ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతోన్న డీఆర్ఐ: ఏడు కిలోలకు పైగా యాంఫెటమైన్, మూడు కిలోల కొకైన్ స్వాధీనం.. ముగ్గురు అరెస్టు

బెంగళూరు- ఢిల్లీ విమానాశ్రయాలలో, నాగ్‌పూర్ సమీపంలో నిఘా సమాచారంతో చేపట్టిన తనిఖీల్లో ప్రయాణికుల బ్యాగుల్లో గుట్టుచప్పుడు కాకుండా దాచిన మాదకద్రవ్యాల గుట్టు రట్టు

నాడు పోస్టు చేయడమైనది: 19 OCT 2026 4:23PM by PIB Hyderabad

దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘాను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) మరింత తీవ్రతరం చేసింది. సమన్వయంతో కూడిన నిఘా ఆధారిత ఆపరేషన్ల ద్వారా రెండు వేర్వేరు దాడుల్లో సుమారు 7.1 కిలోల యాంఫెటమైన్‌ను, మరో ఆపరేషన్‌లో సుమారు 3.1 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకుంది. వీటికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం.. నాగ్‌పూర్ సమీపంలో, ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) వద్ద ఈ స్వాధీనాలు జరిగాయి.

 

కచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా డీఆర్ఐ అధికారులు 2026 అక్టోబర్ 14న ఢిల్లీ నుంచి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఒక ప్రయాణికుడిని పట్టుకొని తనిఖీ చేశారు. ఆ ప్రయాణికుడి లగేజీని పరిశీలించగా 5.166 కిలోల యాంఫెటమైన్ లభించింది. ఎన్‌డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్)-1985 చట్ట నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకున్న ఆ పదార్థాన్ని సీజ్ చేసి ప్రయాణికుడిని అరెస్టు చేశారు.

 

రెండు రోజుల తర్వాత మరొక నిఘా ఆధారిత ఆపరేషన్‌లో భాగంగా నాగ్‌పూర్ శివార్లలోని సౌనెర్ వద్ద ఉన్న ఖాపా ఫాటా సమీపంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బస్సులో ప్రయాణిస్తున్న ఒక భారతీయ పౌరుడైన ఒక వ్యక్తిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. అతను వేసుకున్న బ్యాగును పరిశీలించగా ఒక కొత్త లేడీస్ సూట్‌లో తెల్లటి స్పటిక రూపంలో ఉన్న పదార్థం దాచిపెట్టి ఉన్నట్లు గుర్తించారు.

 

ఆ బ్యాగు అసాధారణ బరువు ఉండటంతో అధికారులు దాని లోపలి లైనింగ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో అదే రకమైన పదార్థం ఉన్న మరో రహస్య ప్యాకెట్ లభించింది. క్షేత్రస్థాయి పరీక్షల్లో అది యాంఫెటమైన్ అని నిర్ధారణ అయింది. మొత్తం 1.97 కిలోల యాంఫెటమైన్‌ను ఎన్‌డీపీఎస్ చట్టం- 1985 కింద రికవరీ చేసి సీజ్ చేశారు. ఆ ప్రయాణికుడిని కూడా అరెస్టు చేశారు.

మరొక వేరే ఆపరేషన్‌లో భాగంగా 2026 అక్టోబర్ 15, 16 తేదీల్లో అందిన కచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా.. ఘనా నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) టర్మినల్-3కి చేరుకున్న ఒక భారతీయ ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. అతని లగేజీని పద్ధతి ప్రకారం పరిశీలించగా మొత్తం 3.134 కిలోల బరువున్న తెల్లటి పొడితో కూడిన ఆరు పారదర్శక ప్యాకెట్లు లభించాయి. క్షేత్రస్థాయి పరీక్షల్లో అది కొకైన్ అని నిర్ధారణ అయింది. ఎన్‌డీపీఎస్ చట్టం- 1985 నిబంధనల కింద ఆ పదార్థాన్ని స్వాధీనం చేసుకొని ప్రయాణికుడిని అరెస్టు చేశారు.

 

ఈ ఆపరేషన్లు మాదకద్రవ్యాల సరఫరా గొలుసులను అడ్డుకోవడానికి, సరికొత్త అజ్ఞాత పద్ధతులను గుర్తించడానికి.. దేశంలోని విమాన, రహదారి నెట్‌వర్క్‌ల ద్వారా ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల రవాణాను నిరోధించడానికి డీఆర్ఐ చేస్తున్న నిరంతర కృషిని స్పష్టం చేస్తున్నాయి.

***


(రిలీజ్ ఐడి: 2325249) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Kannada