నాడు పోస్టు చేయడమైనది:
09 NOV 2026 6:23PM by PIB Hyderabad
వికసిత భారత్ 100 వారాల సంకల్ప్ అభియాన్‌లో భాగంగా నషా ముక్త యువ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో ‘దీవాళి స్నేహ మిలన్’ను మై భారత్-నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) నిర్వహించింది. దేశవ్యాప్తంగా 153 సంస్థల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో 1,07,494 మంది పాల్గొన్నారు. ఇది ఈ ప్రచారంలో ఎనిమిదో వారం. ఈ వారంతో ఈ కార్యక్రమం రెండు నెలలు పూర్తి చేసుకుంది. సామాజిక సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక ప్రతిజ్ఞలు, స్వచ్ఛంద సేవల ద్వారా వ్యసన రహిత దీపావళిని ప్రోత్సహించేందుకు సమాజంలోని యువతనూ, కుటుంబాలనూ, సమాజంలోని వ్యక్తులనూ ఈ కార్యక్రమం ఒక చోటకు చేర్చింది.
మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని నివారించాలనే సందేశాన్ని విద్యాసంస్థలకే పరిమితం చేయకుండా గృహాలకూ, పరిసర ప్రాంతాలకూ విస్తరింపచేయడమే ఈ కార్యకమ్ర లక్ష్యం. ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడంలో, బాధ్యతాయుతమైన పండుగ వేడుకలను నిర్వహించడంలో సమష్టి బాధ్యత వహించేలా కుటుంబాలనూ, సమాజాలనూ ఇది ప్రోత్సహిస్తుంది. మిగిలిన విద్యాసంస్థల్లో సెలవుల అనంతరం కార్యక్రమాలు కొనసాగుతాయి.
నషా ముక్త్ దీపోత్సవ్‌లో భాగంగా వ్యసనం అనే చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా స్వచ్ఛంద కార్యకర్తలు, సమాజంలోని పెద్దలు, బాలలు మట్టి దీపాలను వెలిగించారు. ఈ దీపోత్సవం, స్నేహ మిలన్ సమావేశాలు రెండింటిలోనూ కలిపి 41,600 మందికి పైగా పాల్గొన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగ నివారణలో సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా ఈ పర్వదినాన్ని ఉపయోగించుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థలు ప్రాంతీయ భాషల్లో వీధినాటకాలను ప్రదర్శించాయి. వీటితో పాటుగా ముగ్గులు వేయడం, నషా ముక్త పాటల కార్యక్రమాలను కూడా నిర్వహించాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో 24,100 మందికి పైగా పాల్గొన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం తదితర అంశాల ప్రాధాన్యాన్ని తెలియజేయడానికి సంప్రదాయ, సృజనాత్మక కళారూపాలను ఉపయోగించారు.
ఈ సామూహిక కార్యక్రమాల్లో ‘వ్యసన రహిత దీపావళి సంకల్పం’ ప్రధాన భాగంగా నిలిచింది. దాదాపు 25,000 మంది వ్యక్తులు, కుటుంబ సభ్యులు మత్తుపదార్థాలకు దూరంగా దీపావళి నిర్వహించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. బాధ్యతాయుతమైన పండగ విధానాలను అవలంబించాలని, ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకునేలా యువతకు అండగా నిలవాలని ఈ ప్రతిజ్ఞ కుటుంబాలను ప్రోత్సహించింది.
‘నాట్ మీ, బట్ యూ’ అనే ఎన్ఎస్ఎస్ సిద్ధాంతానికి అనుగుణంగా పండగ వేడుకలతో పాటు సామాజిక సేవను కూడా వాలంటీర్లు చేపట్టారు. సేవా విభాగం పరిధిలోని 16,700 మందికి పైగా వాలంటీర్లు వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, ఆసుపత్రులు, మురికివాడలను సందర్శించారు. ప్రమిదలు, మిఠాయిలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమం కరుణ, సమ్మిళిత్వం, సామాజిక సేవ విలువలను ప్రతిబింబించింది.
ఈ ప్రచారాన్ని మరింత విస్తృతం చేయడానికి యువ వాలంటీర్లు డిజిటల్ మాధ్యమాలను కూడా ఉపయోగించారు. వ్యసన రహిత దీపావళి సందేశాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయడానికి #NashaMuktYuva హ్యాష్‌ట్యాగ్‌తో వీధి నాటకాలకు సంబంధించిన 1,100కి పైగా సోషల్ మీడియా పోస్టులు, రీల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు.
***