సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా 35.88 కోట్ల మందికి చేరిన నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమం

ప్రచారాల ద్వారా 14.35 కోట్ల మందికి పైగా యువత, 11.33 కోట్ల మంది మహిళలకు అవగాహన

నషా ముక్తి మిత్రలుగా 2 లక్షల మందికి పైగా పౌరుల నమోదు

వ్యసన విముక్తి చికిత్స, కౌన్సెలింగ్ పొందుతున్న వారి సంఖ్య 2020–21లో 2.08 లక్షల నుంచి 2025–26లో 9.11 లక్షలకు పైగా పెరుగుదల

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 198కి చేరిన జిల్లా స్థాయి వ్యసన విముక్తి కేంద్రాల సంఖ్య

నాడు పోస్టు చేయడమైనది: 12 NOV 2026 4:13PM by PIB Hyderabad

మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ 2020 ఆగస్టు 15న ప్రారంభించిన నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ (ఎన్‌ఎంబీఏ) కార్యక్రమం దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా రూపాంతరం చేసింది. 2026 నవంబర్‌ 12 నాటికి దేశవ్యాప్తంగా 35.88 కోట్ల మందికి పైగా ప్రజలకు ఈ కార్యక్రమం చేరువైంది.

ఈ ప్రచారం ద్వారా 14.35 కోట్ల మందికి పైగా యువత, 11.33 కోట్ల మంది మహిళలకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్య రహిత భారత్‌ నిర్మాణం కోసం చేపట్టిన సమష్టి కృషిలో భాగస్వాములయ్యేందుకు 2 లక్షల మందికి పైగా పౌరులు నషా ముక్తి మిత్రలుగా నమోదు చేసుకున్నారు. తద్వారా ఈ ఉద్యమంలో ప్రజా భాగస్వామ్యం మరింత బలోపేతమైంది.

మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి అధికంగా ప్రభావితమయ్యే అవకాశమున్న జిల్లాలుగా గుర్తించిన 272 జిల్లాల్లో తొలుత ఈ అభియాన్‌ను ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. అనంతరం 2022 ఆగస్టులో ఈ కార్యక్రమాన్ని 372 జిల్లాలకు విస్తరించారని, 2023 ఆగస్టు 15 నుంచి దేశంలోని అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారని వివరించారు.

గత ఆరేళ్లలో సంస్థాగత భాగస్వామ్యంతో నడిచే కార్యక్రమం నుంచి ప్రజల నేతృత్వంలోని సామాజిక ఉద్యమంగా రూపాంతరం చెందిందని అధికారి తెలిపారు. ఈ కార్యక్రమం అమలులో రాష్ట్రాలు, జిల్లాలు, విద్యాసంస్థలు, పౌర సమాజ సంస్థలు, స్థానిక భాగస్వాములు చురుగ్గా పాల్గొంటున్నారని పేర్కొన్నారు.

ఈ ప్రచారం ద్వారా ఇప్పటి వరకు 35.88 కోట్ల మందికి పైగా ప్రజలకు చేరువయ్యామని, 2021లో సుమారు 1.4 కోట్ల మందికి మాత్రమే అవగాహన కల్పించిన స్థాయి నుంచి గణనీయమైన విస్తరణ సాధించామని ఆ అధికారి తెలిపారు. అవగాహన కల్పించడం, ప్రజా సమీకరణ, మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రజలు చురుగ్గా ఉద్యమంలో భాగస్వాములు కావడాన్ని ప్రోత్సహించడం వంటి నిరంతర ప్రయత్నాల ఫలితంగానే ఈ కార్యక్రమం విస్తృతి పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

విద్యాసంస్థల్లో ఇప్పటివరకు 34.07 లక్షలకు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు సంబంధిత అధికారి తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే హానికర పరిణామాలపై చర్చల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు.

సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, యువతలో మాదకద్రవ్యాల దుర్వినియోగ నివారణపై అవగాహనను బలోపేతం చేయడం ఈ కార్యక్రమాల లక్ష్యమని ఆయన వివరించారు.

వ్యక్తులు, కుటుంబాలు, సమాజాలపై ప్రభావం చూపే మాదకద్రవ్యాలపై ఆధారపడటమనేది సంక్లిష్టమైన మానసిక, సామాజిక, వైద్యపరమైన సవాలని గుర్తించాల్సిన అవసరం నుంచే ఎన్‌ఎంబీఏ విస్తరణకు పునాది పడిందని ఆయన తెలిపారు.

2018లో నిర్వహించిన ‘భారత్‌లో మాదకద్రవ్యాల వినియోగ విస్తృతి, విధానాలపై తొలి జాతీయ సర్వే’ ఈ సమస్య తీవ్రతను వెల్లడించిందని అధికారి పేర్కొన్నారు. దేశంలో 7 కోట్ల మందికి పైగా ప్రజలు మాదకద్రవ్యాల వినియోగ సమస్యలకు ప్రభావితమయ్యారని.. వీరిలో దాదాపు 1.2 కోట్ల మంది చిన్నారులు, 58 లక్షల మంది మహిళలు ఉన్నారని ఆ సర్వేలో వెల్లడైనట్లు తెలిపారు.

మాదకద్రవ్యాలపై ఆధారపడటాన్ని ఎదుర్కోవడంలో అందుబాటులో ఉండే చికిత్స, సకాలంలో స్పందించడం, నిరంతర పునరావాస సేవల ప్రాధాన్యాన్ని ఈ సేవల విస్తరణ తెలియజేస్తోందని ఆయన పేర్కొన్నారు. చికిత్స, కౌన్సెలింగ్‌ కోసం ముందుకు వస్తున్న వారి సంఖ్య 2020-21లో 2.08 లక్షల నుంచి 2025-26లో 9.11 లక్షలకు పైగా పెరిగిందని తెలిపారు. సహాయక సేవల పరిధి, వినియోగం పెరుగుతున్నాయనడానికి ఇది నిదర్శనమని వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 198 జిల్లా స్థాయి వ్యసన విముక్తి కేంద్రాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో పౌరులు చురుగ్గా భాగస్వాములు కావడాన్ని ప్రోత్సహించే ‘నషా ముక్తి మిత్ర’ కార్యక్రమం ఎన్‌ఎంబీఏలో కీలక అంశమని అధికారి పేర్కొన్నారు.

2026 నవంబర్‌ 12 నాటికి 2 లక్షల మందికి పైగా పౌరులు నషా ముక్తి మిత్రలుగా నమోదు చేసుకున్నారని, దీని ద్వారా సమాజంలో స్వచ్ఛంద సేవకుల వ్యవస్థ ఏర్పడుతోందని ఆయన వివరించారు. ఈ స్వచ్ఛంద సేవకులు అవగాహన కార్యక్రమాల నిర్వహణకు తోడ్పడటంతో పాటు, అవసరమైన వారు సహాయం పొందేలా ప్రోత్సహిస్తున్నారని, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి సహకరిస్తున్నారని తెలిపారు.

నిరంతర అవగాహన ప్రచారాలు, పటిష్టమైన చికిత్స, పునరావాస సేవలు, పౌరుల చురుకైన భాగస్వామ్యం ద్వారా ఆరోగ్యవంతమైన, అవగాహన కలిగిన, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణ లక్ష్యాన్ని నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది.

 

****

 

 


(రిలీజ్ ఐడి: 2335635) సందర్శకుల సూచీ సంఖ్య : : 23
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Kannada , English , Urdu , हिन्दी , Nepali , Assamese , Punjabi , Tamil