ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆరు నెలలలోపు శిశువుల ఆహార ఉత్పత్తుల్లో సుక్రోజ్‌, ఫ్రక్టోజ్‌ కలపడంపై ఆంక్షలు విధించే దిశగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చర్యలు


శిశు పోషణ ప్రమాణాల బలోపేతానికి కీలక నిర్ణయం..

శిశు పోషకాహార నిబంధనల సవరణకు ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ

తొలి ఆరు నెలల్లో అదనపు చక్కెరల వినియోగంపై పటిష్టమైన రక్షణ చర్యల ప్రతిపాదన

శిశువుల జీవితంలో కీలకమైన తొలి ఆరు నెలల్లో సరైన పోషకాహారాన్ని ప్రోత్సహించడం, ఆరోగ్యకరమైన ఎదుగుదల, అభివృద్ధికి తోడ్పడటమే ప్రతిపాదిత ఆంక్షల లక్ష్యం

నివారణాత్మక ఆరోగ్య సంరక్షణ, శిశు పోషకాహారం, దీర్ఘకాలిక ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వ నిబద్ధతకు ఈ చర్య మరింత బలం

నాడు పోస్టు చేయడమైనది: 17 OCT 2026 1:59PM by PIB Hyderabad

శిశువుల పోషకాహార భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్యలో భాగంగా.. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఆహార భద్రత, ప్రమాణాల (శిశు పోషకాహార ఉత్పత్తులు) నిబంధనలు 2020కు సవరణ ప్రతిపాదిస్తూ ముసాయిదాను ప్రచురించింది. ఆరు నెలలలోపు శిశువుల కోసం ఉద్దేశించిన ఆహార ఉత్పత్తుల్లో సుక్రోజ్‌, ఫ్రక్టోజ్‌ కలపడాన్ని నిషేధించాలని ఈ ముసాయిదాలో ప్రతిపాదించింది. 

 

ఆహార భద్రత, ప్రమాణాల (శిశు పోషకాహార ఉత్పత్తులు) సవరణ నిబంధనలు 2026 పేరుతో రూపొందించిన ఈ ముసాయిదాను 2026 అక్టోబర్‌ 16న భారత గెజిట్‌లో ప్రచురించారు. శిశువుల వయసుకు తగిన పోషక అవసరాలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను తయారు చేసేలా ప్రస్తుత నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం దీని లక్ష్యం. ముఖ్యంగా జీవితంలోని తొలి దశల్లో అదనంగా కలిపే చక్కెరలకు శిశువులు గురయ్యే అవకాశాన్ని తగ్గించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

 

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు పుట్టినప్పటి నుంచి 24 నెలల వయసు వరకు ఉన్న పిల్లల కోసం తయారు చేసే వివిధ రకాల శిశు పోషకాహార ఉత్పత్తులకు సంబంధించిన పోషక పదార్థాల కూర్పు, నాణ్యత, భద్రత ప్రమాణాలను సమగ్రంగా నిర్దేశిస్తున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం కార్బోహైడ్రేట్లకు లాక్టోస్‌, గ్లూకోజ్‌ పాలిమర్లు ప్రాధాన్య వనరులుగా ఉన్నాయి. అయితే, కార్బోహైడ్రేట్ల వనరుగా అవసరమైనప్పుడు మాత్రమే నిర్దేశించిన పరిమితులకు లోబడి సుక్రోజ్‌, ఫ్రక్టోజ్‌ లేదా ఈ రెండింటినీ కలపడానికి అనుమతి ఉంది.

 

ప్రస్తుత నిబంధనలకు మరింత బలం చేకూర్చేలా, ఆరు నెలలలోపు శిశువుల కోసం ఉద్దేశించిన ఆహార ఉత్పత్తుల్లో సుక్రోజ్‌, ఫ్రక్టోజ్‌ కలపడంపై నిర్దిష్ట ఆంక్షను ఈ ముసాయిదా సవరణ ప్రతిపాదిస్తోంది. “ఆరు నెలల వయసు వరకు ఉన్న శిశువుల కోసం ఉద్దేశించిన ఉత్పత్తుల్లో సుక్రోజ్‌, ఫ్రక్టోజ్‌ కలపకూడదు” అని ప్రతిపాదిత నిబంధన పేర్కొంటోంది.

