రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

సోమాలియా తీరానికి సమీపంలో సముద్రపు దొంగలు హైజాక్ చేసిన చేపలు పట్టే పడవ ‘అజిని’ని రక్షించిన భారతీయ నౌకాదళం

నాడు పోస్టు చేయడమైనది: 03 NOV 2026 8:45AM by PIB Hyderabad

చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లిన ‘అజిని’ నౌకను సముద్రపు దొంగల పిడికిట్లో నుంచి భారతీయ నౌకాదళం రక్షించింది. సత్వరం స్పందించి 48 గంటల కన్నా ఎక్కువ సమయం పాటు సమన్వయ పూర్వక దాడిని కొనసాగించి మరీ విజయాన్ని సాధించింది. నౌకలో ఉన్న 20 మంది సిబ్బందిని గాయాల పాలవకుండాను, ప్రాణహాని కలగకుండాను కాపాడారు.
అజినిని సోమాలియాకు ఈశాన్య దిక్కు కోస్తా తీరంలో సాయుధ సముద్ర దొంగల ముఠా కిందటి నెల మొదట్లో బలవంతంగా అధీనంలోకి తీసుకున్నారని తెలియవచ్చింది. ఈ అపహరణ ఉదంతం నౌకావాణిజ్య సంబంధిత సురక్షకు ఓ పెద్ద బెదరింపుగా పరిణమించింది.. ఆ ప్రాంతంలో నౌకావాణిజ్య కార్యకలాపాలకు వ్యతిరేకంగా మరిన్ని దాడులను మొదలు పెట్టడానికి ఈ నౌకను ఓ స్థావరంగా మార్చుకొనే ఆస్కారం ఉందని భావించారు.
ఈ తరుణంలో భారతీయ నౌకాదళం రంగంలోకి దిగి, ఓ యుద్ధనౌకను మోహరించింది. ఆ యుద్ధనౌకకు, సముద్ర నిఘాలో పాలుపంచుకొనే ఓ విమానం తరఫు నుంచి కూడా సహకారాన్ని అందించారు. ఈ రెండూ సన్నిహిత సమన్వయాన్ని ఏర్పరుచుకొని నౌక స్థితిని, దాని కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. నౌక కదలికల్ని పసిగడుతూ, అది పలాయనం చిత్తగించకుండా దశల వారీ దీటైన స్పందనాత్మక చర్యలను కూడా చేపట్టారు.
భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్)కు చెందిన సి-17 విమానంతో కచ్చితమైన ఎయిర్‌డ్రాప్‌లను చేపట్టి, మెరైన్ కమాండోల బృందం సేవలను కూడా తీసుకున్నారు.
శీఘ్రమైన, సమన్వయపూర్వకమైన పోరాట తంత్రాన్ని అమలుపరిచి, భారతీయ నౌకాదళం నౌకపై పట్టును బిగించింది. సముద్రపు దొంగల ముప్పును తిప్పికొట్టి, నౌకలో ఉన్న 20 మందిని సురక్షితంగా కాపాడారు.
ఈ విజయవంతమైన దాడి భారతీయ నౌకాదళం ఉన్నత నిర్వహణ సన్నద్ధతను, వివిధ దళాల మధ్య సవ్యమైన సమన్వయాన్ని చాటుతూ, సంక్లిష్ట నౌకా వాణిజ్య సంబంధిత భద్రత కార్యకలాపాలలో ఆశించిన ఫలితాన్ని రాబట్టగలిగిన సత్తాకు ఒక నిదర్శనంగా నిలిచింది. ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో తొలుత స్పందించే, పలు పక్షాలు మొగ్గు చూపే భద్రతాపరమైన భాగస్వామ్య దేశంగా భారత్ చాటుకొంటున్న అచంచల నిబద్ధతను కూడా మరో సారి స్పష్టం చేసింది.
నావికులకు అభయం ఇవ్వడంలో, కీలక నౌకావాణిజ్య మార్గాలను రక్షించడంలో, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సురక్షిత, సుస్థిర నౌకావాణిజ్య సంబంధిత వాతావరణాన్ని ఏర్పరచడంలో భారతీయ నౌకాదళం తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించడానికి కట్టుబడి ఉంది.

 

 

***


(రిలీజ్ ఐడి: 2331998) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam