ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్‌సీజీజీ ముస్సోరీలో భాషిణి: భౌగోళిక సరిహద్దులను దాటి విస్తరిస్తోన్న వాయిస్-ఫస్ట్ బహుభాషా ఏఐ

బహుభాషా భాగస్వామ్యం సులభతరం చేస్తోన్న శ్రుత్‌లేఖ్, భాషిణి మొబైల్ యాప్

కార్యక్రమం మొత్తం పొడవునా సమాచార మార్పిడికి ఉపయోగపడనున్న 'శ్రుత్‌లేఖ్'

నాడు పోస్టు చేయడమైనది: 13 OCT 2026 11:08AM by PIB Hyderabad

ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మైటీ) పరిధిలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ) కింద పనిచేస్తున్న 'డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్' (డీఐబీడీ).. 2026 అక్టోబర్ 12 నుంచి 23 వరకు ముస్సోరీలో నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సీజీజీ) నిర్వహిస్తున్న "పట్టణ సేవలను అందించటంలో వివిధ దేశాల పౌర సేవా అధికారులకు సామర్థ్య పెంపు కార్యక్రమం"లో రియల్-టైమ్ బహుభాషా సమాచార మార్పిడి సేవలను అందించింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) నిధులతో భారతీయ సాంకేతిక, ఆర్థిక సహకార (ఐటీఈసీ) కార్యక్రమం ద్వారా భారత అంతర్జాతీయ సామర్థ్య నిర్మాణ ప్రయత్నాలలో భాగంగా డీఏఆర్‌పీజీ (అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ డిపార్ట్‌మెంట్) పరిధిలోని ఎన్‌సీజీజీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో పెరూ, కంబోడియా, నైజీరియా, కెన్యా, పాలస్తీనా, లెబనాన్, ద గాంబియా, ఈక్వెడార్, స్పెయిన్ తదితర దేశాలకు చెందిన పౌర సేవా అధికారులు, ప్రభుత్వ రంగ ప్రతినిధులు పాల్గొంటున్నారు. పరిపాలన, పట్టణ సేవలను అందించటంలో అంతర్జాతీయ అనుభవాలు, ఉత్తమ విధానాల మార్పిడికి ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తుంది.

ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఇంగ్లీష్, స్పానిష్ భాషల మధ్య రియల్ టైం అనువాదాన్ని భాషిణికి చెందిన 'శ్రుత్‌లేఖ్' ప్లాట్‌ఫామ్ అందించింది. ఈ ప్లాట్‌ఫా‌మ్ ఇంగ్లీష్ నుంచి స్పానిష్, స్పానిష్ నుంచి ఇంగ్లీష్ అనువాదం చేసింది. భాషా అడ్డంకులను అధిగమించి అంతర్జాతీయ ప్రతినిధులు ఒకరితో ఒకరు సమర్థవంతంగా సంభాషించడానికి, ఉత్సాహంగా పాల్గొనడానికి ఇది ఎంతగానో తోడ్పడింది.

ఈ వినియోగం.. భాషిణి 'వాయిస్-ఫస్ట్ బహుభాషా ఏఐ' విధానాన్ని తెలియజేస్తోంది. ఇది వాయిస్ ఆధారిత బహుభాషా సాంకేతికత ద్వారా సమాచార మార్పిడిని, డిజిటల్ సేవలను మరింత సులభతరం చేయడానికి కృషి చేస్తుంది. కార్యక్రమంలో పాల్గొనేవారు వివిధ భాషల్లో పరస్పరం మాట్లాడుకునేలా చేయడం ద్వారా ఏఐ ఆధారిత భాషా పరిష్కారాలు అంతర్జాతీయ సహకారానికి, ప్రభుత్వ రంగ సామర్థ్య నిర్మాణానికి ఏ విధంగా దోహదపడతాయో భాషిణి నిరూపించింది.

 

   

శ్రుత్‌లేఖ్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే విధానంపై కార్యక్రమంలో పాల్గొన్నవారికి భాషిణి బృందం తగిన మార్గదర్శకత్వం అందించింది. అలాగే భాషిణి విభాగాలు, దాని బహుభాషా ఏఐ సామర్థ్యాలు.. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక రంగం, వ్యవసాయం, పౌర సేవలందింపు వంటి వివిధ రంగాల్లో దాని వినియోగ అవకాశాలను కూడా వివరించింది. దైనందిన సంభాషణలు, డిజిటల్ లావాదేవీలలో భాషా సరిహద్దు అడ్డంకులను అధిగమించడానికి 'భాషిణి మొబైల్ అప్లికేషన్', దాని ఫీచర్లను పరిశీలించాలని ఆయా ప్రతినిధులను ప్రోత్సహించారు.

2026 అక్టోబర్ 23న ఈ కార్యక్రమం ముగిసే వరకు కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా అన్ని వేళలా శ్రుత్‌లేఖ్ అందుబాటులో ఉంటుంది. వివిధ దేశాల మధ్య పరస్పర చర్యలను బలపరచడానికి, విజ్ఞాన మార్పిడిని సులభతరం చేయడానికి, అంతర్జాతీయ సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలలో మరింత సమ్మేళిత భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి 'వాయిస్-ఫస్ట్ బహుభాషా ఏఐ'కి ఉన్న సామర్థ్యాన్ని ఈ కార్యాచరణ స్పష్టంగా తెలియజేస్తుంది.

ఈ శ్రుత్‌లేఖ్ ద్వారా ఏఐ ఆధారిత భాషా సాంకేతికతలో భారత్ సాధించిన సామర్థ్యాలను, వివిధ ప్రభుత్వ రంగ వేదికలలో సులభతరమైన, బహుభాషా డిజిటల్ అనుభవాలను అందించడానికి గల అవకాశాలను 'భాషిణి' నిరంతరం ప్రదర్శిస్తోంది.

డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ (డీఐబీడీ):

కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (మైటీ) పరిధిలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ) కింద పనిచేస్తున్న 'డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్' (డీఐబీడీ), డేటాసెట్లు, ఏఐ నమూనాలు, ఏపీఐలు, బహుభాషా అప్లికేషన్ల ద్వారా భారతదేశ భాషా ఏఐ వ్యవస్థను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. భారతదేశపు ‘భాషా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’గా భాషిణి డిజిటల్ వేదికలు, సేవల్లో భాషా సాంకేతికతల అనుసంధానానికి మద్దతు ఇస్తుంది.

భాషిణి సామర్థ్యాలతో కూడిన భాషా సాంకేతికతలు 800కి పైగా ప్రభుత్వ వెబ్‌సైట్‌లతో సహా 2,353 ప్రభుత్వ డిజిటల్ వేదికలలో అనుసంధానమయ్యాయి. ఈ ప్లాట్‌ఫామ్ టెక్స్ట్ రూపంలో 36 భారతీయ భాషలకు..  వాయిస్ రూపంలో 23 భారతీయ భాషలకు, 35 అంతర్జాతీయ భాషలకు మద్దతు ఇస్తుంది. రోజువారీగా 2.4 కోట్లకు పైగా ఏఐ ఇన్‌ఫరెన్సెస్‌తో ఇప్పటివరకు మొత్తం 900 కోట్లకు పైగా ఏఐ ఇన్‌ఫరెన్సెస్‌ను నమోదు చేసిన ఈ ప్లాట్‌ఫామ్.. భాషా సాంకేతికత ద్వారా డిజిటల్ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు తోడ్పడింది.

***


(రిలీజ్ ఐడి: 2322838) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil