ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీలో జరిగిన బ్లూమ్‌బర్డ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
నాడు పోస్టు చేయడమైనది:
13 OCT 2026 11:08AM by PIB Hyderabad
నమస్కారం!
సుప్రసిద్ధులు, ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలు, నా స్నేహితులారా,
భారతదేశానికి మీ అందరినీ ఆత్మీయంగా స్వాగతిస్తున్నాను. తన ఆలోచనలను శ్రీ బ్లూమ్‌బర్గ్ కాసేపటి క్రితమే ఇక్కడ పంచుకున్నారు. తన 30 ఏళ్ల ప్రయాణం గురించి వివరిస్తూ.. నన్ను తన స్నేహితునిగా పేర్కొన్నారు. ఆయన నాకంటే వయసులో పెద్దవారు. వృత్తిపరంగా అత్యంత విజయవంతమైన వ్యక్తి. ఆయన అంకితభావంగల వ్యక్తి కూడా. భారత్ పట్ల ఆయనకున్న అభిమానాన్ని నేను చాలా దగ్గరగా చూశాను. అందువల్ల వ్యక్తిగతంగా నేను ఆయన్ను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. ఆరాధిస్తాను. ఈ రోజుకీ, భారత్ పట్ల ఆయనకున్న అభిమానం, ప్రపంచ వేదికలపై భారతదేశం పట్ల ఆయన వ్యక్తపరిచే భావాలు సానుకూల శక్తికి మూలంగా నిలుస్తున్నాయి. అందుకే మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఏడాది, ప్రపంచంలోనే అత్యంత సునిశితమైన మేధాశక్తిని ఈ వేదిక ఒక్క చోట చేరుస్తుంది. ఆర్థికం, సాంకేతికం, ఇంధనం, అంతర్జాతీయ వ్యవహారాలపై ఇక్కడ చర్చలు జరుగుతాయి. ఈ విడత కార్యక్రమాన్ని భారత్‌లో నిర్వహిస్తున్నారు. భారత్‌లో ఈ ఫోరం జరగడం ఇదే తొలిసారి. ఈ నిర్ణయం తీసుకున్న శ్రీ బ్లూమ్‌బర్గ్, ఆయన మొత్తం బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సరైన సమయంలో సరైన ప్రదేశాన్ని మీరు ఎంచుకున్నారు.
మిత్రులారా,
ప్రపంచవ్యాప్తంగా ఆవిర్భవిస్తున్న కొత్త శక్తులపై ఈ ఏడాది బ్లూమ్‌బర్గ్ ఎకనామిక్ ఫోరం దృష్టి సారిస్తోంది. ప్రతి యుగానికి తనకంటూ సొంత శక్తి వనరులు, శక్తికి సొంత నిర్వచనం ఉన్నాయి. కానీ 21వ శతాబ్దంలో, మరీ ముఖ్యంగా ఈ మూడో దశాబ్దంలో ఓ పెద్ద మార్పు రాబోతోంది. ప్రస్తుతం టెక్నాలజీయే శక్తి. డేటాయే శక్తి. జ్ఞానమే శక్తి, ఆవిష్కరణే శక్తి.
అయితే మిత్రులారా,
ఎవరి చేతుల్లో అధికారం ఉందనేది అసలు ప్రశ్న కాదు. ఆ అధికారాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అనేదే అసలు ప్రశ్న. కొంతమందిని మాత్రమే సాంకేతిక ముందుకు తీసుకెళుతుందా? లేదా లక్షలాది మందికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందా? కొంతమందికి మాత్రమే జ్ఞానం బలంగా మిగిలిపోనుందా? లేదా అందరి సామర్థ్యాలను మెరుగుపరుస్తుందా? వీటి నుంచే ఓ కొత్త ఆలోచన పుడుతుంది. ఆ ఆలోచనే: సాధికారత కల్పించే శక్తి. సాధికారత కల్పించే శక్తి. నియంత్రించే శక్తికి ఆవల సామర్థ్యాన్ని అందించే శక్తి ఉంటుంది. పోటీపడే శక్తికి ఆవల సహకరించే శక్తి ఉంటుంది. విజయం సాధించే శక్తికి ఆవల ఇతరుల విజయానికి తోడ్పడే శక్తి ఉంటుంది. కాబట్టి, ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిన దృక్పథం ఇదే... సాధికారత కల్పించే శక్తి.
