నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఆశావహుల అభ్యర్థన మేరకు ఇండియా స్కిల్స్ 2026-27 రిజిస్ట్రేషన్ గడువు అక్టోబర్ 19 వరకు పొడిగింపు
షాంఘై వరల్డ్ స్కిల్స్ 2026 పోటీల్లో టాప్-10లో నిలిచిన భారత్… ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో మన జట్టు సభ్యుల సమావేశంపై నెలకొన్న ఆసక్తి
నాడు పోస్టు చేయడమైనది:
13 OCT 2026 5:27PM by PIB Hyderabad
సంస్థల నుంచి, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి వచ్చిన అనేక అభ్యర్థనల దృష్ట్యా ఇండియా స్కిల్స్ పోటీ 2026-27 రిజిస్ట్రేషన్ గడువును కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ (ఎంఎస్డీఈ) అక్టోబర్ 19, 2026 వరకు పొడిగించింది. షాంఘైలో జరిగిన వరల్డ్ స్కిల్స్ పోటీల్లో టీమిండియా అద్భుతమైన ప్రతిభను కనబరిచి, ఆరు రజత పతకాలు, 20 ఎక్సలెన్స్ పతకాలను గెలుచుకుని ప్రపంచవ్యాప్తంగా 10వ స్థానాన్ని దక్కించుకుంది. స్కిల్ పోటీలపై మళ్లీ ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఫలితం వచ్చింది.
దీన్ని మరింత బలోపేతం చేస్తూ... అక్టోబర్ 9, 2026న న్యూఢిల్లీలోని అధికారిక నివాసం 7-లోక్ కల్యాణ్ మార్గ్లో వరల్డ్ స్కిల్స్ షాంఘై-2026 పోటీల్లో పాల్గొన్న టీమిండియా సభ్యులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆతిథ్యమిచ్చి సత్కరించారు. భారతదేశ నైపుణ్య యువత సాధించిన విజయాలను అభినందించటమే కాక, దేశాభివృద్ధిలో వృత్తిపరమైన నైపుణ్యాల ప్రాముఖ్యతను ఈ సమావేశం స్పష్టం చేసింది. ఈ సమావేశం అనంతరం ఇండియా స్కిల్స్ 2026-27 రిజిస్ట్రేషన్లను మళ్లీ ప్రారంభించాలని విద్యాసంస్థలు, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి మంత్రిత్వశాఖకు అభ్యర్థనలు అందాయి. యువత నైపుణ్యాలను ప్రదర్శించేందుకు, జాతీయ స్థాయిలో పోటీ పడటానికి, ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం కల్పించేలా రిజిస్ట్రేషన్ గడువును అక్టోబర్ 19, 2026 వరకు పెంచారు.
జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీపడేందుకు, నైపుణ్యాలను ప్రదర్శించటానికి, యువతలో ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తూ... ఇండియా స్కిల్స్ 2026-27 కోసం ఇప్పటివరకు సుమారు 4.0 లక్షల రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఇంతకుముందు రిజిస్టర్ చేసుకోలేకపోయిన అర్హులైన అభ్యర్థులు ఇప్పుడు స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ (ఎస్ఐడీహెచ్) ద్వారా అక్టోబర్ 19, 2026లోపు దరఖాస్తులను పూర్తి చేసుకునే అవకాశం ఉంది.
ఎంఎస్డీఈ ఆధ్వర్యంలో జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్డీసీ) అమలు భాగస్వామిగా తయారీ, ఇంజనీరింగ్, నిర్మాణం, డిజిటల్ టెక్నాలజీలు, సృజనాత్మక పరిశ్రమలు, సేవా రంగాలకు సంబంధించి మొత్తం 63 పరిశ్రమ-ఆధారిత నైపుణ్య విభాగాలను ఇండియా స్కిల్స్ 2026-27 కవర్ చేస్తుంది.
జిల్లా, జోనల్, రాష్ట్ర, ప్రాంతీయ, జాతీయ స్థాయిల ద్వారా సుస్థిర మార్గాన్ని ఈ పోటీ అందిస్తుంది. దీనిద్వారా ప్రతిభావంతులైన యువత నైపుణ్యాలను ప్రదర్శించేందుకు, నిపుణుల సలహాలు పొందటానికి, అంతర్జాతీయ నైపుణ్య పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాల వైపు అడుగులు వేసేందుకు వీలవుతుంది.
పునః ప్రారంభించిన దరఖాస్తు గడువుకు సంబంధించిన సమాచారాన్ని ప్రచారం చేయాలని, రిజిస్ట్రేషన్లను సులభతరం చేయాలని… రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా వ్యవస్థలు, పారిశ్రామిక శిక్షణ సంస్థలు, పాలిటెక్నిక్స్, కళాశాలలు, నైపుణ్య శిక్షణ సంస్థలు, పరిశ్రమల భాగస్వాములను మంత్రిత్వశాఖ కోరింది. భాగస్వామ్యాన్ని విస్తృతం చేయటం, మరింత మంది ఆశావహ నైపుణ్య ఛాంపియన్లను పోటీలోకి తీసుకురావటమే దీని ఉద్దేశం.
షాంఘైలో జరిగిన వరల్డ్ స్కిల్స్- 2026 పోటీల్లో టీమిండియా 10వ స్థానాన్ని సాధించింది. ఈ పోటీల్లో ఆరు రజత పతకాలు, 20 ఎక్సలెన్స్ పతకాలను గెలుచుకుంది. ఈ పోటీల్లో భారత్ నుంచి అత్యధికంగా 70 మంది పోటీదారులు, మొత్తం 63 నైపుణ్య విభాగాల్లో ప్రతిభను చాటారు. గతంలో 2024లో ఫ్రాన్స్లోని లియానా వేదికగా జరిగిన వరల్డ్ స్కిల్స్ పోటీల్లో భారత్ 13వ స్థానంలో ఉండగా… ఈసారి మెరుగైన ప్రదర్శనతో 10వ స్థానంలో నిలిచింది. వీరి అద్భుతమైన ప్రదర్శన... నైపుణ్యాలు, ప్రత్యేక శిక్షణ, నిరంతర సన్నద్ధత యువ భారతీయులకు అద్భుతమైన అవకాశాలను సృష్టిస్తుందనే అంశంపై దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది.
అక్టోబర్ 19, 2026న రిజిస్ట్రేషన్లు ముగుస్తాయి.
ఇక్కడ నమోదు చేసుకోండి: https://www.skillindiadigital.gov.in/india-skills-competition
***
(రిలీజ్ ఐడి: 2323261)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3