గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం 2026: నవంబర్ 1 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా గిరిజన ఆత్మగౌరవ వేడుకలు


ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండాకు గౌరవ నివాళి అర్పించటానికి, ప్రతిష్ఠాత్మక సంక్షేమ పథకాలను చిట్టచివరి వ్యక్తికి చేరవేసేందుకు పక్షం రోజుల పాటు దేశవ్యాప్త కార్యక్రమాలు

300 కి పైగా ప్రాజెక్టులు, రెండు జాతీయ డిజిటల్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, 160 కి పైగా రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకు సిద్ధంగా ప్రణాళికలు

నాడు పోస్టు చేయడమైనది: 27 OCT 2026 4:32PM by PIB Hyderabad

ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2026 నవంబర్ 1 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా 'జాతీయ గిరిజన ఆత్మగౌరవ పక్షోత్సవాన్ని’ నిర్వహిస్తుంది. ఇది నవంబర్ 15న జరిగే 'జాతీయ గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం'తో (జన్‌జాతీయ గౌరవ్ దివస్) ముగుస్తుంది. ఈ పక్షోత్సవాన్ని కేవలం ఒక స్మారక ఉత్సవంగా మాత్రమే కాకుండా మంత్రిత్వ శాఖ చేపడుతోన్న ప్రధాన సంక్షేమ పథకాలను వేగవంతం చేయడానికి, వాటి ఫలాలను చిట్టచివరి గిరిజన కుటుంబానికి అందించడానికి నిర్వహిస్తున్నారు. గిరిజన సమాజాలు, విద్యార్థులు, ప్రజలలో వివిధ ప్రభుత్వ పథకాలు, హక్కులపై అవగాహన పెంచడానికి నిర్దేశించిన ఒక లక్ష్యిత, సమయ పరిమితి కలిగిన కార్యక్రమంగా ఇది ఉంటుంది.

 

గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 2021లో నవంబర్ 15ను 'జాతీయ గిరిజన ఆత్మగౌరవ దినోత్సవంగా’ ప్రకటించింది. భారత స్వాతంత్ర్య పోరాటంలో గిరిజన వీరుల కృషిని.. దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక జీవనంలో గిరిజన సమాజాలకు ఉన్న శాశ్వత స్థానాన్ని ఇది గౌరవిస్తుంది. అప్పటి నుంచి జాతీయ గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం భారతదేశపు గిరిజనుల ఆత్మస్థైర్యం, సాంస్కృతిక వైవిధ్యాన్ని జరుపుకునే ఒక జాతీయ ఉద్యమంగా మారింది. ఇది పీఎం-జన్మన్, ధర్తీ ఆబా జాతీయ గిరిజన గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ వంటి పరివర్తనాత్మక పథకాలకు మరింత వేగాన్ని అందించింది. గత 5 సంవత్సరాల్లో ఈ ఆత్మగౌరవ దినోత్సవ వేడుకలు రాంచీ (2021), ఖుంటి (2022, 2023), జముయి (2024), దేడియాపాడా‌లలో (2025) ఘనంగా జరిగాయి.

 

2024–25లో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని 'జాతీయ గిరిజన ఆత్మగౌరవ సంవత్సరం'గా నిర్వహించారు. ఈ సందర్భంగా 28కి పైగా జాతీయ స్థాయి కార్యక్రమాలు, 2 లక్షలకు పైగా కార్యకలాపాలు నిర్వహించగా 3.8 కోట్లకు పైగా ప్రజలు ఇందులో పాల్గొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో గిరిజనుల పాత్రను, జ్ఞానాన్ని, కళలను.. ప్రకృతితో వారికీ ఉన్న సామరస్యాన్ని గుర్తిస్తూ చేసుకునేదే ఈ జాతీయ గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం.

ఈ సంవత్సరం (2026) జాతీయ గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం (జేజేజీడీ) వేడుకల్లో భాగంగా మంత్రిత్వ శాఖ ఈ 15 రోజులు వరుసగా జాతీయ స్థాయి కార్యక్రమాలను నిర్వహించనుంది. ప్రణాళికలో ఉన్న కార్యక్రమాలు:

నవంబర్ 12న ఏకలవ్య మోడల్ ఆవాస పాఠశాలలకు (ఈఎంఆర్ఎస్‌) చెందిన సుమారు 200 మంది విద్యార్థులు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి‌తో ముఖాముఖి మాట్లాడుతారు.

నవంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో 'జాతీయ గిరిజన సాహితీ ఉత్సవాన్ని' నిర్వహిస్తారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన రచయితలు పాల్గొంటారు

ఐఐటీ ఢిల్లీలో ‘ఆది వాణిని గిరిజన సజీవ వారసత్వంగా, జాతీయ గిరిజన భాషా నిధిగా బలోపేతం చేయడం’ అనే అంశంపై జాతీయ వర్క్‌షాప్ నిర్వహిస్తారు.

నవంబర్ 14న జరిగే 'రాణి దుర్గావతి ఆదివాసీ మహిళా సమ్మేళనం' మార్కెట్ అనుసంధానాలను, మహిళల నేతృత్వంలోని పరిశ్రమలను బలోపేతం చేయడానికి 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 500 మంది గిరిజన మహిళా పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది.

అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు పీఎం-జన్మన్ మల్టీపర్పస్ కేంద్రాల్లో అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాల (పీవీటీజీల) కోసం 'స్వాస్థ్య-పోషణ్ సేవా సంగం' ఆధ్వర్యంలో ఆరోగ్య, పోషకాహార, ప్రభుత్వ పథకాల శిబిరాలను నిర్వహిస్తున్నారు.

