ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అక్టోబర్‌ 23న చిన్మయ అమృత మహోత్సవ ప్రపంచ సమ్మేళనాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి చిన్మయ మిషన్‌ 75 ఏళ్ల వేడుకల ముగింపును సూచిస్తూ కార్యక్రమ నిర్వహణ

నాడు పోస్టు చేయడమైనది: 22 OCT 2026 3:45PM by PIB Hyderabad

2026 అక్టోబర్‌ 23న ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో చిన్మయ అమృత మహోత్సవ ప్రపంచ సమ్మేళనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

అక్టోబర్‌ 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సమ్మేళనంలో భారత్‌తో పాటు విదేశాల నుంచి 9,000 మందికి పైగా పాల్గొననున్నారు. 1951లో స్వామి చిన్మయానంద స్థాపించిన చిన్మయ మిషన్‌ 75 ఏళ్ల ప్రస్థానాన్ని స్మరించుకుంటూ ఏడాది పాటు నిర్వహించిన వేడుకలకు ఈ కార్యక్రమం ముగింపుగా నిలవనుంది. వేదాంతం, భగవద్గీతలోని జ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ ప్రపంచ ఆధ్యాత్మిక ఉద్యమం దశాబ్దాలుగా ఆధ్యాత్మిక విద్య, సాంస్కృతిక పరిరక్షణ, యువత సాధికారత, సామాజిక సేవ వంటి రంగాల్లో కార్యకలాపాలను విస్తరించింది.

 

ఏడాది పాటు నిర్వహించిన వేడుకలు గత ఏడాది తమిళనాడులోని గంగైకొండ చోళపురంలో ప్రారంభమయ్యాయి. ఆ సందర్భంగా ఇళయరాజా సంగీతం అందించిన, చిన్మయ మిషన్‌ రూపొందించిన భగవద్గీత తమిళ పద్య రూపకాన్ని ప్రధానమంత్రి విడుదల చేశారు. ఈ ఏడాది కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో సామూహిక హవనాలు నిర్వహించడం, త్రిపురలో మా సౌందర్య చిన్మయి ఆలయ ప్రతిష్ఠాపన, చిన్మయ గీతా సమర్పణం వంటి కార్యక్రమాలు జరిగాయి.  ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా ప్రజలు ఆన్‌లైన్‌లో భగవద్గీతలోని 15వ అధ్యాయాన్ని కలిసి పఠించిన ‘చిన్మయ గీతా సమర్పణం’ వంటివి ఉన్నాయి. ఈ వేడుకల్లో భాగంగా చేపట్టిన ప్రధాన కార్యక్రమాల్లో భగవద్గీతలోని ఎంపిక చేసిన అయిదు శ్లోకాలపై దృష్టి సారించిన ‘గీతా పంచామృతం’ ఒకటి. భగవద్గీత సందేశాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు చేరవేయడానికి చిన్మయ యువ కేంద్రానికి చెందిన 15 మంది యువ సభ్యులు ‘చిన్మయ అమృత యాత్ర’ చేపట్టారు. ఈ యాత్రలో వారు దేశవ్యాప్తంగా 40,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2327275) సందర్శకుల సూచీ సంఖ్య : : 19