నాడు పోస్టు చేయడమైనది:
04 NOV 2026 3:27PM by PIB Hyderabad
గ్రిడ్-స్థాయి విద్యుత్ నిల్వ వ్యవస్థల అభివృద్ది కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) పథకానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్థిక సంవత్సరం 2026-27 నుంచి ఆర్థిక సంవత్సరం 2030-31 కాలవ్యవధికి గాను రూ.14,500 కోట్ల నిధులను ఈ పథకానికి కేటాయించారు. దేశవ్యాప్తంగా ఇంకా అందుబాటులోకి రాని 92 గిగావాట్ అవర్ల విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు తోడ్పాటు అందించడమే ఈ పథకం లక్ష్యం. ప్రస్తుతం దేశంలో ఉన్న గ్రిడ్ స్థాయి విద్యుత్ నిల్వ సామర్థ్యానికి 170 శాతానికి సమానమైన అదనపు సామర్థ్యాలను రూపొందించేందుకు ఈ పథకం తోడ్పాటు అందిస్తుంది. అలాగే 2031-32 నాటికి అవసరమైన 411 గిగావాట్ అవర్ల ఈఎస్ఎస్ సామర్థ్యాన్ని చేరుకోవడానికి సహకరిస్తుంది.
భారత విద్యుత్ రంగంలో మౌలిక వసతులను బలోపేతం చేసేలా, భారీస్థాయిలో పునరుత్పాదక ఇంధన వనరుల అనుసంధానాన్ని సులభతరం చేసేలా, విశ్వసనీయమైన, అందుబాటు ధరల్లో, నిరంతరం విద్యుత్ సరఫరాను అందించే దిశగా వేసిన ముందడుగును ఈ పథకం సూచిస్తుంది. ఇది దేశీయంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజి వ్యవస్థల తయారీకి ప్రోత్సాహం అందించడంతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. దేశ దీర్ఘకాలిక ఇంధన భద్రతను మెరుగుపరుస్తుంది.
60 జీడబ్ల్యూహెచ్ హైడ్రో పంప్డ్ స్టోరేజి ప్లాంట్ (పీఎస్‌పీ) సామర్థ్యాన్ని, 30 జీడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజి సిస్టమ్ (బీఈఎస్ఎస్) సామర్థ్యాన్ని, 2 జీడబ్ల్యూహెచ్ సామర్థ్యం ఉన్న ప్రత్యామ్నాయ ఇంధన నిల్వ సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడమే ఈ పథకం లక్ష్యం. వీటి మొత్తం అంచనా వ్యయం రూ.97,600 కోట్లు. ఈ ప్రాజెక్టుల ఆర్థిక సాధ్యాసాధ్యాలను మెరుగుపరచడానికి, దేశంలో విస్తృత స్థాయిలో ఇంధన నిల్వ మౌలిక వసతుల విస్తరణను వేగవంతం చేయడానికి వీజీఎఫ్ సహకారం అందిస్తుంది.
టారిఫ్ ఆధారిత బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని కేటాయిస్తారు. బీఈఎస్ఎస్, హైడ్రో పీఎస్‌పీ ప్రాజెక్టులకు వీజీఎఫ్ తోడ్పాటు పొందడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగ విద్యుత్ పంపిణీ సంస్థలకు అర్హత ఉంటుంది. అలాగే ప్రత్యామ్నాయ ఇంధన నిల్వ సాంకేతిక పరిజ్ఞానాలపై ఆధారపడిన ప్రాజెక్టులను ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు అమలు చేస్తాయి.
డిమాండ్ ఆధారిత ఆర్థిక తోడ్పాటు ద్వారా భారతదేశ దేశీయ ఇంధన నిల్వ తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, దిగుమతి చేసుకునే విడిభాగాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికి బీఈఎస్ఎస్ ప్రాజెక్టులకు కనీసం 40 శాతం దేశీయ ఉత్పత్తుల వినియోగ నిబంధన(డీసీఆర్) తప్పనిసరి. ఇది దేశీయ తయారీని ప్రోత్సహిస్తుంది, భారతీయ పరిశ్రమలకు అవకాశాలను కల్పిస్తుంది. అలాగే బ్యాటరీ తయారీ కోసం ఇప్పటికే ఉన్న సరఫరా ఆధారిత ప్రోత్సాహకాలకు అదనపు బలాన్ని చేకూరుస్తుంది.
సౌకర్యవంతమైన, పటిష్ఠమైన, భవిష్యత్ అవసరాలకు తగిన విద్యుత్ వ్యవస్థను నిర్మించే దిశగా చేపట్టిన కీలకమైన కార్యక్రమమే ఈ పథకం. గ్రిడ్-స్థాయి ఇంధన నిల్వ వ్యవస్థల ఏర్పాటును వేగవంతం చేయడం ద్వారా పునరుత్పాదక ఇంధనాన్ని మరింత విస్తృతంగా వినియోగించుకొనే వీలు కల్పిస్తుంది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో ఉండే హెచ్చుతగ్గుల సమస్యను పరిష్కరిస్తుంది. అలాగే నిరంతర విద్యుత్ సరఫరా సమతుల్యతను కాపాడటం కోసం సంప్రదాయ విద్యుదుత్పత్తిపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఈ పథకం గ్రిడ్ స్థిరత్వాన్ని బలోపేతం చేస్తుంది. పునరుత్పాదక ఇంధన వనరుల అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. దేశీయంగా తయారీని ప్రోత్సహిస్తుంది. భారతదేశ ఇంధన భద్రతను పటిష్ఠం చేస్తుంది. అదే సమయంలో ఆత్మనిర్భర భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలను ముందుకు తీసుకెళుతుంది.
***