హోం మంత్రిత్వ శాఖ
'సేవ, సమర్పణ'లో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా తన పదవీకాలంలో ప్రధానమంత్రి శ్రీ మోదీ 'సేవ, సంఘర్షణ, సమర్పణ'ల ప్రస్థానం... పేదల సంక్షేమం, మహిళా సాధికారత, యువత అభ్యున్నతి, సమాజంలోని అన్ని వర్గాల శ్రేయస్సుల ప్రతిబింబం
ప్రజా సంక్షేమ విధానాలు, వాటి సమర్థ అమలు, నిర్ణయాత్మక నాయకత్వం, పారదర్శకత, ఫలితాల నిశ్చయత ద్వారా పరిపాలనను పునర్నిర్వచించి, 'పనితీరు ఆధారిత రాజకీయాల' ఆదర్శాన్ని నెలకొల్పిన శ్రీ మోదీ
గుజరాత్‌లో శ్రీ మోదీ సుపరిపాలన నమూనా... దేశం మొత్తానికి పునాదిగా నిలిచింది
ప్రధానమంత్రి శ్రీ మోదీ నాయకత్వంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను కొనసాగిస్తూనే... తయారీ, డిజిటల్ చెల్లింపులు, అంకురసంస్థలు, సెమీకండక్టర్లు, రక్షణ ఉత్పత్తి వంటి రంగాల్లో నూతన శిఖరాలను అధిరోహిస్తోన్న భారత్
సంఘర్షణలు, అస్థిరతలతో కూడిన ప్రస్తుత కాలంలో... శాంతి, సామరస్యం కోసం అంతర్జాతీయ వేదికపై అవిశ్రాంత కృషి చేస్తోన్న భారత్
పౌరుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ద్వారా... 'వికసిత్ భారత్' మంత్రంతో 2047 నాటికి అన్ని రంగాల్లోనూ దేశాన్ని అగ్రగామిగా నిలపాలనే సంకల్పాన్ని ప్రేరేపించిన శ్రీ మోదీ
నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2026 4:47PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'సేవ, సమర్పణ'లో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
‘ఎక్స్’ వేదికగా చేసిన వరుస పోస్టుల్లో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు... “అలుపెరుగని కృషి, అద్భుతమైన సంకల్పం, దేశానికి ప్రథమ ప్రాధాన్యం అనే మార్గదర్శక సూత్రంతో కూడిన 'సేవ, సమర్పణ'లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రఖ్యాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీకి హృదయపూర్వక అభినందనలు. సరిగ్గా ఇదే రోజున అంటే అక్టోబర్ 7, 2001న మోదీజీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన పదవీకాలంలో కొనసాగిన 'సేవ, సంఘర్షణ, సమర్పణ'ల నిరంతర ప్రయాణం... పేదల సంక్షేమం, మహిళా సాధికారత, యువత అభ్యున్నతి, సమాజంలోని ప్రతి వర్గం శ్రేయస్సులో ప్రతిబింబిస్తుంది. ఈ 25 ఏళ్ల పాలనలో మోదీజీ ప్రజా సంక్షేమ విధానాలు, వాటి సమర్థమైన అమలు, నిర్ణయాత్మక నాయకత్వం, పారదర్శకత, ఫలితాల నిశ్చయతతో కూడిన పరిపాలనను పునర్నిర్వచించారు. తద్వారా 'పనితీరు ఆధారిత రాజకీయాల' ఆదర్శాన్ని నెలకొల్పారు.”
శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు... "ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, భూకంపం వల్ల ధ్వంసమైన కచ్ ప్రాంతాన్ని మోదీజీ ఆదర్శవంతమైన ప్రాంతంగా పునర్నిర్మించారు. 'జ్యోతిగ్రామ్ యోజన' ద్వారా ప్రతి గ్రామానికి 24 గంటల విద్యుత్ అందేలా చేశారు. సౌరశక్తి, 'వైబ్రంట్ గుజరాత్' కార్యక్రమాల ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలకు కొత్త దిశానిర్దేశం చేశారు. 8 శాతానికి పైగా వ్యవసాయ వృద్ధి రేటును సాధించి, గుజరాత్‌లో సుపరిపాలన నమూనాను నెలకొల్పారు. ఇది తరువాతి కాలంలో దేశం మొత్తానికి పునాదిగా నిలిచింది. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఈ దార్శనికత మరింత విస్తరించింది. అంతరిక్షం నుంచి సముద్రాల వరకు... అంతర్జాతీయ వేదికల నుంచి అంతర్గత భద్రత వరకు... అనేక రంగాల్లో భారత్ కొత్త మైలురాళ్లను సాధించింది. ప్రజల జీవితాల్లోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. కోట్లాది కుటుంబాలకు శాశ్వత గృహవసతి, రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా రక్షణ, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీటి సౌకర్యం లభించాయి."
"నేడు మోదీజీ నాయకత్వంలో... తయారీ, డిజిటల్ చెల్లింపులు, అంకురసంస్థలు, సెమీకండక్టర్లు, రక్షణ ఉత్పత్తి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో కొత్త శిఖరాలను అధిరోహిస్తూ భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా దూసుకెళ్తోంది. యుద్ధం, అస్థిరతలు నెలకొన్న ఈ కాలంలో... శాంతి, సామరస్యాల కోసం భారత్ అంతర్జాతీయ వేదికపై అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. కోట్లాది పౌరుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం ద్వారా, 'వికసిత్ భారత్' మంత్రాన్ని మోదీజీ అందించారు. 2047 నాటికి దేశాన్ని ప్రతి రంగంలోనూ అగ్రగామిగా నిలపాలనే సంకల్పాన్ని పౌరుల్లో ప్రేరేపించారు. ఆయన నాయకత్వంలో మేమంతా ఈ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం మా అందరికీ గర్వకారణం, మా అదృష్టం" అని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2320442)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4