పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మిడ్ కెరియర్ ట్రయినింగ్‌లో పాల్గొంటున్నవారితో కేంద్ర పర్యావరణ మంత్రి సమావేశం... పర్యావరణ సంరక్షణలో సాధించిన విజయాలు, ఎదురవుతున్న సవాళ్ల ప్రస్తావన


సాంప్రదాయిక నియంత్రణ బాధ్యతలకు మించి సుస్థిరాభివృద్ధి రంగ నేతలు, నూతన ఆవిష్కర్తలు, సూత్రధారులుగా ఎదగాలని

ఐఎఫ్ఎస్ అధికారులకు శ్రీ భూపేందర్ యాదవ్ సూచన

నాడు పోస్టు చేయడమైనది: 12 OCT 2026 11:29AM by PIB Hyderabad

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)లో మిడ్-కెరియర్ ట్రయినింగ్ మూడో దశ (19వ బ్యాచ్) లో పాలుపంచుకుంటున్న వారితో కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు (ఈఎఫ్‌సీసీ) శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ న్యూ ఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ నరేంద్ర భూషణ్, అడవుల డీజీ, మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ సంతోష్ తివారీ, మంత్రిత్వ శాఖలో వన్యప్రాణి విభాగ ఏడీజీ శ్రీ రమేశ్ పాండే, ఇందిరా గాంధీ జాతీయ అటవీ అకాడమీ (ఐజీఎన్ఎఫ్ఏ) డైరెక్టర్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ ఖజూరియాతో పాటు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 


వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఎఫ్ఎస్ అధికారులను ఉద్దేశించి శ్రీ యాదవ్ ప్రసంగిస్తూ భారతదేశ అడవులు, వన్యప్రాణులు, పర్యావరణ వారసత్వాన్ని కాపాడడంలో వారు అందిస్తున్న తోడ్పాటును ప్రశంసించారు. వన్యప్రాణి సంరక్షణలో భారత్ పురోగతి, అడవులు, మొక్కల ఆవరణ వృద్ధి, కర్బనం పాళ్ల ప్రభావాన్ని తగ్గించడం, అటవీప్రాంతాలు/చిత్తడి నేలల సంరక్షణ, ప్రాకృతిక భూభాగాల పునరుద్ధరణ రంగాల్లో భారత్ ముందడుగు వేస్తున్న తీరును మంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఆయన ‘ఏక్ పేడ్ మా కే నామ్’, ‘మిష్టీ’, ‘అరావళీ గ్రీన్ వాల్’, ‘నగర్ వన్ యోజన’ వంటి కార్యక్రమాలను పౌరుల భాగస్వామ్యంతో ఎలా ముందుకు తీసుకుపోతున్నదీ కూడా ప్రస్తావించారు. 2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్‌ను ఆవిష్కరించాలంటే ఆర్థికాభివృద్ధితో పర్యావరణ భద్రతను తప్పక సంధానించాలని స్పష్టం చేశారు. మానవులకు, వన్యజీవులకు మధ్య సంఘర్షణ, కార్చిచ్చులు, వాతావరణ మార్పు, అభివృద్ధి సాధన సంబంధిత కార్యక్రమాలకు, పర్యావరణ సంరక్షణకు మధ్య సమతౌల్యాన్ని సాధించడం వంటివి ఈ విషయంలో ప్రధాన సవాళ్లని, వాటిని పరిష్కరించడానికి శాస్త్రీయ పద్ధతులతో పాటు స్థానికుల భాగస్వామ్యం కూడా చాలా అవసరమని మంత్రి అన్నారు.
వివిధ రకాల వాతావరణానికి, పర్యావరణ వ్యవస్థకు, జీవ వైవిధ్యానికి భారత్ నిలయం కావడం దేశ సౌభాగ్యమని మంత్రి అన్నారు. అడవులు, వన్యజీవుల సంరక్షణకు ఐఎఫ్ఎస్ అధికారులు తమను తాము పరిస్థితులకు అనువుగా మలచుకోవడంతో పాటు, క్షేత్ర స్థాయిలో ప్రభావవంతమైన నాయకత్వ పాత్రను పోషించవలసి ఉంటుందని ఆయన అన్నారు. ఈ భూగ్రహంలో బయోరిసోర్సెస్ అత్యంత ప్రధానమైన, కీలకమైన వనరులుగా ఉన్నాయని ఆయన చెబుతూ, ఇందువల్ల క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టులను అమలు చేసే అనుభవంతో పాటు మంత్రిత్వశాఖ స్థాయిలో వివిధ రంగాల్లో సంబంధిత విధాన రూపకల్పన రీతుల అనుభవాన్ని అధికారులకు అందిస్తున్నారని మంత్రి వివరించారు. అధికారులు తమ తమ ప్రాంతాల్లో ఎదురయ్యే సవాళ్లకు ఆచరణీయ పరిష్కారాలను కనుగొనడానికి చొరవ తీసుకోవాలని వారిని మంత్రి ప్రోత్సహించారు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పోషించాల్సిన పాత్ర అంతకంతకూ మార్పులకు లోనవుతోందని మంత్రి శ్రీ యాదవ్ అన్నారు. అధికారులు సాంప్రదాయిక నియంత్రణ సంబంధిత విధుల పరిధికి మించి, సుస్థిరాభివృద్ధి సాధనకు సారథులుగా, నూతన ఆవిష్కర్తలుగా, సూత్రధారులుగా పరిణతిని సాధించాల్సి ఉందని ఆయన అన్నారు. జీఐఎస్, రిమోట్ సెన్సింగ్, కృత్రిమ మేధ వంటి వినూత్న సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిందిగా సూచించారు. సాంప్రదాయక జ్ఞానశక్తిని వినియోగించుకుంటూనే స్థానికుల సామర్థ్యాలను నిరంతర ప్రాతిపదికన పెంచుతూ, వారి భాగస్వామ్యాన్ని తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సంస్థలను బలోపేతం చేయాలని, సమర్థ నిర్ణయాలను తీసుకోవాలని, అటవీ నిర్వహణ సంబంధిత ప్రణాళికలను రూపొందించడానికి నవీన దృక్పథాన్ని అనుసరించాలని, భారత పర్యావరణ రంగ భవితను కాపాడటానికి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని అధికారులకు మంత్రి పిలుపునిచ్చారు.

 


ఎమ్‌సీటీ కార్యక్రమం-2026
ఏడు నుంచి తొమ్మిది సంవత్సరాల అనుభవాన్ని సంపాదించిన ఐఎఫ్ఎస్ అధికారులకు ఇందిరా గాంధీ జాతీయ అటవీ అకాడమి (ఐజీఎన్ఎఫ్ఏ) మిడ్-కెరియర్ ట్రయినింగ్ మూడో దశ (19వ బ్యాచ్) కార్యక్రమాన్ని ఈ నెల 12 నుంచి వచ్చే నెల 6 వరకు నిర్వహిస్తోంది.  ఈ కార్యక్రమంలో 18 కేడర్లకు చెందిన 68 మంది అధికారులు పాల్గొంటున్నారు. వారికి క్షేత్ర స్థాయి అనుభవంతో పాటు విధాన రూపకల్పనలో కూడా అనుభవం ఉన్నది. వృత్తికి సంబంధించినంత వరకు వన్యప్రాణి సంరక్షణ నిర్వహణ, వేర్వేరు వాతావరణాల్లో తట్టుకుని నిలిచేటట్లు అటవీప్రాంతాలను నిర్వహించడం, సహజ  స్థలాలను పునరుద్ధరించడం, భూభాగాల  పునరుద్ధరణలో, పర్యావరణ విధానాల అమలులో వారు పట్టు సంపాదించారు.
క్షేత్ర స్థాయిలో నాయకత్వ కౌశలం, విధానాలను సమర్థంగా అమలుపరచడం, వ్యూహాత్మక కార్యాచరణతో పాటు అడవుల నిర్వహణను బలోపేతం చేసే లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆధునిక పద్ధతులను, సమకాలీన పద్దతులను మిళితం చేశారు. ఈ కార్యక్రమంలో ‘సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలకు శిక్షణ మాడ్యూల్’ ద్వారా అధికారులకు ప్రముఖ కేంద్ర మంత్రిత్వ శాఖలతో పాటు సంస్థల పనితీరును వివరిస్తారు. దీంతో వివిధ రంగాల మధ్య పరస్పర సంబంధాలు, విధాన స్వరూపాలను (పాలసీ ఫ్రేంవర్క్‌స్) మెరుగైన రీతిలో అర్థం చేసుకోవడానికి అధికారులకు అవకాశం లభిస్తుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో ఇతివృత్త ప్రధాన పర్యటనలు కూడా ఉంటాయి. వీటిలో వన్యప్రాణుల నిర్వహణ, జీవవైవిధ్య పరిరక్షణ, పర్యావరణానుకూల పర్యటన, స్థానికుల భాగస్వామ్యం ముడిపడివుండేలా అటవీ ప్రాంతాల నిర్వహణలో అత్యుత్తమ పద్ధతులను అధికారులు గమనించే వీలు చిక్కుతుంది.
సారథ్యం, నిర్ణయాలు తీసుకొనే సత్తా, మానవ వనరుల నిర్వహణతో పాటు ఆర్థిక నిర్వహణ, అటవీ వనరుల నిర్వహణ, సంప్రదింపులు, వివాదాల పరిష్కారం, కమ్యూనికేషన్, నైతిక నాయకత్వం వంటి అంశాలపై నిర్వహణ మాడ్యూలులో ప్రత్యేకంగా దృష్టి పెడతారు. చివరగా, పర్యావరణ సంబంధిత ఒప్పందాలు, అడవుల నిర్వహణలో కృత్రిమ మేధ, డిజిటల్ పరివర్తన, జాతీయ వన్యప్రాణి క్షేత్రాల  నాయకత్వం, జీవవైవిధ్య నిర్వహణ, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ (ఎఫ్ఆర్ఏ)తో ముడిపడిన అంశాలు,  వాటర్‌షెడ్ నిర్వహణ, అడవుల సంరక్షణ చట్టం (ఎఫ్‌సీఏ)లో ఇటీవల చేసిన సవరణలు,  మానవులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణ సహా సరికొత్త అంశాలను కూడా ‘అటవీ మాడ్యూలు’ పరిధిలో చేర్చి వాటిపై చర్చిస్తారు.

 

***

(రిలీజ్ ఐడి: 2322210) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati