ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కర్ణాటకలోని బెంగళూరులో ప్రశాంతి కుటీరం స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

· ‘‘వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం’’ అనే కార్యక్రమం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన హెచ్‌వీ శేషాద్రి శత జయంత్యుత్సవాలను మనం నిర్వహించుకొంటున్నాం: పీఎం

· గత 12 ఏళ్లుగా భారతదేశం తన సంస్కృతిని, గుర్తింపును, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రపంచానికి ప్రదర్శిస్తూ వస్తోంది... భారతదేశం తీసుకున్న ఈ చొరవ ఫలితంగానే ఇప్పుడు ప్రపంచమంతా అంతర్జాతీయ యోగా దినోత్సవం: పీఎం

· ఇప్పుడు క్రీడాంశంగా యోగాసనకు అధికారిక గుర్తింపు లభించింది. ఖేలో ఇండియా, జాతీయ క్రీడల్లో చోటు దక్కింది... టోర్నమెంటుల్లో పాల్గొనడానికి యోగ సాధకులకు కొత్త అవకాశాలు అందుతున్నాయి: పీఎం

· ఆయుర్వేద సంబంధిత పరిశోధనను, ఆయుర్వేద ఆధారిత పేటెంట్లను మేం ప్రోత్సహిస్తున్నాం, దాని ఫలితంగా భారత్ నుంచి ఆయుష్, హెర్బల్ ఎగుమతులు పెరుగుతున్నాయి: పీఎం

నాడు పోస్టు చేయడమైనది: 13 NOV 2026 2:01PM by PIB Hyderabad

కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న ప్రశాంతి కుటీరం స్వర్ణోత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. సభలో ఉన్నవారందరికీ కన్నడంలో శుభాకాంక్షలు తెలియజేశారు. బెంగళూరులోని యోగా శక్తిని అనుభూతి చెందుతున్నానని ఆనందం వ్యక్తం చేశారు. శతాబ్దాలుగా యోగాకు ప్రధాన కేంద్రంగా కర్ణాటక ఉందన్నారు. ఈ సంప్రదాయాన్ని సుసంపన్నం చేసిన అనేక మంది గురువులు, పండితులకు ఇది జన్మస్థలమని చెప్పారు. కన్నడ చలనచిత్ర దిగ్గజం డాక్టర్ రాజ్‌కుమార్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ‘‘కళా రంగంతో పాటు యోగాకు సేవలందించిన ఇలాంటి యోగ సాధకులు ఇక్కడ ఉన్నారు’’ అని చెప్పారు.

సుసంపన్నమైన కర్ణాటక వారసత్వంలో భాగమైన 50 ఏళ్ల ప్రశాంతి కుటీరం ప్రస్థానాన్ని... ప్రతి పౌరుడూ తెలుసుకోవాల్సిన సేవ, నిబద్ధతల గాథగా ప్రధాని శ్రీ మోదీ అభివర్ణించారు. ఈ సంస్థ ఓ సాధారణ కేంద్రంగా ఆరంభమై బృహత్తర ఉద్యమంగా రూపాంతరం చెందిన తీరును వివరించారు. ‘‘సాధారణ యోగా కేంద్రం విస్తృత స్థాయి ఉద్యమంగా మారడం స్ఫూర్తిదాయకం’’ అని పీఎం మోదీ అన్నారు.

ఈ ప్రతిష్ఠాత్మక వేడుకల సందర్భంగా ఈ ప్రాంగణంలో పలు నూతన సౌకర్యాలను ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావించారు. ఎస్-వ్యాస కుటుంబం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రధానమంత్రి తన శుభాకాంక్షలు తెలిపారు. "స్వర్ణోత్సవాల సందర్భంగా మీ అందరికీ, అలాగే ప్రశాంతి కుటీరంతో అనుబంధం ఉన్న లక్షలాది మంది సాధకులకు నా అభినందనలు" అని శ్రీ మోదీ చెప్పారు.

ప్రశాంతి కుటీరం స్వర్ణోత్సవాలు జరుగుతున్న ఈ ఏడాదే హెచ్‌వీ శేషాద్రి శత జయంతి ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రధాని నివాళులు అర్పించారు. దేశాన్ని అత్యున్నత విజయ శిఖరాలకు చేర్చడానికి అంకితభావం, సామర్థ్యం, క్రమశిక్షణ ఉన్న పౌరులు అవసరమని గుర్తించిన శేషాద్రి వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా జాతి నిర్మాణం అనే కార్యక్రమానికే తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారని కొనియాడారు.

ఇతరులను ఉన్నత స్థానానికి ఎదిగేలా చేయడం, ప్రజలను ఏకం చేయడంలో, జాతీయ సేవకు వారిని తీర్చిదిద్దడంలో తెర వెనుక విశేష కృషి చేసిన హెచ్‌వీ శేషాద్రి నిరాడంబరతను, మహోన్నత వ్యక్తిత్వాన్ని, విస్తృత అనుభవాన్ని, వినయాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. తన బిడ్డను నిస్వార్థంగా సంరక్షించి, సేవలు చేయడానికి రాత్రంతా మేల్కొని ఉండే తల్లి నుంచి నేర్చుకోవాలనే విషయాన్ని తరచూ శేషాద్రి చెప్పేవారని తెలియజేశారు. ‘‘ఈ భావనను మనం సమాజానికి విస్తరింపజేస్తే గొప్ప ప్రయోజనం చేకూరుతుంది’’ అని శ్రీ మోదీ తెలిపారు.

తల్లిలాంటి స్వచ్ఛమైన, నిస్వార్థమైన హృదయంతో హెచ్‌వీ శేషాద్రి సమాజానికి సేవలు చేశారని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఆయన ప్రేమను, మార్గదర్శకత్వాన్ని పొందడం తన అదృష్టమన్నారు. ‘‘ఆయనతో గడిపిన సమయం, ఆయన మాటలు ఈనాటికీ నాకు ఎంతో అపురూపమైన  జ్ఞాపకాలు’’ అని ప్రధాని మోదీ అన్నారు.

మనం రెండు చేతులతో సమాజానికి ఇస్తే, సమాజం మనకు లక్షల చేతులతో తిరిగి ఇస్తుందని హెచ్‌వీ శేషాద్రి బోధించిన మరో చిరస్మరణీయమైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సత్యం తన జీవితంలో తరచూ రుజువు అవుతూనే ఉందని ప్రధాని తెలిపారు. ‘‘ప్రజలకు సేవ చేస్తుంటే తిరిగి వారు నాకు తమ ఆశీర్వాదాలను ఇస్తున్నారు. ఇది నా జీవితంలో ఒక గొప్ప ఆస్తి’’ అని శ్రీ మోదీ అన్నారు.

హెచ్‌వీ శేషాద్రి కుటుంబం అంతటా ఇదే నిస్వార్థ సేవా స్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని అన్నారు. ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళుతున్న హెచ్ఆర్ నాగేంద్ర, డాక్టర్ ఆర్ నాగరత్నను ప్రశంసించారు. ‘‘వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను. వారిని గౌరవిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

వలస పాలనలో భారతదేశం బందీ అయిన, స్వేచ్ఛ కోసం లక్షలాది స్వాతంత్ర్య సమరయోధులు పోరాడిన కాలాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఈ పోరాటానికి సమాంతరంగా దేశంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొల్పడంలో స్వామి వివేకానంద లాంటి జ్ఞానులు పోషించిన పాత్రను వివరించారు. ‘‘ఆయన భారతీయ యువతకు యోగ మార్గాన్ని చూపించారు’’ అని శ్రీ మోదీ చెప్పారు.

స్వామి వివేకానంద లాంటి జ్ఞానుల స్ఫూర్తితోనే ప్రశాంతి కుటీరం, ఎస్-వ్యాస లాంటి సంస్థలు ఆవిర్భవించాయని తెలియజేశారు. ఇవి సామాన్య ప్రజలకు యోగాను చేరువ చేయడమే కాకుండా ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న యోగా నిపుణులు, ఉపాధ్యాయులు, వైద్యులు, తత్వవేత్తలను తీర్చిదిద్దడంతో పాటు యోగా, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, ఆధునిక వైద్యాన్ని అనుసంధానిస్తూ సంపూర్ణ ఆరోగ్య వ్యవస్థను నిర్మించాయని కొనియాడారు. ఒత్తిడి, జీవనశైలి వ్యాధులపై ఈ సంస్థలు చేస్తున్న పరిశోధనలను ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘‘ఈ దిశగా సాగిన పరిశోధనలు ప్రపంచానికి ఎంతో సేవ చేశాయి. ఈ ప్రయత్నాలు చేస్తున్న ప్రశాంతి కుటీరాన్ని అభినందిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ అన్నారు 

గత 12 ఏళ్లుగా భారత్ తన సంస్కృతి, గుర్తింపు, శాస్త్రీయ వారసత్వాన్ని సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ప్రపంచం ముందు ప్రదర్శిస్తోందని, ఫలితంగా ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా అంతటా కోట్ల మంది భాగస్వామ్యంతో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు, సంస్థలు, కార్యాలయాల్లో యోగా చోటు సంపాదించిందని తెలియజేశారు. సౌదీ అరేబియా యోగాను ఒక క్రీడాంశంగా గుర్తించిందని వెల్లడించారు. ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ భారత ఆయుష్ మంత్రిత్వ శాఖతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుందని తెలియజేశారు. “విదేశీ పౌరులు యోగాను ప్రచారం చేస్తున్న ఉదాహరణలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వారిని పద్మశ్రీతో సత్కరించడం ద్వారా దేశం వారి గౌరవాన్ని కూడా పెంచుతోంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. 

