సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ప్రత్యేక ప్రచార కార్యక్రమం-6.0’ను విజయవంతంగా ముగించిన సమాచార, ప్రసార శాఖ.. 1.63 లక్షల కేజీల చెత్త తొలగింపు


40,278 చదరపు అడుగుల కార్యాలయ జాగా ఖాళీ.. తిరిగి ఉపయోగానికి సిద్ధం

నాడు పోస్టు చేయడమైనది: 06 NOV 2026 1:55PM by PIB Hyderabad

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో ‘ప్రత్యేక ప్రచార కార్యక్రమం-6.0’ను 2026 అక్టోబర్ 2న మొదలుపెట్టి, అదే నెల 31న విజయవంతంగా ముగించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మంత్రిత్వ శాఖకు చెందిన కార్యాలయాలలో, మీడియా విభాగాలలో శుభ్రత పట్ల శ్రద్ధ తీసుకున్నారు. రికార్డుల నిర్వహణ విధానాన్ని మెరుగుపరచడానికి, నిలిపివేసి ఉంచిన పనులను చక్కబెట్టడానికి ప్రాధాన్యాన్నిచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో మంత్రిత్వ శాఖలో 1,63,213 కిలోల చెత్తను ఏరి, పారబోశారు.  40,278 చదరపు అడుగుల కార్యాలయ జాగాను మళ్లీ  ఉపయోగించడానికి అనువైందిగా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉపయోగానికి పనికిరాకుండా మిగిలి ఉన్న 35 వాహనాలను కూడా వదిలించుకున్నారు. అలాగే, 1,348 ఆరుబయలు స్థలాల్లో స్వచ్ఛతా ఉద్యమాన్ని చేపట్టి, 1,519 ప్రదేశాలను శుభ్రం చేశారు.

 

 image.png

 

రికార్డు నిర్వహణ, నిలిపివేసిన ఫైళ్లను పరిష్కరించడంలో చెప్పుకోదగిన ప్రగతిని సాధించారు. మొత్తం 39,545 దస్త్రాలను సమీక్షించి, వాటిలో 8,823 దస్త్రాల పనిని చక్కబెట్టారు. ఇదే మాదిరిగా, ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా 12,609 ఈ-ఫైళ్లను సమీక్షించి, 11,109 ఫైళ్లను తొలగించారు.
ప్రచార కార్యక్రమం సన్నాహక దశలో భాగంగా మంత్రిత్వ శాఖతో పాటు, మంత్రిత్వ శాఖకు చెందిన మీడియా యూనిట్ల సీనియర్ అధికారులతో కేంద్ర సమాచార, ప్రసార శాఖ, రైల్వేలు, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ సమావేశమయ్యారు. క్షేత్ర స్థాయికి చెందిన విభాగాలు సహా అన్ని కార్యాలయాలు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనేటట్లు చూడవలసిన అవసరం ఉందని ఆయన సూచించారు. స్వచ్ఛత పరిరక్షణ కార్యక్రమాన్ని 2026 అక్టోబర్ 31 తరువాత కూడా ఏడాది పొడవునా కొనసాగించాలని మంత్రి ఆదేశించారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగివుండే కార్యాలయాలకు అత్యున్నత ప్రాధాన్యాన్ని ఇవ్వాలని కూడా సలహానిచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో పురోగతిని సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ తరచుగా సమీక్షించారు. మీడియా యూనిట్లు స్వచ్ఛతను తమ దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలని, ప్రచార కార్యక్రమం ముగిసిన తరువాత కూడా ‘స్వచ్ఛతయే సేవ’ భావనను విడనాడకూడదని, సంవత్సరాంతం వరకు కూడా నిబద్దతతో వ్యవహరిస్తూ దీనిని సంస్థాగత సంస్కృతిలో ఓ అంతర్భాగంగా చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
దేశంలోని వివిధ ప్రాంతాల ఆకాశవాణి కేంద్రాలు కూడా వివిధ స్వచ్ఛతా ఉద్యమాలను నిర్వహించాయి. కోల్‌కతాలో పాత ఫైళ్ల, కాగితాల ఏరివేత కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కటక్‌లో ఒక మర్రి చెట్టు సమీపంలో అంతగా పట్టించుకోకుండా వదలివేసిన ప్రాంతాన్ని శుభ్రపరిచి, కళకళలాడేటట్లు చేశారు. గుజరాత్ లోని హిమ్మత్‌నగర్‌లో ‘చెత్త నుంచి సంపద’ను సృష్టించే కార్యక్రమాల్లో భాగంగా ఓ పాత డిష్ యాంటెన్నాను సెక్యూరిటీ గార్డులకు నీడనిచ్చే అనువైన చోటుగా తీర్చిదిద్దారు. జోధ్‌పూర్ ఆలిండియా రేడియో స్టేషన్లో చెత్త ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టారు. భువనేశ్వర్‌లో ఎన్ఏమీఎమ్ ఆధ్వర్యంలో పిల్లల పార్కును శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

చెత్త నుంచి సంపద: గుజరాత్‌లోని ఆకాశవాణి హిమ్మత్ నగర్‌లో పాత వ్యర్థాలను సెక్యూరిటీ గార్డులకు నీడనివ్వడానికి అనువైందిగా మార్చారు

ఈ ఉద్యమంలో భాగంగా అనేక ఇతర మీడియా యూనిట్లు కూడా స్వచ్ఛత, సుందరీకరణ దిశగా కొత్త కొత్త పనులను చేపట్టి పూర్తి చేశాయి. ఐఐఎమ్‌సీ కొట్టాయమ్ కుడ్య చిత్రాలతో తన ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దింది. అటవీ విభాగం, సీఆర్‌పీఎఫ్‌ల సహకారంతో శ్రీనగర్‌ లోని దూరదర్శన్ కేంద్రం శంకరాచార్య గుట్టలపై స్వచ్ఛతా ఉద్యమాన్ని నిర్వహించింది. డెహ్రాడూన్లోని దూరదర్శన్ కేంద్రం, అహమదాబాద్‌లోని పీఐబీ,  సీబీసీ కార్యాలయాలు, న్యూఢిల్లీ లోని పబ్లికేషన్స్ డివిజన్ డైరెక్టరేట్ కూడా స్వచ్ఛతా ఉద్యమాలను చేపట్టాయి.

  ఐఐఎమ్‌సీ, కొట్టాయమ్‌లో కేంపస్ గోడలకు రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు

స్వచ్ఛత పరిరక్షణ విషయంలో ప్రజలలో చైతన్యాన్ని పెంచేందుకు, వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల ఆధ్వర్యంలో ప్రచార, ప్రజాసంబంధాల కార్యక్రమాలను నిర్వహించారు.
ప్రజలకు మెరుగైన సేవలను అందించే, రికార్డులను సమర్థంగా నిర్వహించే, సంస్థాగత స్వచ్ఛతను పాటించే విషయాల్లో మంత్రిత్వ శాఖ నిబద్దతను నిరంతర ప్రాతిపదికన కొనసాగించగలమని ఈ ‘ప్రత్యేక ప్రచార కార్యక్రమం-6.0’ను విజయవంతంగా ముగించడం ద్వారా అధికారులు, సిబ్బంది మరోసారి చాటిచెప్పారు.

 

***


(రిలీజ్ ఐడి: 2333893) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , Assamese , Khasi , English , Urdu , हिन्दी , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam