సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వికసిత భారత్ - 2047 దిశగా భారత్ ప్రయాణానికి యువత నాయకత్వం వహించాలి: డాక్టర్ ఎల్. మురుగన్

అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను అందిపుచ్చుకుని సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను అన్వేషించాలని యువతకు పిలుపు

నాడు పోస్టు చేయడమైనది: 08 OCT 2026 4:06PM by PIB Hyderabad

భారతీయ యువత తమ నైపుణ్యాలు, సృజనాత్మకత, ఆవిష్కరణ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుని వికసిత భారత్ - 2047 లక్ష్య సాధనకు తోడ్పడాలని కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ పిలుపునిచ్చారు. నోయిడాలోని ఓ సంస్థలో ఈ రోజు విద్యార్థులు, అభ్యాసకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, కొత్తగా అందుబాటులోకి వస్తున్న అవకాశాలకు భారత యువతను సన్నద్ధం చేయడంలో నాణ్యమైన విద్య, జీవితాంత అభ్యసనం, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల స్థాపనలో ఔత్సాహికులకు ప్రోత్సాహం కీలకమని శ్రీ మురుగన్ అన్నారు.

 

దేశ నిర్మాణంలో యువత కీలక పాత్రను ప్రస్తావిస్తూ, 2047 నాటికి వికసిత భారత్ సాధన దిశగా భారత్ ప్రయాణంలో యువశక్తిని కేంద్రబిందువుగా ఉంచాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను డాక్టర్ మురుగన్ పునరుద్ఘాటించారు. వికసిత భారత్ దీర్ఘకాల భ విష్యత్తుకు సంబంధించిన దార్శనికత కాదని, నేటి యువతే రూపుదిద్దే భవిష్యత్తు అని ఆయన అన్నారు. విద్యను నైపుణ్యాలు, సాంకేతికత, పరిశోధన, ఔత్సాహిక పారిశ్రామికత, ఉపాధితో అనుసంధానించే సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

 

 

మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యా సంస్కరణలు

 

విద్యను మరింత సరళంగా, బహుళ విభాగాలతో కూడినదిగా, నైపుణ్య ఆధారితంగా తీర్చిదిద్దడంలో జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 ప్రాధాన్యతను మంత్రి వివరించారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో అభ్యసనాన్ని జీవితాంతం కొనసాగించవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల వ్యక్తులు తమ వృత్తి జీవితంలోని వివిధ దశల్లో కొత్త నైపుణ్యాలు, అర్హతలను పొందేందుకు వీలు కలుగుతుందని అన్నారు.

ఆన్‌లైన్ విద్య ప్రాధాన్యతను వివరిస్తూ, వివిధ అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా అందరికీ అందుబాటులో ఉండే అభ్యసన అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఉందని డాక్టర్ మురుగన్ పిలుపునిచ్చారు. అందువల్ల అభ్యసకులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంతో పాటు, మారుతున్న వృత్తిపరమైన అవసరాలకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకునేందుకు అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు.

 

అందరికీ సమానంగా విజ్ఞానావకాశాలు 

 

నాణ్యమైన విద్యా పరిశోధనలను, ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న విజ్ఞాన వనరులను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేయడంలో ప్రభుత్వం చేపట్టిన వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ (ఓఎన్ఓఎస్) కార్యక్రమం ఒక కీలకమైన ముందడుగు అని డాక్టర్ మురుగన్ పేర్కొన్నారు. నాణ్యమైన విద్యా పరిశోధనల లభ్యత సంస్థల పరిమితులు లేదా భౌగోళిక సరిహద్దులకు లోబడి ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. “ప్రతిభ ప్రతిచోటా ఉంది.. అవకాశాలు కూడా ప్రతిచోటా ఉండాలి” అని ఆయన అన్నారు.

 

విద్య, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు

 

ఉపాధి అవకాశాల గురించి ప్రస్తావిస్తూ, ఉద్యోగాల కల్పనలో మౌలిక వసతుల అభివృద్ధి, తయారీ రంగం, సేవల రంగం, ఔత్సాహిక పారిశ్రామికత, నైపుణ్యాభివృద్ధి కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఆర్‌బీఐ - కేఎల్ఈఎంఎస్ గణాంకాలను ఉటంకిస్తూ, 2014 - 15 నుంచి 2023 - 24 మధ్యకాలంలో భారత్‌లో సుమారు 17.1 కోట్ల ఉద్యోగాలు అదనంగా లభించాయని ఆయన తెలిపారు.

 

డిగ్రీలకే పరిమితం కాకుండా, మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చేందుకు యువత ఆచరణాత్మక నైపుణ్యాలు, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టడంతో పాటు, ఇతరులకు ఉపాధి అవకాశాలను సృష్టించేలా తమ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన యువతను కోరారు.

 

 

అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ

 

సాంకేతికత, సృజనాత్మకత కలిసే రంగాల్లోని అవకాశాలను యువత అన్వేషించాలని డాక్టర్ మురుగన్ సూచించారు. ముఖ్యంగా కృత్రిమ మేధ, గేమింగ్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ, డిజిటల్ కంటెంట్ వంటి రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

 

భారత యువత కేవలం సాంకేతికత, డిజిటల్ కంటెంట్‌ను వినియోగించేవారిగా మాత్రమే కాకుండా, ప్రపంచానికి అవసరమైన సాంకేతికత, కంటెంట్‌ను సృష్టించేవారిగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. నిరంతర అభ్యసనం, ఆవిష్కరణల ప్రాధాన్యతను ప్రముఖంగా పేర్కొంటూ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ఆధారిత పరిశ్రమల్లో భాగస్వాములు కావడానికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులు అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

రాజ్యాంగ విలువలు, బాధ్యతాయుత పౌరసత్వం

 

విద్య, దేశ నిర్మాణంలో రాజ్యాంగ విలువల ప్రాధాన్యతను కూడా మంత్రి ప్రస్తావించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక విధులను ప్రస్తావిస్తూ, యువ పౌరులు శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని, ప్రతిభ సాధించాలనే నిబద్ధతను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.

 

భారతీయ యువత నిరంతరం నేర్చుకుంటూ, సృజనాత్మకతను కొనసాగిస్తూ, ఇతరులకు కూడా అవకాశాలను సృష్టించాలని డాక్టర్ మురుగన్ పిలుపునిచ్చారు. యువత నైపుణ్యాలను సంపాదించుకోవడం, ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టడం, మరింత సుసంపన్నమైన దేశ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించడంపైనే వికసిత భారత్ - 2047 దిశగా దేశ పురోగతి ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2320977) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Odia , Kannada , Malayalam