యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అవకతవకలు లేని క్రీడల పట్ల భారత్ కట్టుబడి ఉంది: క్రీడల్లో డోపింగ్ నిరోధానికి యునెస్కో అంతర్జాతీయ ఒప్పందం పరిధిలో నిర్వహించిన కాప్–10 బ్యూరో సమావేశంలో డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


నేర నిబంధనలను చేర్చేందుకు జాతీయ డోపింగ్ నిరోధక చట్టానికి భారత్ సవరణలు చేస్తుంది: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

2025–26లో 7,000కు పైగా పరీక్షలు, 350కు పైగా అవగాహనా కార్యక్రమాలు, 27,000 మందికి పైగా క్రీడాకారులను చేరుకున్న నాడా

నో యువర్ మెడిసిన్ యాప్‌లో నమోదయిన అయిదు లక్షలకు పైగా శోధనలు: కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మాండవీయ

నాడు పోస్టు చేయడమైనది: 27 OCT 2026 3:06PM by PIB Hyderabad

క్రీడల్లో డోపింగ్ నిరోధానికి యునెస్కో అంతర్జాతీయ ఒప్పందం కింద న్యూఢిల్లీలో జరిగిన కాప్–10 బ్యూరో మూడో అధికారిక సమావేశానికి, అలాగే 2026–27 సంవత్సరానికి సంబంధించి నిధుల ఆమోద కమిటీ నాలుగో అధికారిక సమావేశానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించారు. 

అవకతవకలు లేని క్రీడల పట్ల భారత్ నిబద్ధతతో వ్యవహరిస్తుందని బ్యూరోకు డాక్టర్ మాండవీయ తెలియజేశారు. “నిజాయతీతో కూడిన క్రీడానైపుణ్యం ఉండాలని భారత్ బలంగా విశ్వసిస్తుంది. ప్రతి క్రీడాకారుడికీ పోటీపడేందుకు సమాన అవకాశం దక్కాలి. కేవలం ప్రతిభ, సాధన, శ్రమపైనే విజయం ఆధారపడి ఉండాలి. అంతేకానీ నిషేధిత పదార్థాలు లేదా అక్రమ పద్ధతులపై కాదు. అవకతవకలు లేని నిజాయతీతో కూడిన క్రీడలను ప్రోత్సహించాలని, డోపింగ్‌ను ఏ మాత్రం ఉపేక్షించకూడదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తరచూ చెబుతుంటారు” అని ఆయన తెలియజేశారు. 

image.png

 

జాతీయ డోపింగ్ నిరోధక చట్టం–2022, 2025లో ఈ చట్టానికి చేసిన సవరణ ద్వారా దేశంలో డోపింగ్ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసిన తీరును కేంద్ర క్రీడల శాఖ మంత్రి వివరించారు. “జాతీయ డోపింగ్ నిరోధక చట్టం–2022, 2025లో ఈ చట్టానికి చేపట్టిన సవరణ 2026 జులైలో అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా చట్టపరమైన, సంస్థాగత వ్యవస్థలను భారత్ మరింత బలోపేతం చేసుకుంది” అని డాక్టర్ మాండవీయ తెలిపారు. “తదుపరి పార్లమెంట్ సమావేశాల్లో మరో సవరణను కూడా తీసుకురాబోతున్నాం. కోచ్‌లు, ఈ రంగంలోని ఇతర భాగస్వాములు పాల్పడే ఉల్లంఘనలను మరింత సమర్థంగా ఎదుర్కోవడానికి నేర నిబంధనలను ప్రవేశపెట్టడమే మా లక్ష్యం’’ అని ఆయన చెప్పారు. 