మిత్రులారా,
భారత్‌కు ఈ ఆలోచన కొత్తేమీ కాదు. మా సంప్రదాయంలో ‘‘విద్యా వివాదాయ ధనమ్ మదాయ, శక్తిః పరేశం పరిపీడనాయ, ఖలస్య సాధోః విపరీతం ఏతత్, జ్ఞానాయ దానాయ చ రక్షణాయ’’ అని అంటాం. జ్ఞానం, సంపద లేదా అధికారం ఎవరి వద్ద ఉన్నప్పటికీ వారు దానిని ఎలా ఉపయోగిస్తారన్నదే ముఖ్యం. ఇదే ఈ శ్లోకం సారాంశం. మరో మాటలో చెప్పాలంటే అధికారానికి ఉన్న నిజమైన విలువ దాని అసలు ఉద్దేశంలోనే దాగి ఉంటుంది. ప్రస్తుత ప్రపంచంలో ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
మిత్రులారా,
సాధికారత కల్పించే ఈ మానవ స్ఫూర్తి కేవలం ఇతరులకు బోధించాల్సిన పాఠం మాత్రమే కాదు. ఇది వేల సంవత్సరాలుగా మన సంప్రదాయాలు మనకు నేర్పిన విషయం. భారతదేశంలో మా పరిపాలనలో, పని సంస్కృతిలో ఈ అంశాన్ని పొందుపరిచాం. అందుకే, భారత్‌కు చెందిన ఉదాహరణలతోనే నా ప్రసంగాన్ని కొనసాగిస్తాను.
మిత్రులారా,
భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని మీ అందరికీ తెలుసు. భారత్‌లో వందకు పైగా భాషలున్నాయి. దాదాపుగా ఎనభై వేల వరకు రిజిస్టర్ అయిన వార్తాపత్రికలు, పబ్లికేషన్లు ఉన్నాయి. వెయ్యికి పైగా శాటిలైట్ టీవీ ఛానళ్లు ఉన్నాయి. అది మాత్రమే కాదు.. ఈ సోషల్ మీడియా యుగంలో అయిదు వందల మిలియన్లకు పైగా యూట్యూబ్ వినియోగదారులు, అయిదు వందల మిలియన్లకు పైగా ఇన్‌స్టాగ్రాం వినియోగదారులు దేశంలో ఉన్నారు. మా దేశంలో ప్రజలు వివిధ అంశాలపై బహిరంగంగా చర్చిస్తారు. అనేక దృక్కోణాలను పౌరులు చర్చిస్తారు. ప్రస్తుత యుగంలో దీనిని సాధ్యం చేయడంలో డిజిటల్ శక్తి ముఖ్య భూమిక పోషించింది.
మిత్రులారా,
పన్నెండు, పదమూడేళ్ల క్రితం వరకు భారత్‌లో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులో ఉండటం అంటే అది అధికారానికి చిహ్నంగా ఉండేది. అది అందుబాటులో ఉన్నవారికి సమాచారం, విజ్ఞానం, అవకాశాలు దక్కేవి. 2014 తర్వాత భారత్‌లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, సేవ చేసే అవకాశం మాకు లభించినప్పుడు మొబైల్ డేటాను చౌకగా మార్చడంపై భారత్ విశేష దృష్టిని సారించింది. ఫలితంగా, ఓ చిన్న పట్టణంలో ఉన్న విద్యార్థి డిజిటల్ విద్యను పొందగలుగుతున్నాడు. ఓ గ్రామంలోని చిన్న దుకాణదారు కొత్త వినియోగదారులను చేరుకుంటున్నాడు. ఓ యువకుడు ఆన్‌లైన్ కోర్సులో చేరుతున్నాడు. మరో మాటగా చెప్పాలంటే, అనుసంధానం ప్రజల్ని మాత్రమే అనుసంధానించడానికి పరిమితం కాలేదు. అది అవకాశాలను కూడా అనుసంధానించింది. ఇదే సాధికారత కల్పించే శక్తి అంటే.