నవంబర్ 1, 2 తేదీల్లో హైదరాబాద్‌లో గిరిజన వైద్యుల సామర్థ్య పెంపు సదస్సు నిర్వహిస్తారు. 1 లక్ష మంది సంప్రదాయ వైద్యులకు శిక్షణ ఇచ్చి ధ్రువీకరించే కార్యక్రమంలో భాగంగా 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1,500 మంది సంప్రదాయ గిరిజన వైద్యులు ఇందులో శిక్షణ పొందుతారు.

‘ధర్తీ ఆబా జన్ భాగస్వామ్య అభియాన్, ఆది సేవా సమయ్, ఆది సేవా దిన్'ల ద్వారా గిరిజన గ్రామాల్లో సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందిస్తుంది. రాష్ట్ర పరిపాలనా శిక్షణా సంస్థల (ఎస్ఏటీఐలు) ద్వారా 76,963 గ్రామాల్లో విస్తరించి ఉన్న సుమారు 1.54 లక్షల మంది 'ఆది కర్మయోగి' స్వచ్ఛంద సేవకులకు శిక్షణ ఇస్తున్నారు.

73 జిల్లాల్లో నిర్వహించే 'స్కాలర్‌షిప్ యాక్సెస్ క్యాంపులు' విద్యార్థులకు దరఖాస్తులను సమర్పించడంలో, ఆధార్ అనుసంధానం చేయడంలో సహాయపడతాయి.

ఒడిశాకు చెందిన కొరాపుట్‌లోని సీఎస్‌ఐఆర్-ఎన్‌బీఆర్‌ఐలో 200 నుంచి 300 మూలికా లేదా ఔషధ మొక్కల జాతులను సంరక్షించే కార్యక్రమం ప్రారంభమౌతుంది.

 

పైన పేర్కొన్న వాటితో పాటు జాతీయ గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాల్లోని గిరిజన సమాజాల కోసం 300కి పైగా ప్రాజెక్టులను చేపట్టనున్నారు. వీటిలో 228 ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి, 74 ప్రాజెక్టులు శంకుస్థాపనకు సిద్ధంగా ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో నూతన గిరిజన పరిశోధనా సంస్థ భవనం, మిజోరంలోని కేల్సిహ్‌లో 'రోపుయిలియాని గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం' కూడా ఇందులో ఉన్నాయి.

పక్షోత్సవంలో భాగంగా రెండు జాతీయ డిజిటల్ కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నారు. ఐసీఎమ్‌ఆర్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన 'జన్-హిత్' (గిరిజన ఆరోగ్య సమాచార, సాంకేతికత) పోర్టల్.. 20 రాష్ట్రాల పరిధిలో గిరిజన వర్గాల వారీగా ఆరోగ్య సమాచారాన్ని సేకరించే భారతదేశపు తొలి ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తుంది. జాతీయ ఎఫ్ఆర్ఏ డిజిటల్ ప్లాట్‌ఫామ్.. అటవీ హక్కుల చట్టం- 2006 కింద గ్రామసభకు సమర్పించటం నుంచి డిజిటల్ సంతకం చేసిన హక్కు పత్రాల దాకా అటవీ హక్కుల దావాల ప్రక్రియ మొత్తాన్ని ఒకే డిజిటల్ వ్యవస్థ పరిధిలోకి తీసుకొస్తుంది.

 

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ గిరిజన పరిశోధనా సంస్థల (టీఆర్ఐల) ద్వారా ఈ పక్షోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1 లక్ష కంటే ఎక్కువ మంది ప్రజల భాగస్వామ్యంతో 160కి పైగా కార్యక్రమాలను ప్రణాళిక చేశారు. వీటిలో సాంస్కృతిక వేడుకలు, ప్రదర్శనలు, నివాళులు అర్పించే కార్యక్రమాలు, పాఠశాలలు లేదా ఏకలవ్య మోడల్ ఆవాస పాఠశాలలు (ఈఎంఆర్ఎస్) లేదా హాస్టళ్లలో పోటీలు, సంక్షేమ, జీవనోపాధి శిబిరాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రస్థాయి గిరిజన కార్నివాల్, గోవాలో 'ఆదివాసీ కళ, ఖేల్ సమాగం', ఒడిశాలో 'భగవాన్ బిర్సా ముండా పెవీలియన్', షిల్లాంగ్‌లో గిరిజన సంగీత ఉత్సవం, గుజరాత్‌లోని అహ్మదాబాద్ హాట్‌లో గిరిజన కళలు- చేతివృత్తుల మేళా నిర్వహించనున్నారు. ఆధార్ సీడింగ్- ఉపకార వేతనాల శిబిరాలు, సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు, అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాల (పీవీటీజీల) కోసం ఆయుష్మాన్ కార్డు శిబిరాలు, అటవీ హక్కులపై చట్టపరమైన అవగాహన శిబిరాలను రాష్ట్రాలు నిర్వహిస్తాయి.

 

తమ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలలో పాల్గొనడం, మైగవ్‌ పోర్టల్‌లో జేజేజీడీ క్విజ్- ప్రతిజ్ఞలో భాగస్వాములు కావడం, గిరిజన కళాకారులకు మద్దతు ఇవ్వడం.. #JanjatiyaGauravDivas, #JJGD2026 హ్యాష్‌ట్యాగ్‌లతో తమ అనుభవాలు, కథనాలను పంచుకోవడం ద్వారా ఈ వేడుకల్లో పాల్గొనాలని గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరుతోంది.

***


(రిలీజ్ ఐడి: 2329296) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada