యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
అహ్మదాబాద్‌లో బ్రిక్స్ సంప్రదాయ, స్వదేశీ క్రీడల ప్రదర్శన-2026… క్రీడా వారసత్వానికి, సాంస్కృతిక వైవిధ్యానికి నిదర్శనం
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్రీడా మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడుల ద్వారా దేశ నిర్మాణంలో క్రీడలను కీలకంగా మారుస్తున్న భారత్: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ
సంప్రదాయ, స్వదేశీ క్రీడలకు సంబంధించి సమాచార నిధి, నిపుణుల మార్పిడి, నిర్దిష్ట కాలవ్యవధుల్లో ప్రదర్శనలు నిర్వహించాలని బ్రిక్స్ దేశాలకు డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ పిలుపు
యువజన వికాసం, సమగ్ర, సాంస్కృతిక అవగాహన, అంతర్జాతీయ సహకారానికి సంప్రదాయ క్రీడలు ఊతమిస్తాయన్న కేంద్ర క్రీడల శాఖ మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
12 OCT 2026 4:07PM by PIB Hyderabad
అహ్మదాబాద్ అక్టోబర్ 12, 2026: గుజరాత్‌లోని అహ్మదాబాద్ నారన్‌పురలోని వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అక్టోబర్ 12, 2026న బ్రిక్స్ సంప్రదాయ, స్వదేశీ క్రీడల ప్రదర్శన-2026ను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బ్రిక్స్ సభ్యదేశాల ప్రముఖులు, ప్రతినిధి బృందాలు, క్రీడాకారులు, నిపుణులు, సాంకేతికత నిపుణులు, భాగస్వామ్య సంస్థలు పాల్గొన్నాయి. బ్రిక్స్ దేశాల క్రీడా వారసత్వాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని, ప్రజల మధ్య స్నేహాన్ని తెలియజేసేలా ఈ కార్యక్రమం జరిగింది.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు భారత్ పెట్టుబడులు పెట్టటం ద్వారా దేశ నిర్మాణంలో క్రీడలను కీలకంగా మారుస్తున్నట్లు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.
గుజరాత్ డిప్యూటీ సీఎం శ్రీ హర్ష్ సంఘవి సమక్షంలో కేంద్రమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
బ్రిక్స్‌లోని పది సభ్య దేశాల ప్రతినిధులను, ఇతర సభా ప్రాంగణ సభ్యులను ఉద్దేశించి కేంద్ర క్రీడల మంత్రి ప్రసంగించారు. దేశాన్ని క్రీడా శక్తిగా తీర్చిదిద్దేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు.
"దేశ నిర్మాణంలో క్రీడలకు భారత్ కీలక స్థానాన్ని కల్పిస్తోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో క్రీడా మైదానం నుంచి పోడియం వరకు అవకాశాలను సృష్టిస్తూ భారతదేశ క్రీడా వ్యవస్థ సరికొత్తగా మారుతోంది" అని కేంద్రమంత్రి అన్నారు.
"ప్రాథమిక స్థాయిలో భాగస్వామ్యం, ప్రతిభను గుర్తించటం, శిక్షణ, క్రీడా విజ్ఞానం, మౌలిక వసతుల అభివృద్ధి, అథ్లెట్ల సంక్షేమం, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకునే 360 డిగ్రీల సమగ్ర విధానంతో భవిష్యత్ కోసం సుస్థిరమైన క్రీడా వ్యవస్థను భారత్ ఏర్పాటు చేస్తోంది" అని డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ అన్నారు.
"ఈ విప్లవాత్మక మార్పునకు మద్దతుగా ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా దాదాపు 3.76 బిలియన్ డాలర్లను మేం ఖర్చు చేశాం" అని కేంద్రమంత్రి తెలిపారు.
సంప్రదాయ, స్వదేశీ క్రీడలను పరిరక్షించేందుకు, ప్రోత్సహించేందుకు బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి డాక్టర్ మాండవీయ మూడు ఆచరణాత్మక అంశాలను ప్రతిపాదించారు.
"బ్రిక్స్ సంప్రదాయ, స్వదేశీ క్రీడలు కేవలం ఆటతీరును ప్రదర్శించేందుకు మాత్రమే కాక, ప్రతి ఆచారానికీ ఉండే ప్రత్యేక చరిత్ర, విలువలు, సాంస్కృతిక నేపథ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే వేదికను కల్పిస్తాయి. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మూడు ఆచరణాత్మక అంశాలను భారత్ ప్రతిపాదిస్తోంది" అని డాక్టర్ మాండవీయ అన్నారు.
"మొదటగా... బ్రిక్స్ సంప్రదాయ, స్వదేశీ క్రీడల్లో స్వచ్ఛందంగా పాల్గొనేలా దానికి సంబంధించిన సమాచార నిధి తయారీకి కృషి చేయాలి. అందులో క్రీడల చరిత్ర, సాంస్కృతిక ప్రాముఖ్యత, నిబంధనలు, క్రీడా సామగ్రి, మైదానానికి కావాల్సిన వివరాలను నమోదు చేయాలి" అని అన్నారు.
"రెండోది.... బ్రిక్స్ దేశాల మధ్య క్రీడాకారులు, శిక్షకులు, పరిశోధకులు, విద్యాసంస్థలు, సాంస్కృతిక నిపుణుల మధ్య అనుభవాలను మార్చుకునేలా మనం ప్రోత్సహించాలి" అని కేంద్ర క్రీడాశాఖ మంత్రి తెలిపారు.
"మూడోది... భవిష్యత్తులో జరిగే బ్రిక్స్ క్రీడా పోటీల్లో సంప్రదాయ, స్వదేశీ క్రీడల ప్రదర్శనలను ఎప్పటికప్పుడు నిర్వహించటంపై మనం దృష్టి సారించాలి" అని ఆయన అన్నారు.
ఫిట్ ఇండియా ఉద్యమం ద్వారా క్రీడలను జీవనశైలిగా మార్చే దిశగా భారత్ పయనిస్తున్న తీరుని డాక్టర్ మాండవీయ వివరించారు.
"ఫిట్ ఇండియా ఉద్యమం ద్వారా ఫిట్‌నెస్‌ను జీవన విధానంగా మేం ప్రోత్సహిస్తున్నాం" అని చెప్పారు.
" 'సండేస్ ఆన్ సైకిల్' కార్యక్రమం అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రతి ఆదివారం 3 లక్షలకు పైగా ప్రాంతాల్లో 50 లక్షల మందికి పైగా ప్రజలు సైక్లింగ్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 94 'సండేస్ ఆన్ సైకిల్' ఎడిషన్లను నిర్వహించాం" అని కేంద్రమంత్రి వెల్లడించారు.
వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 10 బ్రిక్స్ భాగస్వామ్య దేశాలు స్వదేశీ క్రీడా సంప్రదాయాలను ప్రదర్శించాయి.
-
బెలారస్: గోరోడ్కి
-
బొలీవియా: లుచా డి చోలిటాస్, టింకు, రాయులా, ట్రోంపో, కాచినస్, కరెరా డి సాకోస్
-
బ్రెజిల్: జరాబటానా (స్వదేశీ బ్లోపైప్), కొరిడా డి టోరాస్ (లాగ్ రేస్), బ్రెజిలియన్ పారా-జియు-జిట్సు, కపోయిరా
-
చైనా: వుషు, లయన్ డ్యాన్స్, హెల్త్ కిగాంగ్
-
భారతదేశం: మల్లఖాంబ్, యోగాసనం, కలరిపయట్టు
-
ఇరాన్: జోర్ఖానా, హఫ్త్ సాంగ్, ఘనీహ్
-
కజకిస్థాన్: అసిక్ అటూ, టోగిజ్కుమలక్, కజాక్ కురేసి
-
రష్యా: గోరోడ్కి, సాంబో
-
దక్షిణాఫ్రికా: కగాటి, ఇంటోంగా
-
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: అల్ తబ్బా
ప్రదర్శనలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రేక్షకులను భాగస్వాములను చేసే కార్యకలాపాలు కూడా జరిగాయి. పాల్గొన్న జట్లను కార్యక్రమం ముగింపులో సత్కరించారు.
సంప్రదాయ క్రీడల చరిత్రను, విలువలను, సాంస్కృతిక నేపథ్యాన్ని, ఆచరణను ప్రదర్శించేందుకు ఈ క్రీడలు బ్రిక్స్ దేశాలకు ఉమ్మడి వేదికను అందించాయి.
క్రీడలను ఆధునీకరిస్తూనే సంప్రదాయ క్రీడా పరిజ్ఞానాన్ని కాపాడుకోవటమే కాక, అందరికీ క్రీడల్లో భాగస్వామ్యాన్ని కల్పించటం, బ్రిక్స్ కూటమి దేశాల మధ్య స్నేహాన్ని, సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను ఈ కార్యక్రమం స్పష్టం చేసింది.
***
(రిలీజ్ ఐడి: 2322601)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10