మిత్రులారా,
భారతదేశపు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ప్రత్యక్షంగా పరిశీలించమని విదేశాల నుంచి వచ్చిన అతిథులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మా దేశంలో, ఒక వీధి వ్యాపారి, ఒక పెద్ద కార్ల షోరూమ్ పూర్తిగా వేర్వేరు స్థాయుల్లో పనిచేయవచ్చు. కానీ రెండూ ఒకే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ఉపయోగిస్తాయి. ఇదే సమ్మిళిత సాంకేతిక పరిజ్ఞానానికి ఉన్న బలం.
మిత్రులారా,
భారతదేశానికి ఉన్న సామర్థ్యాలను మా సరిహద్దులకే పరిమితం చేసుకోవాలని మేం భావించడం లేదు. వాటిని మేము గ్లోబల్ సౌత్‌తో, మా భాగస్వామ్య దేశాలతో ఎల్లప్పుడూ పంచుకుంటాము. ఇతర దేశాలు తమ అవసరాలకు అనుగుణంగా డిజిటల్ వ్యవస్థలను అభివృద్ధి చేసుకోగలిగేలా డిజిటల్ మౌలిక వసతుల్లో మాకున్న అనుభవాన్ని వారితో మేం పంచుకుంటున్నాం. కొవిడ్ సమయంలో ఓపెన్ సోర్స్ అయిన కొవిన్ ప్లాట్‌ఫామ్‌ను కూడా అభివృద్ధి చేశాము. మరో విధంగా చెప్పాలంటే.. ఇతర దేశాలకు సైతం నూతన అవకాశాలను అందించేలా భారతదేశ సామర్థ్యాలను వినియోగించేందుకు మేం నిరంతరం ప్రయత్నిస్తున్నాం. మన బలం మానవాళికి సాధికారత కల్పించాలి.
మిత్రులారా,
ఆవిష్కరణల శక్తి కూడా అదే విధంగా పనిచేస్తుంది. ఒక ఆలోచనను ఉత్పత్తిగా మార్చడం, ఒక సమస్యను పరిష్కారంగా మార్చడం అనేది ఓ అద్భుతమైన సామర్థ్యం. అలాంటి అవకాశాలు సమాజంలోని ఎక్కువ మంది ప్రజలకు చేరినప్పుడు అధికార సమతౌల్యత పెరుగుతుంది. దాని ప్రభావం కూడా అనేక రెట్లు పెరుగుతుంది. ఈ మార్పునకు భారతదేశ అంకుర సంస్థల ప్రయాణం ఓ గొప్ప ఉదాహరణ. 2014కు ముందు భారతదేశంలో కొన్ని వందల సంఖ్యలో మాత్రమే అంకుర సంస్థలు ఉండేవి. ఇప్పుడు దేశంలో 250,000కు పైగా అంకుర సంస్థలున్నాయి. ఇందులో దాదాపు సగం వంతు చిన్న నగరాలు, పట్టణాలకు చెందిన అంకుర సంస్థలే ఉన్నాయి. నలభై అయిదు శాతానికి పైగా అంకురసంస్థల్లో కనీసం ఓ మహిళా డైరెక్టర్ లేదా భాగస్వామి ఉన్నారు. ఆవిష్కరణలకు అవకాశాలు ఎక్కువ మందికి చేరుతున్నాయి. కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తోంది. కొత్త పరిష్కారాలను కనుగొంటున్నారు.
మిత్రులారా,
పరిపాలనలో అధికార ప్రధానోద్దేశంపై దృష్టి సారించడం కూడా అంతే ముఖ్యం. ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. కానీ పౌరులను వ్యవస్థపై ఆధారపడేలా చేయడం దాని ఉద్దేశ్యం కాకూడదు. దానికి బదులుగా సమర్థులుగా, సాధికారత పొందినవారిగా ప్రజలను మార్చేలా చేయడం దాని లక్ష్యం కావాలి. ఈ మార్గంలోనే భారత్ ప్రయాణిస్తోంది. దీన్ని అనుసరించే గడచిన దశాబ్దంలో 250 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చింది. ఈ సంఖ్య ప్రపంచంలోని అనేక దేశాల జనాభా కంటే ఎక్కువ.
