ఉప రాష్ట్రపతి సచివాలయం
కార్వార్లో భారత నౌకాదళ తొలి స్వదేశీ బహుళ ప్రయోజక నౌక ఐఎన్ఎస్ సమర్థక్ను నౌకాదళంలోకి ప్రవేశపెట్టిన ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్
75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఐఎన్ఎస్ సమర్థక్… రక్షణ రంగ తయారీలో భారత్ స్వావలంబనకు ప్రతీక: ఉపరాష్ట్రపతి
భారత సముద్ర జలాల ప్రయోజనాలను కాపాడేందుకు అప్రమత్తంగా, సంసిద్ధతతో ఉన్న భారత నౌకాదళం: ఉపరాష్ట్రపతి
పెరుగుతున్న భారత ప్రైవేట్ నౌకా నిర్మాణ పరిశ్రమ పాత్రను ప్రతిబింబించే ఐఎన్ఎస్ సమర్థక్: ఉపరాష్ట్రపతి
భారత గొప్ప సముద్ర వారసత్వానికి, భవిష్యత్తుకు ప్రతీకగా కార్వార్: ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
16 OCT 2026 3:08PM by PIB Hyderabad
కర్ణాటకలోని కార్వార్లో భారత నౌకాదళ తొలి స్వదేశీ బహుళ ప్రయోజక నౌక ఐఎన్ఎస్ సమర్థక్ను భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఇవాళ ప్రారంభించారు. రక్షణ రంగ తయారీలో స్వావలంబన దిశగా, అత్యాధునిక స్వదేశీ నౌకాదళ సామర్థ్యాల అభివృద్ధి దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో ఈ నౌక ప్రారంభం కీలక ఘట్టాన్ని సూచిస్తుంది.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. 75 శాతానికిపైగా స్వదేశీ పరిజ్ఞానం, సామగ్రితో ఐఎన్ఎస్ సమర్థక్ ను రూపొందించినట్లు చెప్పారు. ఇది పెరుగుతున్న భారత పారిశ్రామిక, సాంకేతిక, నౌకా నిర్మాణ సామర్థ్యాలను ప్రతిబింబిస్తోందని అన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన ఇప్పుడు కేవలం ఆకాంక్ష మాత్రమే కాదని, అది వాస్తవ రూపం దాల్చుతున్నట్లు తెలిపారు. ఇది భారత వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్' దార్శనికతకు దోహదపడుతుందని తెలిపారు.
భారతదేశ సుసంపన్న సముద్ర వారసత్వాన్ని ప్రస్తావిస్తూ.. హిందూ మహాసముద్రం, ఆగ్నేయాసియా వ్యాప్తంగా భారత సముద్రజలాల ప్రభావాన్ని విస్తరించిన ఛత్రపతి శివాజీ మహారాజ్, చోళ రాజవంశపు నౌకాదళ సంప్రదాయాలను శ్రీ సీపీ రాధాకృష్ణన్ గుర్తు చేశారు.
జాతీయ సార్వభౌమాధికారాన్ని, సముద్ర జలాల ప్రయోజనాలను కాపాడటంలో విశిష్ట సేవలందిస్తున్న భారత నౌకాదళాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. సముద్రపు దొంగలను నియంత్రించే ఆపరేషన్లు, భారత పౌరుల తరలింపు, మానవతా సాయం, విపత్తు సహాయక చర్యలతో సహా హిందూ మహాసముద్ర ప్రాంతంలో తక్షణమే స్పందించే, విశ్వసనీయ భద్రతా భాగస్వామిగా నౌకాదళ పాత్రను అభినందించారు.
ఐఎన్ఎస్ సమర్థక్ ప్రాముఖ్యతను వివరిస్తూ.. తదుపరితరం ఆయుధాలు, సెన్సార్లు, అత్యాధునిక సాంకేతికతల పరీక్షలు, విశ్లేషణకు ఈ నౌక బహుముఖ వేదికగా ఉపయోగపడుతుందని ఉపరాష్ట్రపతి తెలిపారు. సముద్ర నిఘా, పరిశీలన, తీరప్రాంత గస్తీ, లక్ష్యాలను ప్రయోగించటం, ఫలితాలను పొందటం, మానవరహిత వ్యవస్థలతో కూడిన ఆపరేషన్లు, మానవతా సాయం, విపత్తు సహాయక చర్యలకు కూడా దీని సామర్థ్యాలు మద్దతునిస్తాయని చెప్పారు. ఇలాంటి వేదిక వల్ల నూతన సాంకేతిక పరిణామాలను నౌకాదళం మరింత వేగంగా అందిపుచ్చుకునేందుకు, స్వదేశీ ఆవిష్కరణలను ఆచరణాత్మక సామర్థ్యాలుగా మార్చుకునేందుకు వీలుంటుందని అన్నారు.
కార్వార్ వ్యూహాత్మక ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ... సహజంగానే ఉన్న లోతైన నౌకాశ్రయం, అరేబియా సముద్రానికి సమీపంలో ఉండటం వల్ల భారత సముద్ర భద్రతా వ్యవస్థలో ఇది అత్యంత కీలక భాగమని శ్రీ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. ప్రాజెక్టు సీబర్డ్ ద్వారా కొనసాగుతున్న ఆధునిక నౌకాదళ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రాంతంలో విస్తృత ఆర్థిక అవకాశాలను సృష్టిస్తూనే నౌకలు, జలాంతర్గాములను నిలిపేందుకు, నిర్వహించేందుకు ఇది నౌకాదళ సామర్థ్యాన్ని పెంచుతుందని తెలిపారు.
రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయటంలో భారత నౌకాదళం, రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ షిప్‌యార్డులు, డీఆర్డీఓ, విద్యా సంస్థలు, ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఈ ప్రాజెక్టులో లార్సెన్ అండ్ టౌబ్రో (ఎల్&టీ) అందించిన సహకారాన్ని ప్రశంసిస్తూ.. స్వదేశీ నౌకాదళ సామర్థ్యాల నిర్మాణంలో నేవీ విభాగ డిజైనర్లు, ఉత్పత్తి విభాగాల అధికారులు, షిప్‌యార్డ్ నిపుణులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, సరఫరాదారులు, అనుబంధ పరిశ్రమల కృషిని ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, వైస్-అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్, కంట్రోలర్ వార్‌షిప్ ప్రొడక్షన్ అండ్ అక్విజిషన్ వైస్-అడ్మిరల్ సంజయ్ సాధు, ఫ్లాగ్ ఆఫీసర్ (కర్ణాటక), రియర్ అడ్మిరల్ విక్రమ్ మీనన్, ఎల్ అండ్ టీ షిప్‌బిల్డింగ్ విభాగాధిపతి రిటైర్డ్ రియర్ అడ్మిరల్ జీ.కే. హరీశ్, ఐఎన్ఎస్ సమర్థక్ కమాండింగ్ ఆఫీసర్ కమాండర్ సుశీల్ కుమార్ సింగ్, భారత నౌకాదళం, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2324567)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11