ఉన్న కూరగాయల ఉత్పత్తి, 2025-26లో 4.35 శాతం వృద్ధితో 2,272.68 లక్షల టన్నులకు చేరుతుందని అంచనా. బంగాళాదుంప, టమాటా, వంకాయ, సొరకాయ, దోసకాయ, క్యాబేజీ, చిక్కుడు, బఠానీల ఉత్పత్తి పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణం. బంగాళాదుంప, టమాటా ఉత్పత్తులు రెండింటిలోనూ గణనీయమైన వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నారు. బంగాళాదుంపల ఉత్పత్తి గత ఏడాది 585.71 లక్షల టన్నులతో పోలిస్తే 11.95 శాతం పెరిగి 655.70 లక్షల టన్నులకు చేరుతుందని భావిస్తున్నారు. టమాటా ఉత్పత్తి 205.99 లక్షల టన్నుల నుంచి 214.11 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా. ఉల్లి ఉత్పత్తి 288.96 లక్షల టన్నులుగా ఉంటుందని అంచనా వేశారు.

పూల ఉత్పత్తిలో 14.45 శాతం వృద్ధి అంచనా
పూల ఉత్పత్తిలోనూ గణనీయమైన పెరుగుదల నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. 2024-25లో 42.65 లక్షల టన్నులుగా ఉన్న పూల ఉత్పత్తి 2025-26లో సుమారు 14.45 శాతం వృద్ధితో 48.82 లక్షల టన్నులకు చేరుతుందని అంచనా. పూల సాగు విస్తీర్ణం కూడా 4.10 లక్షల హెక్టార్లకు పెరిగింది.

తోట పంటలు, సుగంధ, ఔషధ మొక్కల ఉత్పత్తిలో వృద్ధి
వక్క, కొబ్బరి, జీడిపప్పు, తమలపాకులు, కోకో తదితర తోట పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి రెండింటిలోనూ పెరుగుదల నమోదవుతుందని మూడో ముందస్తు అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ పంటల మొత్తం ఉత్పత్తి 7.56 శాతం పెరిగి 182.64 లక్షల టన్నులకు చేరుతుందని అంచనా. సుగంధ, ఔషధ మొక్కల ఉత్పత్తి కూడా 9.01 లక్షల టన్నుల నుంచి 9.28 లక్షల టన్నులకు పెరుగుతుందని భావిస్తున్నారు.

సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి 123.54 లక్షల టన్నులుగా అంచనా
వక్క
, సుగంధ ద్రవ్యాల అభివృద్ధి డైరెక్టరేట్‌ గణాంకాల ప్రకారం.. పసుపు, వెల్లుల్లి, కరివేపాకు, యాలకుల ఉత్పత్తి పెరగడం ఈ రంగం వృద్ధికి దోహదపడనుంది. 2025-26లో సుగంధ ద్రవ్యాల సాగు విస్తీర్ణం 47.56 లక్షల హెక్టార్లుగా, ఉత్పత్తి 123.54 లక్షల టన్నులుగా ఉంటుందని అంచనా వేశారు.

***


(రిలీజ్ ఐడి: 2337498) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Odia , Punjabi , Tamil , Kannada , Assamese , English , Urdu , हिन्दी , Gujarati