మిత్రులారా,
జేఏఎం త్రయం, ప్రత్యక్ష నగదు బదిలీ గురించి మీరు వినే ఉంటారు. సాంకేతితను ఉపయోగించుకొని మేం ఓ వ్యవస్థను రూపొందించాం. దీని ద్వారా ప్రభుత్వ సాయం ప్రజల బ్యాంకు ఖాతాలకే నేరుగా చేరుకుంటుంది. ఇది అవినీతిని తగ్గించింది. పౌరులకు సౌలభ్యాన్ని పెంచింది. ప్రభుత్వం, ప్రజల మధ్య ప్రత్యక్ష అనుసంధానాన్ని ఏర్పాటు చేసింది.
మిత్రులారా,
భారతదేశ ప్రపంచ సంబంధాల్లో సాధికారతను కల్పించే శక్తి అనే తత్వం స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాక్సిన్ తయారీ సామర్థ్యం కొవిడ్ మహమ్మారి సమయంలో అత్యంత ప్రధానమైన అంశం. ఈ సామర్థ్యం వల్ల కలిగే ప్రయోజనాలు కేవలం కొన్ని దేశాలకే పరిమితమవుతాయా? లేదా అలాంటి సౌకర్యాలు, సామర్థ్యాలు లేని దేశాలకు, ప్రజలకు కూడా వ్యాక్సిన్లు చేరుతాయా? అనే ప్రశ్నలు ఆ సమయంలో తలెత్తాయి. మానవాళికి సాధికారత కల్పించే మార్గాన్ని భారత్ ఎంచుకుంది. వందకు పైగా దేశాలకు మేం వ్యాక్సిన్లను సరఫరా చేశాం. మా ఉత్పాదక సామర్థ్యం ఇతర దేశాలకు తోడ్పాటుగా మారింది. మరో ఆసక్తికరమైన ఉదాహరణను మీకు చెబుతాను. కొన్ని నెలల క్రితం ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. ఆ సదస్సును శ్రీ బ్లూమ్‌బర్గ్ కొనియాడారు. ఆ కార్యక్రమంలో మానవాళి కోసం ఏఐ వినియోగం గురించి మాత్రమే కాకుండా, ఏఐ వల్ల జంతువులు ఎలా ప్రయోజనం పొందగలవనే దాని గురించి కూడా చర్చించాము. ఇక్కడ కూర్చున్న నందన్, ఇది ఎలా జరిగిందనే దాని గురించి తర్వాత మరింత సమాచారాన్ని తెలియజేస్తారు. భారతదేశం ఎంత సమర్థంగా, బలంగా తయారైతే... అది మానవాళికి, ప్రపంచానికి అంత ప్రయోజనకారిగా మారుతుంది.
మిత్రులారా,
అధికారం… కేవలం ముందుకు సాగే సామర్థ్యాన్ని ఇవ్వటమే కాక, ఇతరులను కూడా ముందుకు నడిపించేలా సాధికారత శక్తిని కల్పిస్తుంది. కేవలం పోటీ మాత్రమే కాదు... కరుణ కూడా అంతే ముఖ్యమని భారత్ నమ్ముతుంది. నూతన ఆవిష్కరణలు ఎంతో ముఖ్యం... వాటి ఫలితాలు కూడా అందరికీ విస్తృతంగా చేరాలి. జాతీయ బలం అవసరమే, అదే సమయంలో ప్రపంచ సవాళ్లకు కూడా మనం పరిష్కారాలను అందించాలి. వాతావరణ మార్పులు, నీటి యాజమాన్యం, ప్రజా ఆరోగ్యం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల బాధ్యతాయుతమైన వినియోగం వంటివి ప్రపంచానికి పరిష్కారాలను చూపే, నూతన అవకాశాలను సృష్టించే సామర్థ్యాలు అవసరం.
మిత్రులారా,
మీకు మరో ఉదాహరణ చెబుతాను. పారిస్ ఒప్పందం ప్రకారం... వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు భారత్ కీలక ప్రతిజ్ఞ చేసింది. 2030 నాటికి మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 40 శాతాన్ని శిలాజేతర ఇంధన వనరుల ద్వారా సాధించాలని 2015లో లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్యం చేరుకునేందుకు తొమ్మిదేళ్ల ముందుగానే అంటే 2021 నవంబర్‌లోనే భారత్ ఈ కీలకఘట్టాన్ని సాధించింది. ఈ ఘనత సాధించిన తొలి జీ20 దేశంగా భారత్ నిలిచింది. ఇది కేవలం వాగ్దానాన్ని నెరవేర్చటం మాత్రమే కాదు… మారుతున్న భారతదేశ ఇంధన ప్రయాణానికి నిదర్శనం.
మిత్రులారా,
2014లో భారతదేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం సుమారు 75 గిగావాట్లుగా ఉండేది. ఇప్పుడు సుమారు 300 గిగావాట్లకు చేరుకుంది. దాదాపు నాలుగు రెట్లు అదనపు సామర్థ్యాన్ని మనం జోడించాం.
మిత్రులారా,
భారత్‌లో ఇంధన రంగంలో జరుగుతున్న మార్పులు సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. నేడు మనం పీఎం సూర్య ఘర్, పీఎం-కుసుమ్ వంటి పథకాలను అమలు చేస్తున్నాం. ఒక పథకం గృహాలను సోలార్ పవర్‌తో అనుసంధానిస్తుండగా, మరొక పథకం రైతులు సౌర శక్తిని ఉత్పత్తి చేసేందుకు, దాని వినియోగం ద్వారా పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవటానికి వీలు కల్పిస్తోంది. ఈ రెండు పథకాల ద్వారా భారత్ 30 గిగావాట్లకుపైగా సోలార్ సామర్థ్యాన్ని సాధించింది. ఇవి ఏటా 30 మిలియన్ టన్నులకుపైగా కర్బన ఉద్గారాలను తగ్గిస్తాయని అంచనా. మరో మాటలో చెప్పాలంటే సౌరశక్తి... కేవలం ప్రకృతిని పరిరక్షించే సాధనంగానే కాక, ప్రజలను సాధికారత దిశగా నడిపించే సాధనంగా మారుతోంది.
మిత్రులారా,
ప్రపంచ దేశాల ఆధిపత్య పోరులో భిన్నమైన ఆలోచనా విధానంతో భారత్ ముందుకు సాగుతోంది. ఈ దశాబ్దమే దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది.
మిత్రులారా,
ఇరవై ఒకటో శతాబ్దపు ఈ దశాబ్దం మునుపెన్నడూ లేని ప్రపంచ సవాళ్లను తీసుకువచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే గత ఆరేళ్లలో ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వ్యాప్తిని చూశాం. తర్వాత వివిధ ప్రాంతాల్లో యుద్ధాలు మొదలయ్యాయి. వాణిజ్యం, కీలక ఖనిజాలు, ఇంధన సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. ఒక సంక్షోభం నుంచి బయటపడే మార్గాన్ని ప్రపంచం వెతుక్కుంటున్న సమయంలోనే మరొక సంక్షోభం తలెత్తుతోంది. ఒకప్పుడు ప్రపంచాన్ని అనుసంధానించిన అంశాలే ఇప్పుడు ఆయుధాలుగా మారుతున్నాయి. సరఫరా వ్యవస్థలు, ఇంధనం, ఖనిజాలు, చెల్లింపు వ్యవస్థలు, సాంకేతికత క్రమంగా ఒత్తిడికి, ఆధిపత్యానికి సాధనాలుగా మారుతున్నాయి. గత దశాబ్దాల్లో ప్రపంచీకరణ సృష్టించిన మార్గాలు చాలా సందర్భాల్లో అడ్డంకులుగా మారాయి. వీటన్నింటి మధ్య ప్రతి రంగం పనిచేసే విధానాన్ని కృత్రిమ మేధ మారుస్తోంది. ఈ సమయంలోనే అనేక దేశాలు వేగంగా పెరుగుతున్న వృద్ధ జనాభా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచం ఒక ప్రాథమిక ప్రశ్నను ఎదుర్కొంటోంది. అదే విశ్వాసం. కష్టకాలంలోనూ సరఫరాలు కొనసాగుతాయనే విశ్వాసం. ఇచ్చిన హామీలు నెరవేరుతాయనే విశ్వాసం. సంక్షోభ సమయాల్లో ఒక భాగస్వామ్య దేశం మీకు అండగా నిలబడుతుందనే విశ్వాసం. సరిగ్గా ఇక్కడే భారత్ భిన్నమైన దృక్పథంతో, భిన్నమైన ఆలోచనా విధానంతో మీ ముందు నిలబడింది.
