సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి జ్ఞాపికల 8వ విడత ఈ - వేలంలో ఉత్తరాఖండ్‌ ఆధ్యాత్మిక వారసత్వానికి విశేష గుర్తింపు


*ఉత్తరాఖండ్‌లోని పవిత్ర క్షేత్రాలు, జానపద సంప్రదాయాలు, ప్రాంతీయ అస్తిత్వాన్ని ప్రతిబింబించే 27 జ్ఞాపికలు

నాడు పోస్టు చేయడమైనది: 13 OCT 2026 1:02PM by PIB Hyderabad

దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్‌ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవం ప్రధానమంత్రి జ్ఞాపికల ఈ - వేలం ఎనిమిదో విడతలో ప్రదర్శిస్తున్న 27 జ్ఞాపికల్లో ప్రతిబింబిస్తోంది. ప్రధానమంత్రికి లభించిన ఈ జ్ఞాపికల్లో ఫ్రేమ్‌ చేసిన కళాకృతులు, ఫొటో చిత్రాలు, ఆలయ నమూనాలు, ఇతర స్మారక వస్తువులు ఉన్నాయి. ఇవి విశ్వాసం, కళ, సాంస్కృతిక వారసత్వం మధ్య ఉన్న విడదీయలేని అనుబంధాన్ని చాటిచెబుతున్నాయి. ఈ వేలం ద్వారా లభించే ఆదాయాన్ని ‘నమామి గంగే’ కార్యక్రమానికి వినియోగిస్తారు.

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ప్రతిబింబించే నాలుగు ఆలయ నమూనాలు ఈ జ్ఞాపికల్లో ఉన్నాయి. వీటిలో శ్రీ కేదార్‌నాథ్‌ ధామ్‌కు చెందిన రెండు నమూనాలు, ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్‌ ఆలయ నమూనా, ముఖ్బాలోని గంగా జీ మందిరానికి చెందిన చెక్క నమూనా ఉన్నాయి. ఈ నమూనాలన్నీ రాష్ట్ర సాంస్కృతిక జీవితంలో తీర్థయాత్రలకు, భక్తి భావానికి ఉన్న ప్రాధాన్యాన్ని చాటిచెబుతున్నాయి. 

 

 

 

 

చార్‌ధామ్‌ పుణ్యక్షేత్రాలు - బదరీనాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి - లను ఒకే చిత్రంలో చూపించే ఫొటో ప్రింట్‌ ఈ జ్ఞాపికల్లో ఉంది. హరిద్వార్‌లోని మానసాదేవి ఆలయ చిత్రం ఫ్రేమ్‌ తో పాటు ఆదికైలాస పర్వత దృశ్యం, మహాసు దేవత ఆలయ చిత్రణ, కార్తిక్‌ స్వామి ఆలయాన్ని ప్రతిబింబించే ఎల్ఈడీ దీపాలతో కూడిన గాజు జ్ఞాపిక కూడా ఈ సేకరణలో చోటు చేసుకున్నాయి. నారాయణ ఆశ్రమం, కుమావోన్‌ హిమాలయాల దృశ్యాలను చూపించే మరో ఫొటో ప్రింట్‌ ఈ ప్రాంత ఆధ్యాత్మిక ప్రత్యేకతను తీర్చిదిద్దే పర్వత ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరిస్తోంది.

ఉత్తరాఖండ్‌ జానపద కళల్లోనూ భక్తి భావం ప్రతిబింబిస్తుంది. గోడ గడియారంపైనా, దుర్గాదేవిని చిత్రించిన కళాకృతిలోనూ ఐపన్‌ చిత్రకళ కనిపిస్తుంది. స్థానిక కళా సంప్రదాయాల్లో మతపరమైన చిత్రాలకు ఉన్న ప్రాధాన్యాన్ని ఈ కళాకృతులు చాటిచెబుతున్నాయి. ఉత్తరాఖండ్‌ ప్రాంతీయ గుర్తింపును ప్రతిబింబించే ఏడు సంప్రదాయ పహాడీ టోపీలు కూడా ఈ జ్ఞాపికల సేకరణలో ఉన్నాయి. 

 

 

ఈ జ్ఞాపికలలో ఉత్తరాఖండ్‌కు చెందిన లక్ష్య సేన్‌ సంతకం చేసిన బ్యాడ్మింటన్‌ రాకెట్‌ కూడా ఉంది. రాష్ట్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే జ్ఞాపికల మధ్య ఈ రాకెట్‌ క్రీడారంగంలో సాధించిన విజయాలకు ప్రతీకగా నిలుస్తోంది.

ముఖ్బాలోని గంగా జీ మందిరం నమూనా, ఈ వారసత్వాన్ని ప్రధానమంత్రి జ్ఞాపికల కార్యక్రమం లక్ష్యంతో అనుసంధానిస్తోంది. ఉత్తరాఖండ్‌ ఆధ్యాత్మిక జీవితంలో గంగానదికి ఉన్న ప్రాధాన్యాన్ని ఈ నమూనా ప్రతిబింబిస్తోంది. కాగా, ప్రధానమంత్రి జ్ఞాపికల ఈ -  వేలం ద్వారా లభించే ఆదాయాన్ని ‘నమామి గంగే’ కార్యక్రమం ద్వారా గంగానది పునరుజ్జీవనానికి, పరిరక్షణకు వినియోగిస్తారు.

ప్రధానమంత్రి జ్ఞాపికల ఈ - వేలం ఎనిమిదో విడత ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ వేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఆసక్తి ఉన్నవారు అధికారిక పీఎం మెమెంటోస్‌ ఈ - వేలం పోర్టల్‌  https://pmmementos.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో తమ బిడ్లను దాఖలు చేయవచ్చు. 

****


(రిలీజ్ ఐడి: 2322881) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , Punjabi , English , Urdu , Gujarati