‘సరిహద్దుల అతీత కథా వేదిక’ ఇతివృత్తంగా నిర్వహించే భారత 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) రష్యాను తన ప్రతిష్టాత్మక భాగస్వామ్య దేశంగా సగర్వంతో ప్రకటిస్తోంది. ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో సాగే ఈ వేడుకలో సమకాలీన రష్యన్ దర్శకుల అభిరుచులను ఒక ప్రసిద్ధ సోవియట్ సంగీత కళాఖండంతో అనుసంధానిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన 4 చిత్రాల ప్యాకేజీని ప్రదర్శిస్తుంది. తద్వారా భారత్-రష్యా సుస్థిర సాంస్కృతిక దౌత్యబంధం మరింత బలోపేతం అవుతుంది.
ఒక అద్భుత వ్యంగ్య ఒపెరెట్టాతోపాటు వర్ధమాన దర్శకుల ప్రతిభను రష్యా విభాగం ప్రదర్శిస్తుంది. రష్యన్ చిత్రనిర్మాణంలోని భావోద్వేగ విస్తృతిని, శైలీపరమైన సాహసాన్ని, ఇతివృత్తం పరంగా లోతును ఇది ప్రతిబింబిస్తుంది. కుటుంబ కలహాలు, సామాజిక ఒంటరితనం, వ్యక్తిగత విముక్తి వంటి అంశాలను లోతుగా విశ్లేషించే చిత్రాలు ఈ విభాగంలో ప్రదర్శితమవుతాయి. అలాగే, షోస్తాకోవిచ్ సంగీతం సమకూర్చగా, పట్టణ ఆకాంక్షలపై ఉల్లాసభరిత వ్యంగ్యంతో రూపొందిన చిత్రం మానవ స్థితిగతుల లోతుల్లోకి తీసుకెళ్తూ ఉత్సవ ప్రతినిధులను, సినీ ప్రియులను తనతో మమేకం చేసుకుంటుంది.
ఈ చలనచిత్రోత్సవంలో తొలిసారి ప్రదర్శితమయ్యే అనస్తాసియా కుజినా చిత్రం ‘బోబో’ (98 నిమిషాలు) గుర్తింపు, ఆమోదం, వివక్ష గురించి వివరించే ఒక ఉదాత్త గ్రామీణ డ్రామా. ముఖంపై పులిపిరుల వంటి నెత్తురుగడ్డల (హెమాంజియోమా) వల్ల నాడియా అనే యువతి అందరి హేళనలకు గురవుతూంటుంది. అయితే, సంగీత ప్రతిభతో తననుతాను ఆవిష్కరించుకునే ఆమె ప్రయత్నాన్ని ఈ చిత్రం కళ్లకు కడుతుంది. వాస్తవ రూపాంతరీకరణ రూపాన్ని మార్చుకోవడంలో కాకుండా, సామాజిక వివక్షను అధిగమించడంలోనే ఉంటుందని ఈ చిత్రం మనకు ప్రబోధిస్తుంది.
‘సిడ్నీ లుమెట్స్ బర్త్ డే’
వైబోర్గ్ జాతీయ చలనచిత్రోత్సవంలో గ్రాండ్ జ్యూరీ బహుమతి గెలుచుకున్న రౌల్ గైడరోవ్ చిత్రం ‘సిడ్నీ లుమెట్స్ బర్త్ డే’ (92 నిమిషాలు) ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో తొలిసారి ప్రదర్శితమవుతుంది. హృద్యమైన ఈ యవ్వనారంభ డ్రామా, 17 ఏళ్ల డాటో కుటుంబ కలహాలు, బహిష్కరణ, క్షమాపణల నడుమ తరతరాల గాయాలను మాన్పేందుకు అవసరమైన దృఢత్వ అన్వేషణను ప్రస్ఫుటం చేస్తుంది.
న్యూ హోమ్
నికితా గ్రుషిన్ దర్శకత్వం వహించిన ‘న్యూ హోమ్’ (101 నిమిషాలు) చిత్రం ఈ ఉత్సవాల్లో ప్రపంచ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. రెండో అవకాశం, విమోచన గురించి వివరించే హృద్యమైన డ్రామా ఇది. ఏడేళ్ల జైలు జీవితం తర్వాత, సామాజిక సేవా సంస్థల సాయంతో, రోమన్ మద్దతుతో తన జీవిత పునరుద్ధరణ కోసం అన్నా పోరాడుతుంది. నటీనటుల శక్తిమంతమైన నటనా ప్రతిభతో పునరేకీకరణ, గాయాలను మాన్పుకోవడం, నవ్యారంభం కోసం గతాన్ని ఎదుర్కోవడంలో ఎదురయ్యే సవాళ్లను ఈ చిత్రం కళ్లకు కడుతుంది.
చెరియోముష్కి
హెర్బర్ట్ రాపాపోర్ట్ చిత్రం ‘చెరియోముష్కి’ (91 నిమిషాలు) భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో తొలిసారి ప్రదర్శితమవుతోంది. యుద్ధానంతర మాస్కో నేపథ్యంలో సాగే ఆహ్లాదకర సంగీతభరిత వ్యంగ్య చిత్రమిది. మెరుగైన ఇంటి కోసం కలలు కనే నలుగురు యువ జంటల కథను ఈ చిత్రం మనకు వివరిస్తుంది. ఆకట్టుకునే బాణీలు, ఉత్సాహభరిత నృత్యరీతులు, హాస్యం మేళవిస్తూ సామాజిక స్ఫూర్తిని, ఐక్యతను చాటుతూనే అధికార యంత్రాంగంలోని అవినీతిని ఇది బహిర్గతం చేస్తుంది.
ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఈ చిత్రాల ప్రదర్శన భారత్-రష్యాల శాశ్వత సాంస్కృతిక సంబంధాలను ఈ 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం పునరుద్ఘాటిస్తుంది. రష్యన్ సినిమా వైవిధ్యంతోపాటు నిరంతర మార్పులకు లోనయ్యే వ్యక్తీకరణలతో మమేకమయ్యే అవకాశాన్ని ప్రేక్షకులకు కల్పిస్తుంది. విభిన్న శైలులు, దర్శక తరాలకు చెందిన ఈ నాలుగు చిత్రాలు భౌగోళిక సరిహద్దులకు అతీతంగా ఉమ్మడి మానవానుభవాల ద్వారా పరస్పర అవగాహనను పెంపొందించగల సినిమా సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి.
గోవాలో ఈ నెల 20 నుంచి 28 వరకూ ‘సరిహద్దుల అతీత కథా వేదిక’ ఇతవృత్తంగా నిర్వహిస్తున్న భారత 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం భారత్ సహా ప్రపంచవ్యాప్త చలనచిత్రాలు, దర్శకులు, సినిమా అభిమానులను ఒకే వేదికపైకి తెస్తుంది. విభిన్నజాతీయ, అంతర్జాతీయ చిత్రాలు, దేశాల విశేష ప్రదర్శనలు, ప్రీమియర్‌లు, పోటీలు, పరిశ్రమ కార్యక్రమాలతో ఈ వేడుక అందరినీ అలరిస్తుంది. తద్వారా సినిమా రంగంలో ప్రతిభానైపుణ్యాలను చాటిచెప్పే, సినిమా ద్వారా సాంస్కృతిక ఆదానప్రదానానికి తోడ్పడే తన సంప్రదాయాన్ని కొనసాగిస్తుంది.
***