కేంద్ర మంత్రివర్గ సచివాలయం
azadi ka amrit mahotsav

బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనే సన్నద్ధతపై సమీక్షించేందుకు క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్‌సీఎంసీ) సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 26 OCT 2026 3:10PM by PIB Hyderabad

బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనే సన్నద్ధతపై సమీక్షించేందుకు క్యాబినెట్ కార్యదర్శి డాక్టర్ టీవీ సోమనాథన్ అధ్యక్షతన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్‌సీఎంసీ) సమావేశాన్ని నిర్వహించారు.

భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ ఈ కమిటీకి వివరాలను వెల్లడించారు. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం దాదాపు పశ్చిమ దిశగా కదిలి ‘ఆర్నబ్’ తుపానుగా బలపడిందని తెలిపారు. ఇది ఈరోజు ఉదయం 5:30 గంటల సమయానికి తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది శ్రీ విజయ పురం (అండమాన్ దీవులు)కు వాయవ్యంగా దాదాపు 590 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 650 కిలోమీటర్లు, కాకినాడకు తూర్పు-ఆగ్నేయంగా 730 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పుగా 830 కిలోమీటర్లు, బాపట్లకు తూర్పుగా 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వివరించారు.

ఇది అక్టోబర్ 27 నాటికి పశ్చిమ-వాయవ్య దిశగా, ఆ తర్వాత వాయవ్య దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేశారు. 2026 అక్టోబర్ 28 ఉదయానికి ఇది బాపట్ల - విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను అత్యంత తీవ్ర తుపానుగా దాటే సూచనలు ఉన్నాయి. ఆ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, గరిష్టంగా గంటకు 140 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవచ్చని తెలిపారు. అనంతరం ఇది తెలంగాణ, దక్షిణ ఒడిశా, దక్షిణ-మధ్య ఛత్తీస్‌గఢ్‌తో పాటు తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్‌లోని జిల్లాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

రాష్ట్రాలు/స్థానిక పరిపాలనా యంత్రాంగాలు చేపడుతున్న ముందస్తు చర్యల గురించి కమిటికీ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత ముఖ్యకార్యదర్శులు/ఉన్నతాధికారులు వివరించారు. తగినన్ని పునరావాస కేంద్రాలను, సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించే ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని కూడా చెప్పారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు సమాచారమిచ్చారు.

అక్టోబర్ 26 నుంచి 29 వరకు నైరుతి, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలోకి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, యానాం (పుదుచ్చేరి) తీర ప్రాంతాల్లో సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు తిరిగి ఒడ్డుకు చేరుకున్నారు. 

ప్రామాణిక నిర్వహణ విధానాలను (ఎస్ఓపీ) సిద్ధం చేశామని, అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశామని, తుపాను తీవ్రత వల్ల ఎదురయ్యే నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈ సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రిత్వశాఖలు/విభాగాలు తెలిపాయి. 

ఇప్పటికే అవసరమైన బృందాలను మోహరించామని, మరిన్ని బృందాలను సిద్ధంగా ఉంచామని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) తెలియజేసింది. ఆర్మీ, నౌకాదళం, వాయుదళం, భారత తీర రక్షక దళాలకు చెందిన రక్షణ, సహాయక బృందాలతో పాటుగా వాటి నౌకలు, విమానాలను సిద్ధం చేశారు. ఇప్పటి వరకు పలు నౌకలు/పడవలను తీరరక్షక దళం సురక్షితంగా రేవులు/తీరాలకు చేర్చింది. మిగిలిన నౌకలకు సైతం తీరానికి తిరిగి రావాలని హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎన్డీఎంఏ, ఐఎండీ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నాయని కేంద్ర హోం కార్యదర్శి ఈ కమిటీకి వివరించారు. 

కేంద్ర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు సన్నద్ధత చర్యలను క్యాబినెట్ కార్యదర్శి సమీక్షించారు. ప్రాణనష్టం ఏమాత్రం జరగకుండా చూడటం, ఆస్తిపాస్తులు, మౌలిక వసతులకు ఎదురయ్యే నష్టాన్ని కనిష్ట స్థాయికి పరిమితం చేయడమే ప్రధాన లక్ష్యం కావాలని స్పష్టం చేశారు. ఏదైనా నష్టం సంభవిస్తే, అత్యవసర సేవలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఎంహెచ్ఏ/ఐఎండీని ఆదేశించారు.

ఈ సమావేశంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గడ్, ఒడిశా, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యకార్యదర్శులు/ఉన్నతాధికారులు, పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ, మత్స్య విభాగం, ఓడరేవులు, నౌకారవాణా, జలమార్గాల మంత్రిత్వశాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు. ఎన్‌డీఎంయే సభ్యులు, విభాగాధిపతి, కార్యదర్శి, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (సీఐఎస్‌సీ) చైర్మన్‌ పరిధిలోని చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్, ఐఎండీ డైరెక్టర్ జనరల్, భారత తీర రక్షక దళం డైరెక్టర్ జనరల్, ఎంహెచ్ఏ పరిధిలోని మీడియా అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జనరల్‌తో పాటు ఐఎండీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2328604) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Kannada