రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులతో రాష్ట్రపతి మాటామంతీ

పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి.. అంకితభావం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో మీ కలలు నెరవేర్చుకొనే
ప్రయత్నం చేయండని విద్యార్థులకు సూచించిన రాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 12 NOV 2026 2:56PM by PIB Hyderabad

ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థుల బృందంతో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజున, అంటే 2026 నవంబర్ 12న, రాష్ట్రపతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సమావేశాన్ని భగవాన్ బిర్సా ముండా జయంతి సూచకంగా ఏటా దేశ ప్రజలు జరుపుకొనే జన్‌జాతీయ గౌరవ్ పఖ్‌వాడాలో ఓ భాగంగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.

విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ, దేశ ప్రజలు 2047 కల్లా ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యాన్ని సాధించాలని ముందంజ వేస్తున్నారన్నారు. దేశంలో ప్రతి ప్రాంతం, సమాజంలో ప్రతి వర్గం అభివృద్ధి చెందడం అత్యంత ముఖ్యమని రాష్ట్రపతి అన్నారు. ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలలు గిరిజన విద్యార్థినీవిద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించడమే కాకుండా, వారు తమ లోపలి బహుముఖీన ప్రజ్ఞకు సాన పట్టుకునేందుకు అవకాశాలను కూడా అందిస్తున్నాయని రాష్ట్రపతి అన్నారు. మన దేశంలో ప్రతిభకు కొదవ లేదు అని శ్రీమతి ద్రౌపది ముర్ము తెలిపారు. విద్యార్థులకు కావలసిందల్లా సరి అయిన అవకాశాలు, సానుకూల పరిస్థితులు, సరైన మార్గదర్శకత్వమే అని రాష్ట్రపతి అన్నారు. ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల్లో బాలురు, బాలికల నిష్పత్తి సమానంగా ఉందని తెలిసి తాను సంతోషిస్తున్నానని శ్రీమతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఇది సమ్మిళిత అభివృద్ధి సాధన దిశగా భారత్ పురోగమిస్తోందనడానికి ఒక నిదర్శనమన్నారు.

పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, ఆ కలలను నెరవేర్చుకొనేందుకు అంకితభావం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించాలని విద్యార్థులకు రాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు. జీవనోపాధిని సంపాదించుకొనే సాధనంగా మాత్రమే విద్య మిగిలిపోకూడదు, అంత కన్నా, జ్ఞానం ద్వారా ఇతరులకు ఉద్యోగావకాశాలను కల్పించడం విద్యార్థుల లక్ష్యం కావాలి అని రాష్ట్రపతి అన్నారు. మన యువత ఉద్యోగాలను కల్పించే వారుగా మారినప్పుడు, దేశ సమ్మిళిత అభివృద్ధి మరింతగా జోరందుకోగలుగుతుందని శ్రీమతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు.

వర్తమాన వ్యవహారాలతో పాటు దేశ విదేశాలలో చోటు చేసుకుంటున్న మార్పుల పట్ల విద్యార్థులు మంచి అవగాహనను ఏర్పరుచుకోవాలని రాష్ట్రపతి సూచించారు. ఇది వారు తర్కయుక్తంగా ఆలోచించడాన్ని, విశ్లేషణాత్మక సామర్థ్యాలను పెంపొందింపచేసుకోవడానికి తోడ్పడుతుందని శ్రీమతి ద్రౌపది ముర్ము చెప్పారు. విద్యార్థులు తమ ఊరికి వెళ్లినప్పుడల్లా వర్తమాన వ్యవహారాలతో పాటు ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను గురించిన సమాచారాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగుపొరుగు వారితో ప్రస్తావిస్తుండాలని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము సలహా ఇచ్చారు. ఇలాంటి ప్రయత్నాలు వారి కుటుంబానికి, సమాజానికి మేలు చేసేవిగా ఉండటమే కాక వారి విద్యకు మరింత సార్థకత్వాన్ని, ప్రయోజనాత్మకతను జోడిస్తాయని రాష్ట్రపతి అన్నారు.

రాష్ట్రపతి హిందీ ప్రసంగాన్ని చూడటానికి ఈ కింది లింకును క్లిక్ చేయగలరు:

Click here to see President's speech in Hindi

****


(రిలీజ్ ఐడి: 2335547) సందర్శకుల సూచీ సంఖ్య : : 22
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Gujarati , Tamil , Malayalam