నాడు పోస్టు చేయడమైనది:
06 NOV 2026 8:45AM by PIB Hyderabad
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ 'మేరా యువ భారత్' (మై భారత్) ద్వారా దేశవ్యాప్తంగా చేపట్టిన ‘వికసిత్ భారత్ యువ సంవాద్: నో యువర్ ఓట్’ ప్రచారం గురువారం ముగిసింది. 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 536 యువ సంవాద్ సదస్సులు నిర్వహించారు. 536 మంది యూత్ ఐకాన్ల భాగస్వామ్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం 1,00,493 మంది యువతకు చేరువైంది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలలు, విద్యాసంస్థల్లో ఎన్నికల ప్రక్రియపై చర్చలు చేపట్టారు. ముఖ్యంగా తొలిసారి ఓటు వేసే యువత తమ ఓటు హక్కు, ఎన్నికల విధానాలపై అవగాహన కల్పించి ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతంగా పాల్గొనేలా ప్రోత్సహించింది.
26.10.2026 నుంచి 05.11.2026 వరకు నిర్వహించిన ఈ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా 500 విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, విద్యాసంస్థలకు ఈ ప్రచారాన్ని విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రచారం ముగింపు రోజు 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 123 యువ సంవాద్ సదస్సులు నిర్వహించారు. వాటిలో 22,588 మంది యువత, 123 మంది యూత్ ఐకాన్లు పాల్గొన్నారు.
గవర్నర్లు, కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా చండీగఢ్‌లో, నాగాలాండ్ గవర్నర్ శ్రీ నంద్ కిశోర్ యాదవ్ దిమాపూర్‌లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ తరణ్‌జిత్ సింగ్ సంధు విద్యార్థులతో సంభాషించారు. శ్రీ చౌదరి ధరమ్‌బీర్ సింగ్, శ్రీ ప్రదాన్ బారువా, శ్రీ రంజిత్ దత్తా, శ్రీమతి రూప్‌కుమారి చౌదరి, శ్రీ మహేష్ కశ్యప్‌తో సహా ఇతర పార్లమెంటు సభ్యులు వివిధ రాష్ట్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
వివిధ రాష్ట్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో క్రీడా ప్రముఖులు, క్రీడారంగానికి చెందిన యూత్ ఐకాన్లు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. క్రీడల్లో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు. పంజాబ్‌లో అంతర్జాతీయ రగ్బీ క్రీడాకారిణి అమన్‌దీప్ కౌర్ తన క్రీడా ప్రస్థానం గురించి తెలియజేశారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో క్రీడల పాత్రను వివరించారు. మోగాలో రోయింగ్ స్పోర్ట్స్ ఐకాన్ శ్రీ కుల్విందర్ సింగ్ విద్యార్థులతో సంభాషించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో స్పోర్ట్స్ ఐకాన్ భూమిక శుక్లా యువతతో ముచ్చటించారు. ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన కార్యక్రమాలు సైక్లింగ్ క్రీడకు, ఖేలో ఇండియా లాంటి కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చాయి.
ఎన్నికల ప్రక్రియలపై సందేహాలను నివృత్తి చేసుకొనే, ఓటు హక్కు, పౌర బాధ్యతలపై చర్చించే, ప్రజాప్రతినిధులు, యూత్ ఐకాన్లతో నేరుగా సంభాషించే అవకాశాన్ని యువతకు ఈ యువ సంవాద్ కార్యక్రమాలు అందించాయి. అలాగే, ప్రామాణిక వనరుల ద్వారా సమాచారాన్ని ధ్రువీకరించుకోవడం, విచక్షణతో వ్యవహరించడం లాంటి అంశాలకు ఈ సదస్సులు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చాయి. క్విజ్‌లు, ప్రశ్నోత్తరాల సమయం, ప్రజాస్వామ్య ప్రతిజ్ఞ, మై భారత్ పోర్టల్లో నమోదు ప్రక్రియ ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఉన్నాయి.
***