ఆయుష్
ఆయుష్ రంగంలో నూతన ఆవిష్కరణల కారణంగా పేటెంట్ల దరఖాస్తుల్లో 8 రెట్ల వృద్ధి
నూతన ఆవిష్కరణలు, మేధా సంపత్తి సంబంధిత కార్యకలాపాల్లో తీవ్ర వృద్ధిని ప్రస్తావించిన
ఆయుష్ ఆవిష్కరణల నివేదిక
744 దరఖాస్తులు, 142 గ్రాంట్లతో
ఆయుష్ పేటెంట్ సంబంధిత కార్యకలాపాల్లో అగ్రగామిగా మహారాష్ట్ర
నాడు పోస్టు చేయడమైనది:
16 OCT 2026 2:33PM by PIB Hyderabad
ఆయుష్తో ముడిపడిన నూతన ఆవిష్కరణలు, మేధా సంపత్తి కార్యకలాపాల్లో గడచిన పది సంవత్సరాల్లో కీలక విస్తరణ చోటు చేసుకుంది. ఈ విషయాన్ని 11వ ఆయుర్వేద దినోత్సవాల సందర్బంగా ఆయుష్ సంబంధిత ఆవిష్కరణలపై విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొన్నారు. దీనిలో 2014-15 ఆర్థిక సంవత్సరం మొదలు 2025-26 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో పేటెంట్ల కోసం 4,077 దరఖాస్తులను సమర్పించగా, 711 పేటెంట్లను ఇచ్చారని ఈ నివేదికలో తెలియజేశారు.
నివేదికను కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల శాఖకు చెందిన పరిశ్రమ, అంతర్జాతీయ వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ)లో ఓ భాగంగా ఉన్న పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్మార్కుల కంట్రోలర్ జనరల్ కార్యాలయం (సీజీపీడీటీఎమ్) ప్రచురించింది. ఈ నివేదిక భారతదేశంలో ఆయుష్కు సంబంధించిన ఆవిష్కరణలు, మేధా సంపత్తి కార్యకలాపాల పరిణామ క్రమం తాలూకు సంక్షిప్త వివరణను అందించింది.
ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్రావ్ జాదవ్ మాట్లాడుతూ, ‘‘ఆయుష్కు సంబంధించిన పేటెంట్లను దాఖలు చేయడం, గ్రాంట్లలో చోటు చేసుకున్న కీలక వృద్ధి ఈ రంగంలో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, మేధా సంపత్తిపై పెరుగుతున్న ఆసక్తిని చాటుతోంది. సాంప్రదాయిక జ్ఞానం, విజ్ఞానశాస్త్ర సంబంధిత పరిశోధనలు, సమకాలీన నూతన ఆవిష్కరణలు కలిసి నూతన ఉత్పాదనలు, సాంకేతికతలు, సేవలకు దోహదం చేసే ఓ విస్తారిత అనుబంధ వాతావరణాన్ని (ఇకోసిస్టమ్) ఏర్పరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అలాగే భారత సుసంపన్న జ్ఞాన వ్యవస్థలను సముచిత రీతిన పరిరక్షించేందుకు అనువైన వాతావరణాన్ని కూడా నెలకొల్పడానికి ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తుంది’’ అని పేర్కొన్నారు.
ఆయుష్ శాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేశ్ కొటేచా మాట్లాడుతూ, ‘‘ ఆయుష్ రంగంలో పరిశోధన, నూతన ఆవిష్కరణల పునాది అంతకంతకు బలపడుతోందని పేటెంట్ సంబంధిత కార్యకలాపాల్లో నిరంతర వృద్ధి చాటిచెబుతున్నది. వ్యక్తులు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, అంకుర సంస్థలు, పరిశ్రమ.. వీటి అన్నిటి భాగస్వామ్యం పెంపొందుతుండడం ఉత్సాహకరం. పరిశోధనలను నూతన సేవలుగా మార్చడానికి ఈ ధోరణి సాయపడుతుంది. మంత్రిత్వ శాఖ ఆయుష్ రంగంలో ఫలితాలను రాబట్టడానికి, పరిశోధన ప్రధానమైన సహకారాన్ని అందించడానికి, నూతన ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడాన్ని కొనసాగిస్తుంది’’ అన్నారు.
