హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జనగణనలో ప్రజల భాగస్వామ్యం పెంపు.. శాస్త్రీయ సమాచార సేకరణ దిశగా అధికారిక పోర్టల్‌ ప్రారంభం


జనాభా మార్పులపై ఉన్నతస్థాయి కమిటీ చైర్మన్‌ (రిటైర్డ్) జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్‌ ద్వారా https://demography.mha.gov.inకు శ్రీకారం

ప్రజలకు అందుబాటు సహా భాగస్వాముల ద్వారా సమాచార సమర్పణ.. ఆదానప్రదానానికి పోర్టల్‌ సిద్ధం

అసాధారణ జనాభా మార్పులు-కారణాలు-అంతర్లీన కారకాలపై పోర్టల్‌ ద్వారా అభిప్రాయ వెల్లడి దిశగా కేంద్ర మంత్రిత్వ శాఖలు-విభాగాలు.. రాష్ట్ర-కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు.. ‘ఎన్‌జీవో’లు-వ్యక్తులకు వెసులుబాటు

జనాభా మార్పు కారకాల విశ్లేషణ-గుర్తింపు ప్రక్రియలో ఈ సమాచారం కమిటీకి ఎంతో ఉపయుక్తం

తద్వారా చట్టబద్ధంగా.. నిష్పక్షపాతంగా.. నిర్దిష్ట్య వ్యవధిలో అక్రమ వలసదారుల గుర్తింపు.. నిర్బంధం.. బహిష్కరణకు సుస్థిర-శాశ్వత కార్యాచరణ వ్యవస్థపై సిఫారసులో కమిటీకి వెసులుబాటు

నాడు పోస్టు చేయడమైనది: 14 OCT 2026 5:54PM by PIB Hyderabad

   జనాభా మార్పులపై ఉన్నత స్థాయి కమిటీ (హెచ్‌ఎల్‌సీడీసీ) ఛైర్మన్, (రిటైర్డ్‌) జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్‌ న్యూఢిల్లీలో ఈ రోజు ప్రత్యేక డిజిటల్ వెబ్ పోర్టల్‌ https://demography.mha.gov.inను ప్రారంభించారు. దీంతో నేటినుంచే ఇది ప్రజలకు అందుబాటులోకి రావడమే కాకుండా భాగస్వాముల ద్వారా సమాచార  సమర్పణకు, ఆదానప్రదానానికి సిద్ధమైంది.

అసాధారణ జనాభా మార్పులు-కారణాలు-అంతర్లీన కారకాలపై పోర్టల్‌ ద్వారా అభిప్రాయాలు-సమాచారం వెల్లడి, అసహజ మార్పుల నివేదన దిశగా కేంద్ర మంత్రిత్వ శాఖలు-విభాగాలు, రాష్ట్ర-కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులకు వెసులుబాటు ఉంటుంది. జనాభా మార్పుల కారణాలు, కారకాలను విశ్లేషించి,  గుర్తించడానికి ఈ సమాచారం తోడ్పడుతుంది. దీంతోపాటు దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారులను చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా, నిర్దిష్ట వ్యవధిలో గుర్తించే అవకాశం ఉంటుంది. తద్వారా వారి నిర్బంధం లేదా బహిష్కరణ నిమిత్తం ఒక సుస్థిర, శాశ్వత కార్యాచరణ వ్యవస్థను సిఫారసు చేయడంలో కమిటీకి సహాయపడుతుంది.

కేంద్ర హోం మంత్రిత్వశాఖ 2026 మే 26న ఈ అధికారిక కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీకి నిర్దేశించిన విధివిధానాలు ఇలా ఉన్నాయి:

      I.     అక్రమ వలసలు సహా జనాభా మార్పుల వల్ల తలెత్తే సవాళ్లపై విస్తృత పరిశీలన.

    II.     సంతానోత్పత్తిలో వైవిధ్యాలు, (అక్రమ వలస సహా) సరిహద్దుల గుండా రాకపోకలు, ఆర్థిక అవకాశాలు, ఇతర సామాజిక-పర్యావరణ కారకాల వంటి జనాభా మార్పులకు సంభావ్య కారణాల అధ్యయనం.

   III.     అక్రమ వలసలు, అసాధారణ నివాస నమూనాలు, ప్రణాళికబద్ధ వలస సహా ఈ మార్పుల వెనుక అంతర్లీన కారకాల గుర్తింపు.

  IV.     మత లేదా సామాజిక వర్గాల స్థాయిన జనాభాలో స్వరూపాత్మక మార్పులను... ముఖ్యంగా ఏకరీతి ధోరణుల నుంచి విభిన్నంగా ఉన్నవాటిపై విశ్లేషణ.

    V.     దేశంలో ఇప్పటికే గల అక్రమ వలసదారులను చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా, నిర్దిష్ట వ్యవధిలో గుర్తించడమే కాకుండా నిర్బంధం లేదా బహిష్కరణకు ఒక సుస్థిర, శాశ్వత కార్యాచరణ వ్యవస్థ ఏర్పాటుకు సిఫారసు.

  VI.     సరిహద్దుల నిర్వహణ, జనాభా స్థిరీకరణ, మరియు గుర్తింపు వ్యవస్థలను బలోపేతం చేయడానికి, అలాగే అటువంటి ధోరణులను నిరంతరం పర్యవేక్షించడానికి ఒక తగిన సంస్థాగత యంత్రాంగాన్ని సిఫార్సు చేయడం.

 VII.     అక్రమ వలస.. తత్ఫలితంగా జనాభా అసమతౌల్యం సంబంధిత అంశాల్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పెంపు నిమిత్తం సమగ్ర విధాన చట్రం  ప్రతిపాదన.

VIII.     అక్రమ వలసలు సహా జనాభా మార్పుల వల్ల తలెత్తే సవాళ్ల పరిష్కారం కోసం తగినవిగా భావించే ఇతరత్రా చర్యలపై సిఫారసు.

***


(రిలీజ్ ఐడి: 2323595) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Kannada , Malayalam