ప్రపంచవ్యాప్తంగా యోగాకు లభిస్తున్న ఆదరణ కారణంగా భారతదేశంపై, మన సంస్కృతి, సాంప్రదాయ జ్ఞానంపై ఆసక్తి పెరుగుతోందన్నారు. ఇది సమిష్టి కృషి ద్వారా ప్రపంచ అనుసంధానానికి కొత్త మార్గాలను తెరుస్తుందని తెలియజేశారు. దీనికి సమాంతరగా ఆయుర్వేదానికి పెరుగుతున్న ఆదరణ గురించి కూడా వివరించారు. “ప్రపంచంలోని వివిధ దేశాల్లో 150కి పైగా ఆయుర్వేద శిక్షణా కోర్సులకు గుర్తింపు లభించింది. ఆయుర్వేద విస్తరణలో సహకారం కోసం ప్రపంచంలోని 28 దేశాలతో ఎంవోయూలు కుదర్చుకున్నాం’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు.

ప్రతి పౌరునికీ యోగా, ఆయుర్వేద ప్రయోజనాలు చేరేలా యోగాను ప్రోత్సహించడంతో పాటు పలు నియమాలను ప్రభుత్వం సవరించిందని ప్రధాని తెలియజేశారు. భారత్‌లో యోగాసనకు క్రీడాంశంగా అధికారిక గుర్తింపు లభించిందనీ, ఖేలో ఇండియా, జాతీయ క్రీడల్లో యోగాకు స్థానం కల్పించామని వెల్లడించారు. ‘‘భారత్‌కు ఈ మార్పు చాలా ముఖ్యమైనది. దీనివల్ల యోగా సాధన చేసేవారు టోర్నమెంట్లలో పాల్గొనేందుకు వీలు కలిగింది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

ఆయుష్ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడం ద్వారా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి, ఆయుర్వేద పరిశోధన, పేటెంట్లకు అందిస్తున్న తోడ్పాటు గురించి వివరించారు. వీటి వల్ల ఆయుష్ ఆర్థికరంగం లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని, హెర్బల్ ఎగుమతులు పెరిగాయని తెలిపారు. తరతరాలుగా భారతీయ గృహాల్లో వాడుతున్న పసుపునకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందన్నారు. పసుపు ఎగుమతులను మరింత పెంచేందుకు తీసుకుంటున్న సంస్థాగత చర్యల గురించి ప్రధాని ప్రస్తావించారు. “పసుపు ఉత్పత్తి, నాణ్యత, ఎగుమతులకు కొత్త బలాన్ని ఇచ్చేందుకు మేము జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేశాం” అని ప్రధాని మోదీ అన్నారు. 

యువతకు అవకాశాలు కల్పిస్తూనే... భారతదేశ ప్రాచీన విజ్ఞానం, ఆధునిక పరిశోధనల ప్రయోజనాలను మానవాళితో పంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. చికిత్స కోసం వచ్చే విదేశీయుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ప్రారంభించిన ఈ-ఆయుష్ వీసా సదుపాయాన్ని, జామ్‌నగర్‌లో డబ్ల్యూహెచ్‌వో గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. “దీని ద్వారా సంప్రదాయ వైద్యంలో పరిశోధనలు, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తున్నాం” అని శ్రీ మోదీ చెప్పారు. 

12–13 ఏళ్లలో దాదాపు 50 కోట్ల మంది భారతీయులు తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది. ఇది అందించిన స్ఫూర్తితో 140 కోట్ల మంది పౌరులు వికసిత్ భారత్ దిశగా కృషి చేస్తున్నారని ప్రధానమంత్రి తెలిపారు. దీనివల్ల ప్రశాంతి కుటీరం సహకారంతో యోగా ద్వారా ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు కుటుంబాలకు కొత్త అవకాశాలు ఏర్పడ్డాయన్నారు. ఈ దిశగా కొత్త లక్ష్యాల సాధనకు ఒక ప్రణాళికను రూపొందించాలని ప్రశాంతి కుటీరాన్ని ప్రధాని కోరారు. “దీనివల్ల యువశక్తి అందించే ప్రయోజనం ప్రశాంతి కుటీరానికి, దేశానికి కూడా లభిస్తుంది” అని ప్రధాని మోదీ తెలియజేశారు.

 

****


(రిలీజ్ ఐడి: 2336388) సందర్శకుల సూచీ సంఖ్య : : 8