మిత్రులారా,
ఇరవై ఒకటో శతాబ్దంలో భారతదేశ పురోగతి అందరితో ముందుకు సాగుతూ... అందరినీ ముందుకు తీసుకెళ్లే విజయగాథ. ప్రపంచానికి సరసమైన ధరల్లో మందులు అవసరమైనప్పుడు ప్రతి ఐదు జనరిక్ మందుల్లో ఒకటి భారతదేశం నుంచే వస్తోంది. డిజిటల్ గుర్తింపు, చెల్లింపుల కోసం పరిష్కారాలు కావాల్సినప్పుడు ప్రపంచం భారత్‌లో అభివృద్ధి చేసిన నమూనాల వైపే చూస్తోంది. ప్రపంచానికి నైపుణ్యం గల మానవ వనరులు అవసరమైనప్పుడు భారత యువత నైపుణ్యంపై విశ్వాసాన్ని ఉంచుతుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా కంపెనీలకు సేవలను అందిస్తున్న 2,000లకుపైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు నిలయంగా భారత్ ఉంది.
మిత్రులారా,
ప్రపంచానికి ఎప్పుడైతే స్థిరమైన ఆసరా అవసరమవుతుందో అప్పుడు భారత్ బాధ్యతతో ఆపన్నహస్తాన్ని అందిస్తుందని స్పష్టమవుతుంది. ఎవరికీ నష్టం కలిగించేలా మనం ఎదగట్లేదు. ప్రపంచంతో కలిసి, ప్రపంచం కోసమే ఎదుగుతాం.
మిత్రులారా,
భారత్ అందించిన సేవలకు ఎన్నడూ ప్రతిఫలం ఆశించలేదు. ప్రపంచానికి భారత్ సున్నాను ఇచ్చింది. ఈ ఆవిష్కరణ యావత్ మానవాళికి మేలు చేసిందని ప్రపంచం గర్వంగా చెబుతుంది. అయివప్పటికీ భారత్ ఎలాంటి రాయల్టీలను కోరుకోలేదు. నేటికీ భారత్ అదే స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. సమకాలీన ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు మనం అందిస్తున్న ఆలోచనలు కూడా ఈ దృక్పథాన్నే ప్రతిబింబిస్తాయి. చరిత్రలో ఎన్నో అంతర్జాతీయ సంస్థలు సొంత ప్రయోజనాల కోసమే ఏర్పాటయ్యాయి. కానీ భారతదేశం ఎలాంటి ప్రపంచ వేదికలను సృష్టించిందో ఒక్కసారి ఆలోచించండి. మనం స్థాపించిన సంస్థలను పరిశీలించి, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని వాటితో పోల్చి చూడండి. ప్రపంచానికి మనం అందించిందేమిటి? అంతర్జాతీయ సౌర కూటమి. మనం అందించినది ఏమిటి? విపత్తును తట్టుకోగల మౌలిక వసతుల కూటమి. మనం అందించినవి ఏమిటి? బిగ్ క్యాట్ అలయన్స్ , గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ , ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈసీ), మిషన్ లైఫ్, లైఫ్ స్టైల్ ఫర్ ఇన్విరాన్‌మెంట్. ఇవన్నీ అందరికీ ప్రయోజనం చేకూర్చే, సకల జీవరాశులకు తోడ్పడే అద్భుతమైన కార్యక్రమాలు.
మిత్రులారా,
భారత్ ముందుకు తీసుకువచ్చిన వినూత్న ఆలోచనలు మీకు తెలుసు. ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్ దార్శనికత. ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు విశ్వాసం. ఒక భూమి, ఒక ఆరోగ్యం దృక్పథం. మరో మాటలో చెప్పాలంటే, అనుసంధానానికి, అందరూ కలిసి ముందుకు సాగేందుకు భారత్ అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. అంతేకాదు ఇక్కడ అధికారాన్ని ఇతరులకు సాధికారత కల్పించేందుకు ఉపయోగిస్తారు.
మిత్రులారా,
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న సందర్భంగా విశ్వసనీయతకు, స్థిరత్వానికి భారత్ భరోసానిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంది. ఈ వృద్ధి బలమైన పునాదిపై ఆధారపడి ఉంది. పన్నెండు, పదమూడేళ్ల కిందట భారతదేశ ప్రస్తుత ఖాతా లోటు జీడీపీలో నాలుగు శాతానికి పైగా ఉండేది. గతేడాది సుమారు అర శాతానికి తగ్గి, 0.61 శాతానికి చేరుకుంది. నేడు మన విదేశీ మారకద్రవ్య నిల్వలు 700 బిలియన్ డాలర్లను దాటిపోయాయి. కొన్ని దశాబ్దాలతో పోల్చితే ఇప్పుడు మన బ్యాంకింగ్ వ్యవస్థ అత్యంత బలంగా ఉంది.
మిత్రులారా,
ఈ బలమే భారతదేశ రుణ విశ్వసనీయత రేటింగులు మెరుగయ్యేందుకు కారణమవుతోంది. మునుపెన్నడూ లేనంతగా నేడు భారతదేశ ఆత్మవిశ్వాసం ఉన్నత స్థాయికి చేరుకుంది. స్పష్టమైన విధానపరమైన దిశతో మేం సంస్కరణలను ముందుకు తీసుకువెళ్తున్నాం. జీఎస్టీ ద్వారా సంక్లిష్టమైన పన్ను వ్యవస్థను ఒకే జాతీయ మార్కెట్‌గా మార్చాం. దివాలా చట్టాన్ని తీసుకువచ్చాం. ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను ఇప్పుడు నాలుగు సులభమైన కార్మిక కోడ్లుగా చేశాం. వ్యాపారాలకు సంబంధించిన వందలాది చిన్న నేరాలను నేరరహితంగా మార్చాం. ఇక్కడితో మేం ఆగిపోలేదు. భారత్ సంస్కరణల ప్రయాణం అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. సంస్కరణలేవీ కూడా బలవంతంగా చేసినవి కావు… ఇది మా నిబద్ధత.
మిత్రులారా,
వేల ఏళ్ల కిందట మన వేదాలు ఒక మంత్రాన్ని చెప్పాయి: "సంగచ్చధ్వం సంవదధ్వం సం వో మనాంసి జానతామ్". ఈరోజు ఆ మంత్రాన్ని మళ్లీ స్మరించుకుందాం: మనం కలిసి నడుద్దాం. కలిసి మాట్లాడుకుందాం. ఒకరినొకరం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. నడిచినప్పుడు మన బలం పెరుగుతుంది. సంభాషణ ద్వారా అవగాహన ఏర్పడుతుంది. ఒకరినొకరం అర్థం చేసుకోవటం ద్వారా పెద్ద సవాళ్లను సంయుక్తంగా పరిష్కరించుకోగలం. ఇదే పవర్ టు ఎంపవర్ అసలు సారం. అంటే మన శక్తిని కేవలం సొంత అభివృద్ధికి మాత్రమే పరిమితం చేసుకోకుండా ఇతరులకు కూడా కొత్త అవకాశాలను కల్పించేందుకు ఉపయోగించటం. బ్లూమ్‌బెర్గ్ ఎకనామిక్ ఫోరమ్ ఈ వేదిక ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే ప్రధాన వేదికగా మారుతుందని నేను విశ్వాసిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.
గమనిక: ఇది ప్రధానమంత్రి ప్రసంగానికి స్వేచ్ఛానువాదం. అసలు ప్రసంగం హిందీలో ఇచ్చారు.
***
(రిలీజ్ ఐడి: 2322884)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6