నివేదికలో పేటెంట్లకు సంబంధించిన కార్యకలాపాల్లో గొప్ప వృద్ధి ఉన్నట్లు ప్రస్తావించారు. ఏటా దాఖలయ్యే దరఖాస్తులు 2014-15 ఆర్థిక సంవత్సరంలో 63గా ఉండగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇవి 590కి చేరాయి. ఇది సుమారు 836.5 శాతం వృద్ధిని సూచిస్తోంది. పేటెంట్ ఫైలింగులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠ స్థాయిలో 606కు పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తగ్గి, 299కు పరిమితమయ్యాయి. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో మళ్లీ పెరిగి 590కి ఎగబాకాయి. వార్షిక పేటెంట్ గ్రాంట్లలోనూ చెప్పుకోదగిన వృద్ధి చోటు చేసుకుంది. ఇవి 2015-16 ఆర్థిక సంవత్సరంలో 3 వద్ద ఉండగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 204కు పెరిగాయి.

కోవిడ్ అనంతర కాలంలో పేటెంట్ సంబంధిత కార్యకలాపాలు విశేషించి తీవ్ర వృద్ధిని కనబరిచాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదలు 2025-26 ఆర్థిక సంవత్సరం మధ్య 2,854 దరఖాస్తులు (ఇది మొత్తం దరఖాస్తుల్లో 70 శాతంగా లెక్కకు వస్తుంది) నమోదు అయ్యాయి. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం మధ్య కాలంలో కేవలం 1,223 దరఖాస్తులు నమోదయ్యాయి. కోవిడ్ అనంతర కాలంలో 657 పేటెంట్లను ఇచ్చారు. ఇవి మొత్తం అందిన గ్రాంట్లలో 92.4 శాతంగా లెక్కకు వచ్చాయి.
పరిధి విశాలం అవుతున్న నూతన ఆవిష్కరణల ఇకోసిస్టమ్ దరఖాస్తుల వివిధత్వంలోనూ ప్రతిబింబిస్తోంది. వ్యక్తులు 2,113 దరఖాస్తులు దాఖలు చేశారు. ఇది మొత్తం దరఖాస్తుల్లో 51.9 శాతానికి సమానం. కాగా వారికి 398 పేటెంట్లను ఇచ్చారు. విద్యా సంస్థలు 995 దరఖాస్తులు సమర్పించాయి. వాటికి 88 పేటెంట్లను ఇచ్చారు. ఈ ప్రకారంగా, వ్యక్తులతో పాటు విద్యాసంస్థలు కలిసి మొత్తం దరఖాస్తుల్లో 76.3 శాతం తోడ్పాటును అందించాయి. కంపెనీలు, ఇతర సంస్థలు 700 దరఖాస్తులు దాఖలు చేశాయి. వాటికి 176 పేటెంట్లను ప్రదానం చేశారు. చిన్న సంస్తలు 144 దరఖాస్తులను, అంకుర సంస్థలు 125 దరఖాస్తులను సమర్పించాయి.
నివేదికలో పేర్కొన్న అంశాలు ఆయుష్ రంగంలో పరిశోధన, నూతన ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికత్వం, మేధా సంపత్తి పరిరక్షణల మధ్య పెరుగుతున్న అంతస్సంబంధాలను చాటిచెబుతున్నాయి. ఈ రంగంలో వ్యక్తిగత ఆవిష్కరణలు, విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, అంకుర సంస్థలు, పారిశ్రామిక రంగం.. వీటి భాగస్వామ్యం కూడా అంతకంతకూ విస్తరిస్తోందని తేలింది.
***
(రిలీజ్ ఐడి: 2324572)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8