డోపింగ్‌ను ఎదుర్కోవడానికి, నిషేధిత పదార్థాల గురించి తన క్రీడాకారులకు సమాచారం అందించడానికి భారతదేశం ఇప్పటికే తీసుకున్న చర్యల గురించి కేంద్ర క్రీడల మంత్రి వివరించారు.

image.png

 

"2025-26 కాలంలో 7,000కు పైగా పరీక్షలను భారత జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నిర్వహించింది. రిస్క్ ఆధారిత పరీక్షలు, నిఘా సమాచారంతో కూడిన దర్యాప్తులపై దృష్టి సారించింది. అలాగే 350కి పైగా అవగాహన సదస్సులను చేపట్టి 27,000 మందికి చేరువైంది" అని డాక్టర్ మాండవీయ వెల్లడించారు. "ఔషధాల వినియోగానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకొనేలా సహకరిస్తున్న నో యువర్ మెడిసిన్ మొబైల్ యాప్‌లో ఇప్పటివరకు అయిదు లక్షలకు పైగా శోధనలు నమోదయ్యాయి" అని ఆయన వివరించారు. 

image.png

భారత్‌లోని తరగతి గదుల్లో ‘స్పోర్ట్ వ్యాల్యూస్ ఇన్ ఎవ్రీ క్లాస్‌రూమ్ టూల్‌కిట్’ను ప్రవేశపెట్టడానికి యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, యునెస్కోల మధ్య త్వరలో కుదరనున్న అవగాహన ఒప్పందం గురించి డాక్టర్ మాండవీయ ప్రస్తావించారు. తరగతి గదుల్లోనే క్రీడా విలువలు, నైతికత, నిజాయతీని  పెంపొందిస్తూ లక్షలాది మంది విద్యార్థులకు చేరువ కావడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం.

image.png

 

డోపింగ్‌పై పోరాటంలో అంతర్జాతీయ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడం, ఈ ఒప్పందాన్ని మరింత సమర్థంగా అమలు చేయడమే ఈ సమావేశం ప్రధానోద్దేశం. ప్రపంచ డోపింగ్ నిరోధక వ్యవస్థలో ప్రభుత్వ యంత్రాంగాల పాత్ర, బాధ్యతలను వివరించే విధాన పత్రంపై చర్చలు దృష్టి సారించాయి. అలాగే జాతీయ నిబంధనల అమలు వేదిక ద్వారా సభ్య దేశాలతో సమన్వయం చేసుకుంటూ, డోపింగ్ నిరోధక అవగాహన సామర్థ్యాన్ని, పరిశోధనలను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. నిధుల సమీకరణ, 2026-2031 కాలానికి నిధుల కార్యాచరణ వ్యూహం, నిబంధనల పాటింపు, దృఢమైన ప్రపంచ డోపింగ్ నిరోధక వ్యవస్థకు తోడ్పడేలా సామర్థ్యాల పెంపు తదితర అంశాలు కూడా ఈ సమావేశ అజెండాలో భాగంగా ఉన్నాయి.

ప్రారంభ సమావేశంలో అజర్‌బైజాన్ రిపబ్లిక్ యువజన, క్రీడల మంత్రి, కాప్–10 బ్యూరో ఛైర్‌పర్సన్ ఫరీద్ గయిబోవ్, క్రీడల్లో డోపింగ్ నిర్మూలన నిధుల ఆమోద కమిటీ ఛైర్‌పర్సన్ లూక్ మెక్‌కాన్, భారత ప్రభుత్వ క్రీడల శాఖ కార్యదర్శి, కాప్–10 బ్యూరో వైస్ ఛైర్‌పర్సన్ హరి రంజన్ రావు, యునెస్కో సామాజిక విధానాలు, సమ్మిళిత విభాగ డైరెక్టర్ గుస్తావో మెరినో పాల్గొన్నారు. వీరితో పాటు జాంబియా, స్పెయిన్, రష్యన్ ఫెడరేషన్‌లకు చెందిన కాప్–10 బ్యూరో, నిధుల ఆమోద కమిటీ సభ్యులు కూడా హాజరయ్యారు. 

image.png

 

గ్రూప్-IV ఉపాధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత్‌కు అంతర్జాతీయ క్రీడా పాలనా వ్యవహారాల్లో ఉన్న క్రియాశీలక భాగస్వామ్యాన్ని ఈ సంయుక్త సమావేశం స్పష్టం చేస్తుంది. నైతిక ప్రమాణాలతో కూడిన క్రీడా విధానాలను ప్రోత్సహించడం, క్రీడల్లో డోపింగ్ నిరోధానికి యునెస్కో అంతర్జాతీయ ఒప్పందం లాంటి అంతర్జాతీయ వ్యవస్థలకు పూర్తి స్థాయిలో సహకరించడంలో దేశ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది. 

***


(రిలీజ్ ఐడి: 2329295) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam