రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

65వ జాతీయ కళా ప్రదర్శనలో ఎంపిక చేసిన కళాకారులకు

లలిత్ కళా అకాడమీ పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి

· యువ కళాకారులకు తమ ప్రతిభకు సాన పట్టుకునే, కొత్త మాధ్యమాలను అనుసరించే, సృజనశీలతను విస్తరించుకొనే అవకాశాలు

· మరిన్ని కల్పించాలన్న రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

నాడు పోస్టు చేయడమైనది: 21 OCT 2026 3:08PM by PIB Hyderabad

అరవై అయిదో జాతీయ కళా ప్రదర్శనలో పాల్గొన్న కళాకారుల్లో ఎంపిక చేసిన వారికి లలిత కళా అకాడమీ పురస్కారాలను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో ఈ రోజు ప్రదానం చేశారు. మూడో ప్రింట్ ఇండియా- (రెండేళ్లకోసారి జరిగే) 2026 లో గ్రాండ్ ప్రైజ్ విజేతలను, గౌరవ ప్రస్తావనలను అందుకున్న కళాకారులను రాష్ట్రపతి సత్కరించారు.

 

ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ, ఈ పురస్కారాల ప్రదానోత్సవం భారతీయ కళాత్మక వారసత్వం, సాంస్కృతిక వైవిధ్యం, సమకాలీన సృజనశీలతను పండుగ చేసుకొనే సందర్భమన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, మనం భారతదేశంలోని వివిధ కళల సుసంపన్న సంప్రదాయం, సృజన శక్తిలతో పాటు నిరంతరం అభివృద్ధి చెందుతున్న కళాత్మక అభివ్యక్తీకరణగా ఈ ఉత్సవాన్ని జరుపుకొంటున్నామని ఆమె వర్ణించారు.

 

కేన్వాసుపై చిత్రించిన ఆకృతులు, రాయిని చెక్కి మలచిన శిల్పాలు లేదా వేరువేరు ఇతర మాధ్యమాల్లో రూపొందించిన కళాకృతులకు మాత్రమే కళ పరిమితం కాదని రాష్ట్రపతి అన్నారు. కళ మన సంస్కృతికి అద్దం పడుతుందనీ, జ్ఞాపకాలూ, వర్తమాన అనుభవాలూ, భావి ఆకాంక్షలూ కళలో తొంగిచూస్తాయనీ రాష్ట్రపతి అన్నారు. మనం జీవిస్తున్న కాలాన్నీ, సమాజాన్నీ ఒక కొత్త దృష్టి కోణంలో చూసే, అర్థం చేసుకొనే అనుభవాల్ని కళ పంచిపెడుతుందన్నారు. సుదూర ప్రాంతాల్లో సాంప్రదాయిక కళాకారులకు కొత్త సాంకేతికతలలో, సమకాలీన కళాశైలిలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ, ఇలా చేసినందువల్ల వారు విస్తృత వేదికల్లో పోటీపడి కళాకారులు ప్రావీణ్యాన్ని చాటగలుగుతారనీ రాష్ట్రపతి అన్నారు.

నేటి ప్రపంచంలో కళాకారులకు వారి ప్రతిభను ప్రదర్శించే అవకాశాలను అందించడం ఒక్కటే కాకుండా ఆర్థిక సహాయాన్నీ, విశాల మార్కెట్టును, కళా సేకర్తలతో పరిచయావకాశాలను కూడా అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి అన్నారు. కళాకృతుల అమ్మకాన్ని ప్రోత్సహించే దిశగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, లలిత కళా అకాడమీ కృషి చేస్తున్నాయని తెలిసి తాను సంతోషిస్తున్నానని రాష్ట్రపతి అన్నారు.

 

కళ ఒక్క ప్రదర్శనశాలలకే పరిమితం అయిపోకూడదు అని రాష్ట్రపతి స్పష్టం చేశారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, బహిరంగ స్థలాలతో పాటు సమాజంలోని సువిశాల వర్గాల చెంతక కళను చేర్చాలని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రతిభను తీర్చిదిద్దుకొనేందుకూ, కొత్త మాధ్యమాలను అనుసరించేందుకూ, సృజనాత్మక శక్తి సామర్థ్యాల పరిధిని విస్తరించుకొనేందుకూ యువ కళాకారులకు, ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న కళాకారులకు తగినన్ని అవకాశాల్ని అందించాల్సిందిగా రాష్ట్రపతి కోరారు.

రాష్ట్రపతి ప్రసంగం ఇక్కడ:  

 

Please click here to see the President’s Speech

 

***


(రిలీజ్ ఐడి: 2326009) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , हिन्दी , Gujarati