బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విద్యుత్ ప్లాంట్ల వద్ద 18 ఎంటీలకు పైగా స్థిరంగా కొనసాగుతున్న బొగ్గు నిల్వలు

2026 అక్టోబరులో పెరిగిన సరఫరాలు: మందగించిన నిల్వల తరుగుదల

బొగ్గు సరఫరాను సులభతరం చేయడంలో భారతీయ రైల్వేలు అందిస్తున్న నిరంతర సహకారాన్ని, వృత్తిపరమైన నిబద్ధతను ప్రశంసించిన బొగ్గు మంత్రిత్వశాఖ

నాడు పోస్టు చేయడమైనది: 12 OCT 2026 10:00AM by PIB Hyderabad

దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల్లో 2026 సెప్టెంబర్ 29 నుంచి 18 మిలియన్ టన్నులకు (ఎంటీ) పైగా బొగ్గు నిల్వలు ఉన్నాయి. సెప్టెంబర్ 29 నాటికి నిల్వలు 18.932 ఎంటీ ఉండగా, 2026 అక్టోబర్ 10 నాటికి 18.205 ఎంటీలుగా ఉన్నాయి. విద్యుత్ కేంద్రాల్లో రోజువారీ వినియోగానికి అనుగుణంగా బొగ్గు సరఫరా ఉండటాన్ని ఈ స్థిరీకరణ ప్రతిబింబిస్తుంది. తగినంత సరఫరా, నిరంతరాయంగా విద్యుదుత్పత్తి కొనసాగేలా చేయడానికి నిల్వలు అత్యంత తక్కువగా ఉన్న కేంద్రాలకు సరఫరాను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే దుర్బలమైన కేంద్రాలకు అవసరాన్ని బట్టి బొగ్గును పునఃపంపిణీ చేస్తున్నారు.

2026 అక్టోబరులో రెండు తేదీల్లో స్టాకు వృద్ధి నమోదయింది:

 

  • 2026 అక్టోబర్ 2: 0.024 ఎంటీ
  • 2026 అక్టోబర్ 10: 0.017 ఎంటీ

 

సెప్టెంబరుతో పోలిస్తే.. అక్టోబరులో తరుగుదల వేగం గణనీయంగా మందగించింది:

 

  • 2026 సెప్టెంబరులో మొత్తంగా 7.28 ఎంటీలు అంటే సగటున రోజుకి 0.24 ఎంటీ చొప్పున  తరుగుదల నమోదయింది.
  • 2026 అక్టోబర్ తొలి పది రోజుల్లో స్టాకు తరుగుదల మొత్తం 0.56 ఎంటీలు మాత్రమే. అంటే సగటున రోజుకి 0.06 ఎంటీలుగా ఉంది.

 

ఈ మెరుగుదలకు అధిక ర్యాక్ లోడింగ్ కారణం. విద్యుత్ రంగం కోసం 2026 అక్టోబరులో (అక్టోబర్ 1 నుంచి 10 వరకు) రోజుకు సగటున 469 ర్యాకుల బొగ్గును లోడ్  చేశారు. ఇది 2026 సెప్టెంబర్లో రోజుకి 426 ర్యాకులు మాత్రమే ఉంది. ఇది సుమారు 10 శాతం  పెరుగుదలను సూచిస్తుంది. అక్టోబర్‌లో రోజువారీ ర్యాకు లోడింగ్ 447 నుంచి 482 ర్యాకుల మధ్య ఉంది.

ఫలితంగా 2026 సెప్టెంబరులో రోజుకి 2.21 ఎంటీలుగా మాత్రమే ఉన్న రోజువారీ బొగ్గు సరఫరా 2026 అక్టోబరులో 2.49 ఎంటీలుగా నమోదయింది. ఇది రోజుకు 2.37 ఎంటీలుగా నిర్దేశించిన సరఫరా లక్ష్యం కంటే అధికం. అక్టోబర్ తొలి పది రోజుల్లో తొమ్మిది రోజుల పాటు వాస్తవ బొగ్గు సరఫరా నిర్దేశిత ప్రణాళికను అధిగమించింది.

థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద తగినంత బొగ్గు నిల్వలు ఉండేలా, నిరంతరాయంగా బొగ్గు తరలింపు, సరఫరాను చేపట్టడానికి కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), ఎస్‌సీసీఎల్, రైల్వే మంత్రిత్వ శాఖ, విద్యుత్ సంస్థలతో మంత్రిత్వ శాఖ సమన్వయం చేస్తోంది. బొగ్గు రవాణాను సులభతరం చేయడంలో భారతీయ రైల్వే అందిస్తున్న నిరంతర సహకారాన్ని, వృత్తిపరమైన నిబద్ధతను బొగ్గు మంత్రిత్వ శాఖ గుర్తించి, అభినందిస్తోంది.

***


(రిలీజ్ ఐడి: 2322207) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Tamil