ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
06 NOV 2026 6:05PM by PIB Hyderabad
భారత్ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగాల వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ నేడు సెమీకాన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 2, 3, 4వ కీలక విభాగాల కోసం రూపొందించిన ‘సెమీకాన్ 2.0-వెబ్ అప్లికేషన్ వేదికను ప్రారంభించారు. అనంతరం ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకం (ఈసీఎంఎస్) కింద ఆమోదం పొందిన 12 మంది దరఖాస్తుదారుల వివరాలను ప్రకటించారు.
దేశంలో పటిష్ఠమైన, సుస్థిరమైన సెమీకండక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ వ్యూహాత్మక కార్యక్రమాలు, విధానపరమైన చర్యల ద్వారా సమన్వయంతో కూడిన కృషి చేస్తోంది.
ఏర్పాటైన కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం) దేశ సెమీకండక్టర్ రంగం అభివృద్ధికి ఊతమిచ్చింది. సెమీకాన్ ఇండియా కార్యక్రమం తొలి దశ (సెమీకాన్ 1.0) విజయవంతంగా అమలైంది. ఈ దశలో ఆరు రాష్ట్రాల్లో మొత్తం రూ.1.64 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులతో 12 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ 12 ప్రాజెక్టుల్లో అయిదు ఇప్పటికే 2026 అక్టోబర్ నాటికి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయి.
ఇదే సమయంలో 105 అంకుర సంస్థలకు ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (ఈడీఏ) పరికరాలను వినియోగించుకునే అవకాశం కల్పించారు. 24 అంకురాలకు నిధుల ద్వారా మద్దతు అందించగా, 15 స్టార్టప్‌లు వెంచర్ క్యాపిటల్ నిధులను పొందాయి. ‘చిప్స్ టు స్టార్టప్’ (సీ2ఎస్) కార్యక్రమం కింద 332 విద్యాసంస్థలకు ఈడీఏ పరికరాలను అందించారు. ఇప్పటివరకు సుమారు 70,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.
భారత్ సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం) కింద రూ.1,27,500 కోట్ల ఆర్థిక కేటాయింపులతో సెమీకాన్ 2.0 కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్ సెమీకండక్టర్ ప్రయాణంలో తదుపరి దశగా చేపట్టిన ఈ కార్యక్రమం ఆరు వ్యూహాత్మక విషయాలపై దృష్టి సారించింది.
కేంద్ర మంత్రివర్గం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) కింద ₹1,27,500 కోట్ల ఆర్థిక కేటాయింపుతో సెమికాన్ 2.0కు ఆమోదం తెలిపింది. భారతదేశ సెమీకండక్టర్ ప్రయాణంలో తదుపరి దశకు నాంది పలుకుతూ, సెమికాన్ 2.0 ఆరు వ్యూహాత్మక స్తంభాలపై దృష్టి సారించింది:
ప్రధాన విభాగం 1: చిప్‌ల రూపకల్పన
ప్రధాన విభాగం 2: యంత్రాలు, ముడి పదార్థాలు
ప్రధాన విభాగం 3: మరిన్ని సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ల (ఫ్యాబ్స్) ఏర్పాటు
ప్రధాన విభాగం 4: ఏటీఎంపీ/ఓఎస్‌ఏటీ పరిశ్రమను మరింత బలోపేతం చేయడం
ప్రధాన విభాగం 5: పరిశోధన, అభివృద్ధి
ప్రధాన విభాగం 6: నైపుణ్య ప్రతిభ అభివృద్ధి
సెమికాన్ 2.0 వెబ్ అప్లికేషన్ వేదిక ప్రారంభంతో రెండో, మూడో, నాలుగో విభాగాల కింద దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక, రైల్వే, సమాచార, ప్రసార శాఖల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం కేవలం అసెంబ్లీ దశను దాటి, మాడ్యూళ్లు, విడిభాగాలు, ముడి పదార్థాలు, అధునాతన సాంకేతికతలతో కూడిన సమగ్ర దేశీయ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. బ్యాటరీ సెల్స్, కాపర్ ఫాయిల్స్, కాపర్ క్లాడ్ లామినేట్స్, అధిక సామర్థ్యం కలిగిన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల తయారీలో దేశీయ సామర్థ్యాలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు దేశీయ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలు) కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని తెలిపారు. ఈ పథకం కింద ఆమోదం పొందిన యూనిట్లలో దాదాపు 50 శాతం ఎంఎస్‌ఎంఈ రంగానికి చెందినవేనని వివరించారు. సెమీకాన్ ఇండియా 2.0లో పరికరాలు, ముడి పదార్థాలు, రసాయనాలు, వాయువులకు సంబంధించిన రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ పటిష్ఠమైన సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. కనీసం మూడు ప్రధాన పరికరాల తయారీ సంస్థలను, అయిదు రసాయనాలు, వాయువుల తయారీ సంస్థలను భారత్‌కు ఆకర్షించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రాజెక్టుల ఎంపికలో కఠినమైన ప్రమాణాలను పాటించాలని ఆయన సూచించారు. నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానంలో లోతైన నైపుణ్యం, పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ), ప్రపంచ మార్కెట్‌లో పోటీపడే సామర్థ్యం దేశ సెమీకండక్టర్ రంగ లక్ష్యాలకు మార్గదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ లక్ష్యాలు ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా ఉండాలని పేర్కొన్నారు. భారత్‌ను ప్రపంచస్థాయి పోటీతత్వం కలిగిన ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పరిశ్రమల భాగస్వాములు పరస్పరం సహకరించుకోవాలని, తమ నైపుణ్యాన్ని పంచుకోవాలని, నిరంతర అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
గతంలో ప్రకటించిన రూ. 69,548 కోట్ల పెట్టుబడులతో కూడిన 106 దరఖాస్తులకు ఆమోదం కొనసాగింపుగా.. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకం (ఈసీఎంఎస్) కింద తాజాగా మరో 12 దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. ఈ దరఖాస్తుల ద్వారా రూ.7,503 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా.
ప్రస్తుత ఆమోదాల ద్వారా రూ.39,045 కోట్ల విలువైన ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే ప్రత్యక్షంగా 7,127 ఉద్యోగావకాశాలు కలగనున్నాయి.
ఈ తాజా ఆమోదాలు 10 లక్ష్యిత ఉత్పత్తి విభాగాలకు చెందిన తయారీని కవర్ చేస్తున్నాయి. వీటిలో ప్రాథమిక విడిభాగాలు, సరఫరా వ్యవస్థకు సంబంధించిన ఉత్పత్తులు, మూలధన వస్తువులు ఉన్నాయి. అవి:
4 రకాల విడిభాగాలు: మల్టీ లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు (పీసీబీలు), రిలేలు, హీట్ సింక్‌లు, ప్రత్యేక సిరామిక్ ఉత్పత్తులు.
5 రకాల సరఫరా వ్యవస్థ ఉత్పత్తులు: కాపర్ ఫాయిల్, యానోడ్ మెటీరియల్, క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్, పాలీప్రొపైలిన్ ఫిల్మ్, కెమెరా రిమ్.
మూలధన వస్తువులు, వాటి విడిభాగాలు.
ఈ ప్రాజెక్టులు గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ సహా మొత్తం ఏడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. దీంతో దేశంలో ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ రంగం భౌగోళిక పరిధి మరింత విస్తరించనుంది.
ఈ తాజా ఆమోదాల్లో భాగంగా కాపర్ ఫాయిల్, క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్, ప్రత్యేక సిరామిక్ ఉత్పత్తుల తయారీకి ఈసీఎంఎస్ కింద తొలిసారిగా ఆమోదం లభించింది. దీంతో దేశీయంగా తయారయ్యే ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు, వాటి తయారీకి అవసరమైన ప్రాథమిక ముడి పదార్థాల పరిధి మరింత విస్తరించనుంది.
విడిభాగాల కేటగిరీలో కింది ఉత్పత్తుల తయారీకి ఆమోదం లభించింది.
మల్టీ లేయర్ పీసీబీల తయారీకి నెస్ట్ ఐసెల్ ప్రైవేటు లిమిటెడ్‌కు,
రిలేల తయారీకి టీడీకనెక్స్ (చెన్నై) ప్రైవేటు లిమిటెడ్‌కు,
హీట్ సింక్‌ల తయారీకి మోడ్రన్ ఆటోమోటివ్స్ లిమిటెడ్‌కు,
ప్రత్యేక సిరామిక్ ఉత్పత్తుల తయారీకి వోల్టిక్స్ సెమికాన్ ప్రైవేటు లిమిటెడ్‌కు ఆమోదం లభించింది.
