వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వాణిజ్యం, ఆర్థిక సహకారం బలోపేతానికి లగ్జెంబర్గ్‌లో 19వ భారత్-బీఎల్ఈడబ్ల్యూ సంయుక్త ఆర్థిక కమిషన్ సమావేశం

లాజిస్టిక్స్, పునరుత్పాదక ఇంధనం, ఫిన్‌టెక్, ఆరోగ్యసంరక్షణ, అగ్రో-ఫూడ్ ప్రాసెసింగ్‌ సహా కీలక రంగాలపై చర్చలు

ఏరోస్పేస్, పరిశోధన, నూతన ఆవిష్కరణలు, ఉన్నత విద్య రంగాల్లో సహకారాన్ని

మరింత పెంపొందింపచేసుకొనేందుకు ఉన్న అవకాశాలపై
భారత్-బీఎల్ఈడబ్ల్యూ సంయుక్త ఆర్థిక సంఘం సమీక్ష

నాడు పోస్టు చేయడమైనది: 30 OCT 2026 12:45PM by PIB Hyderabad

భారత్-బెల్జియమ్-లగ్జెంబర్గ్ ఆర్థిక సంఘం (బీఎల్ఈడబ్ల్యూ) సంయుక్త ఆర్థిక కమిషన్ 19వ సమావేశాన్ని నిన్న, అంటే 2026 అక్టోబర్ 29న లగ్జెంబర్గ్‌లో నిర్వహించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడి సంబంధాలను సమీక్షించుకొనేందుకు, కీలక రంగాల్లో ఆర్థిక సహకారాన్ని ఇప్పటి స్థాయుల కన్న ఎక్కువగా పటిష్టపరుచుకొనేందుకు ఉన్న అవకాశాలను చర్చించేందుకు ఈ సమావేశం భారత్, బెల్జియమ్, లగ్జెంబర్గ్‌లకు ఓ అవకాశాన్ని కల్పించింది.
సంయుక్త ఆర్థిక కమిషన్ సమావేశానికి సహాధ్యక్షత వహించిన వారిలో భారత ప్రభుత్వ వాణిజ్య కార్యదర్శి శ్రీ రాజేశ్ అగర్వాల్ , బెల్జియమ్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం, అభివృద్ది మంత్రిత్వ శాఖలోని భూ-ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక దౌత్యం డైరెక్టర్-జనరల్ శ్రీ ఫిలిప్ వాండెన్ బుల్‌కే, లగ్జెంబర్గ్ విదేశీ వ్యవహారాలు, యూరోప్ వ్యవహారాలు, రక్షణ, అభివృద్ధి సహకారం, విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖలో సెక్రటరీ జనరల్ శ్రీ హెన్రీ షుమాకర్‌ ఉన్నారు.
భారత్, బెల్జియమ్, లగ్జెంబర్గ్‌ల మధ్య ప్రస్తుత వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను 19వ సమావేశంలో సమీక్షించారు. ఆర్థిక అనుబంధాన్ని పెంపొందింప చేసుకొనేందుకు, వాణిజ్యాన్ని, పెట్టుబడులను సరళతరం చేసేందుకు, పరస్పరం ఆసక్తి ఉన్న రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసుకొనేందుకు అనుసరించాల్సిన మార్గాలపై చర్చించారు.
ప్రాధాన్య రంగాలన్నిటిపై చర్చించారు. ఆయా రంగాలలో గగనతల సంధానం, ఓడరేవులు, లాజిస్టిక్స్, పునరుత్పాదక ఇంధనం, స్వచ్ఛ సాంకేతికత, ఆర్థిక సేవలు, ఫిన్‌టెక్, డిజిటల్ పరివర్తన, సమాచారం, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్, ఆయుర్వేద, సాంప్రదాయిక వైద్యం, వ్యవసాయం, ఆహార శుద్ధి పరిశ్రమ వంటివి ఉన్నాయి.
ఏరోస్పేస్, పరిశోధన, నూతన ఆవిష్కరణలు, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సహకారాన్ని విస్తరించుకొనేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించాలని సమావేశంలో నిర్ణయించారు. మార్కెట్టుకు సంబంధించిన అంశాల్లో వాణిజ్యపరమైన సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడం, మార్కెట్టు లభ్యతను సుగమం చేయడం, ఆర్థిక సంబంధాలను మరింతగా బలపరుచుకోవడానికి ఉన్న అవకాశాలను గుర్తించడంపైనా చర్చించారు.
మూడు దేశాలు ఆర్థిక ప్రాధాన్యాలపై తమ ఆలోచనలను ఒక పక్షానికి మరొక పక్షం తెలియజేసేందుకు, వివిధ రంగాల్లో సహకారాన్ని సమీక్షించుకొనేందుకు, వాణిజ్య అనుబంధం, పెట్టుబడి భాగస్వామ్యాలను ఇప్పటి కన్న పెంచుకొనేందుకు సంయుక్త ఆర్థిక కమిషన్ ఒక అవకాశాన్ని కల్పించింది. భారత్, బెల్జియమ్, లగ్జెంబర్గ్‌ల మధ్య పరస్పరం లాభదాయక ఆర్థిక సంబంధాలను ముందుకు తీసుకు పోవడానికి నిరంతర ప్రాతిపదికన చర్చలు జరుపుకొంటూ ఉండడంతో పాటు సహకరించుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఈ చర్చలలో పునరుద్ఘాటించారు.
సంయుక్త ఆర్థిక కమిషన్ సమావేశం ముగిసిన అనంతరం, వాణిజ్య కార్యదర్శి శ్రీ రాజేశ్ అగర్వాల్ లగ్జెంబర్గ్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీల ముఖ్య కార్యనిర్వహణ అధికారులతో వాణిజ్య ప్రధాన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌లో ఆర్థిక వృద్ధి, పెట్టుబడి అవకాశాలు బలంగా ఉన్నాయని తెలిపారు. ఆర్థిక సేవలు, ఆధునిక తయారీ, లాజిస్టిక్స్, స్వచ్ఛ ఇంధనం, డిజిటల్ సాంకేతికతలు, ఆరోగ్యసంరక్షణ, పరిశోధనలు, నూతన ఆవిష్కరణ వంటి రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాలను గురించి కూడా ఆయన వివరించారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలతో పాటు అంతర్జాతీయ వేల్యూ చైన్లలో భాగంగా సేవలను అందించడానికి గాను భారతీయ కంపెనీలతో అనుసంధానం కావడానికి గల అవకాశాలను గుర్తించాలంటూ లగ్జెంబర్గ్‌కు చెందిన కంపెనీలను ఆయన ప్రోత్సహించారు.

***


(రిలీజ్ ఐడి: 2330486) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Punjabi , Gujarati