 

జీవితంలోని తొలి ఆరు నెలలు శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదల, అభివృద్ధికి అత్యంత కీలకమైన దశ. ఈ సమయంలో తగిన పోషకాహారం అందించడం ఎంతో ముఖ్యం. అనవసరంగా సుక్రోజ్‌, ఫ్రక్టోజ్‌ కలపకుండా, ఈ వయసు పిల్లల పోషక అవసరాలను తీర్చేలా శిశు పోషకాహార ఉత్పత్తులను రూపొందించడమే ప్రతిపాదిత ఆంక్ష ఉద్దేశం. చిన్న వయసులోనే అదనపు చక్కెరలకు గురికావడం వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించే విస్తృత ప్రజారోగ్య చర్యలకు కూడా ఇది తోడ్పడుతుంది. వీటిలో బాల్యంలో ఊబకాయం, దానికి సంబంధించిన ఇతర ఆరోగ్య సమస్యలతో ముడిపడిన ఆహారపు అలవాట్లకు సంబంధించిన ప్రమాద కారకాలు ఉన్నాయి.

 

జీవితంలోని తొలి ఆరు నెలల పాటు శిశువులకు కేవలం తల్లి పాలనే అందించాలని సూచించే ప్రస్తుత ప్రజారోగ్య సిఫార్సులకు ఈ చర్య తోడ్పడుతుంది. శిశు పోషకాహార ఉత్పత్తులకు సంబంధించిన ప్రమాణాలను మరింత బలోపేతం చేయడం ద్వారా తగిన శిశు పోషణ పద్ధతులను ప్రోత్సహించడంతో పాటు, చిన్నారుల నిర్దిష్ట పోషక అవసరాలకు ప్రాధాన్యమిస్తూ ఉత్పత్తులను తయారు చేసేలా తయారీదారులను ప్రోత్సహించడం ఈ ప్రతిపాదిత సవరణ లక్ష్యం. 

 

ఈ ప్రతిపాదిత నియంత్రణ చర్య ద్వారా శాస్త్రీయ ఆధారాలపై రూపొందించిన ఆహార ప్రమాణాలు, ఉత్పత్తుల తయారీలో బాధ్యతాయుతమైన విధానాలు, నివారణాత్మక పోషకాహారంపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిరంతరం దృష్టి సారిస్తున్నట్లు స్పష్టమవుతోంది. దేశ విస్తృత ప్రజారోగ్య ప్రాధాన్యతల్లో భాగంగా జీవితంలోని తొలి దశ నుంచే పిల్లల పోషక ఆరోగ్యాన్ని కాపాడటం ఎంత ముఖ్యమో ఈ చర్య తెలియజేస్తోంది.

 

ఈ ముసాయిదా నోటిఫికేషన్‌ను ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్రచురించారు. నోటిఫికేషన్‌ కలిగిన అధికారిక గెజిట్‌ ప్రతులు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తేదీ నుంచి 60 రోజుల్లోగా సంబంధిత వర్గాలు తమ అభ్యంతరాలు, సూచనలు సమర్పించవచ్చు. నిర్దేశించిన గడువులో అందిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అనంతరం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ సవరణకు తుది రూపు ఇస్తుంది.

 

 గెజిట్‌ నోటిఫికేషన్‌ కోసం ఈ లింక్‌ను చూడవచ్చు:

 

https://egazette.gov.in/(S(3nckv5a5rxblmebm3laawlkr))/ViewPDF.aspx


(రిలీజ్ ఐడి: 2324794) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Tamil , Malayalam