వీటితోపాటు, ఎలక్ట్రానిక్స్ తయారీ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు పలు రకాల సరఫరా వ్యవస్థ ఉత్పత్తుల తయారీకి కూడా ఆమోదం తెలిపారు. అవి:
పీసీబీల తయారీలో ఉపయోగించే కాపర్ క్లాడ్ లామినేట్ (సీసీఎల్), లిథియం అయాన్ (లి-అయాన్) బ్యాటరీ సెల్స్‌కు కీలకమైన ముడి పదార్థమైన కాపర్ ఫాయిల్ తయారీకి ఇండో ఆసియా కాపర్ లిమిటెడ్‌కు ఆమోదం లభించింది.
లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్‌కు అవసరమైన యానోడ్ మెటీరియల్ తయారీకి టీఏసీసీ లిమిటెడ్‌కు ఆమోదం తెలిపారు.
క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్ తయారీకి విద్యుత మెటీరియల్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు ఆమోదం లభించింది.
కెపాసిటర్లలో ఉపయోగించే డైఎలక్ట్రిక్ ఫిల్మ్ గ్రేడ్ పాలీప్రొపైలిన్ ఫిల్మ్ తయారీకి ఎనర్‌ఫోలీ ఎల్‌ఎల్‌పీకి ఆమోదం తెలిపారు.
కెమెరా రిమ్ తయారీకి సర్ఫేస్ మోడిఫికేషన్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్‌కు ఆమోదం లభించింది.
అంతేకాకుండా, మూలధన వస్తువులు, వాటి విడిభాగాల దేశీయ తయారీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంపైనా తాజా ఆమోదాల్లో ప్రాధాన్యత కొనసాగింది. ఇందులో భాగంగా ప్రెసిషన్ మోల్డ్స్, టూలింగ్ తయారీకి టీడీకనెక్స్ (చెన్నై) ప్రైవేటు లిమిటెడ్‌కు, మూలధన పరికరాలకు అవసరమైన పవర్, కంట్రోల్ సిస్టమ్స్ తయారీకి రాక్‌వెల్ ఆటోమేషన్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌కు, ఫ్యాక్టరీ ఆటోమేషన్, సిస్టమ్ ఇంటిగ్రేషన్‌కు అవసరమైన మూలధన పరికరాల తయారీకి విప్రో పారి రోబోటిక్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు ఆమోదం లభించింది.
ఈ తాజా ఆమోదాలతో కలిపి ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకం (ఈసీఎంఎస్) కింద ఇప్పటివరకు 16 రాష్ట్రాల్లో 34 ఉత్పత్తులకు సంబంధించి మొత్తం 118 దరఖాస్తులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా రూ.77,051 కోట్ల పెట్టుబడులు వస్తాయని, రూ.5,73,146 కోట్ల విలువైన ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రత్యక్షంగా 81,755 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
ఈ ఆమోదాలు దేశీయ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు, ఉత్పత్తుల్లో దేశీయ విలువ జోడింపును పెంచుతాయి. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, అధునాతన తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేస్తాయి. తద్వారా ప్రపంచస్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ ఎదిగేందుకు మరింత దోహదపడతాయి.
మీడియాతో కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. “గత దశాబ్ద కాలంలో భారత్‌లో మౌలికమైన మార్పు చోటుచేసుకుంది. అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమే. వివిధ విధానపరమైన కార్యక్రమాలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు సమన్వయంతో చేస్తున్న కృషి సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధికి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు పునాది వేస్తున్నాయి” అని అన్నారు. దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థను భారత్ మరింత బలోపేతం చేస్తోందని, దేశంలోనే కంప్యూటర్లు, వాటి విడిభాగాల తయారీపై దృష్టి పెరుగుతోందని తెలిపారు. దీనివల్ల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు, పటిష్ఠమైన, స్వావలంబనతో కూడిన ఎలక్ట్రానిక్స్ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థను నిర్మించవచ్చని ఆయన పేర్కొన్నారు.
సెమీకాన్ 2.0 వెబ్ అప్లికేషన్ వేదిక ప్రారంభం, ఈసీఎంఎస్ కింద ఆమోదం పొందిన దరఖాస్తుదారుల వివరాల ప్రకటన భారత్ సెమీకండక్టర్ రూపకల్పన, తయారీ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా ఒక కీలక ముందడుగుగా నిలిచాయి.
***