సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యక్ష ప్రదర్శనల రంగంలో ఏకగవాక్ష అనుమతులు-భావితరం సంస్కరణలపై ‘లైవ్ ఈవెంట్స్ డెవలప్‌మెంట్ సెల్’ 5వ సమీక్ష

ఏడాదిలోనే దేశీయ ప్రత్యక్ష ప్రదర్శనల రంగంలో 44 శాతం వృద్ధి.. కోటి మందికి పైగా కార్మికులకు జీవనోపాధి మద్దతు
కేంద్ర-రాష్ట్ర-పారిశ్రామిక రంగ సహకారంతో 2030 నాటికి ఈ రంగం పరిమాణం రెట్టింపు చేయడంపై ప్రభుత్వం లక్ష్యనిర్దేశం
‘ఇండియా సినీ హబ్’ పోర్టల్ ద్వారా లైవ్ ఈవెంట్ లైసెన్సింగ్‌ ప్రక్రియ పూర్తిస్థాయి నిర్వహణపై రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలకు సూచన
ఒకే జాతీయ సంగీత లైసెన్స్.. నోటిఫైడ్ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు.. లైవ్ ఈవెంట్ వేదికల మౌలిక సదుపాయాల స్థితిగతులపై చర్చ

నాడు పోస్టు చేయడమైనది: 07 OCT 2026 6:24PM by PIB Hyderabad

దేశీయ ప్రత్యక్ష ప్రదర్శనల రంగం ఏడాది వ్యవధిలో 44 శాతం వృద్ధి సాధించిందని సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ చెప్పారు. ఈ మేరకు న్యూఢిల్లీలో ఇవాళ ‘లైవ్ ఈవెంట్స్ డెవలప్‌మెంట్ సెల్’ (ఎల్‌ఈడీసీ) 5వ సమీక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఒక సంవత్సర కాలంలో సుమారు 34,000 ఈవెంట్లు నిర్వహించిన నేపథ్యంలో ఈ రంగం ద్వారా నేడు కోటి మందికి పైగా జీవనోపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ రంగం పరిమాణాన్ని 2030 నాటికి రెట్టింపు చేయడంపై ప్రభుత్వం దృఢ సంకల్పం పూనిందని తెలిపారు. తద్వారా 1.5 నుంచి 2 కోట్ల ప్రత్యక్ష-అనుబంధ ఉద్యోగాలను సృష్టింగల సామర్థ్యం ఈ రంగానికి ఉందన్నారు. కేంద్రం, రాష్ట్రాలు, పారిశ్రామిక రంగం మధ్య సమన్వయ సహిత సహకారానికి ‘ఎల్‌ఈడీసీ’ ఒక “తిరుగులేని రుజువు” అని ఆయన అభివర్ణించారు.

 

ఈ సెల్‌లో 14 కేంద్ర మంత్రిత్వశాఖలు-విభాగాలు, 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 21 పారిశ్రామిక సంస్థలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయని శ్రీ చంచల్‌ కుమార్‌ ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ సహకారంతో మోడల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ఇండియా సినీ హబ్‌పై సింగిల్ విండో పోర్టల్, సరళ అనుమతులు-నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు సహా కీలక సంస్కరణలు విజయవంతం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. నియమిత నోడల్ అధికారులుగల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 16 నుంచి 29కి పెరిగినట్లు ఉటంకించారు.

‘ఇండియా సినీ హబ్’ (ఐసీహెచ్‌) పోర్టల్‌ ద్వారా ప్రత్యక్ష ప్రదర్శనల రంగం కోసం ఏకగవాక్ష అనుమతుల పోర్టల్ ఏర్పాటుపై సమావేశం సమీక్షించింది. నోడల్ అధికారుల నియామకం, వివిధ శాఖల నుంచి అధీకృత అధికారులన పంపే ప్రతిపాదన, ఐసీహెచ్‌ పోర్టల్‌తో శాఖాపరమైన-స్థానిక లైసెన్సింగ్ వ్యవస్థల అనుసంధానం, పోర్టల్‌ ద్వారా పూర్తి లైసెన్స్ ప్రక్రియ నిర్వహణ, లైవ్ ఈవెంట్ వేదికల భాగస్వామ్యం, ప్రత్యక్ష ప్రదర్శనల లైసెన్స్‌ ప్రక్రియను కాలపరిమితి సహిత ప్రజా సేవగా ప్రకటించడం తదితరాల అమలుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమావేశం సూచించింది.

 

“దేశంలో ప్రత్యక్ష ప్రదర్శనలకు లైసెన్సింగ్, అనుమతుల క్రమబద్ధీకరణ దిశగా నమూనా కార్యనిర్వాహక ఉత్తర్వు-2026”ను మార్చి 13న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపడాన్ని సమావేశం గుర్తుచేసింది. దీన్ని ఇప్పటిదాకా 5 రాష్ట్రాలు ఆమోదించగా, ‘ఎల్‌ఈడీసీ’ సభ్య రాష్ట్రమైన మహారాష్ట్ర ఈ నమూనా కార్యనిర్వాహక ఉత్తర్వును ఆమోదించి, దాని అమలుపై ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా దీన్ని వేగంగా అమలు చేయాలని కోరారు. విదేశీ ప్రదర్శనకారుల స్వల్పకాలిక బస కోసం ‘ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ’ పునఃనమోదు నిబంధనలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ సరళీకరించిందని ప్రకటించింది.

 

తదనుగుణంగా సంబంధిత మంత్రిత్వశాఖల ద్వారా కళాకారులకు, సిబ్బందికి గ్రూప్ వీసా నిబంధనలు, ప్రదర్శన పరికరాలపై కస్టమ్స్ సుంకం మినహాయింపు సహా రంగాలవారీ సౌకర్యాలను ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర మంత్రిత్వశాఖలను కోరినట్లు సమావేశం పేర్కొంది. నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన మంత్రిత్వశాఖ ద్వారా ప్రత్యక్ష వినోద నైపుణ్యాలను జాతీయ నైపుణ్యాల అర్హత ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌)లో ఏకీకృతం చేయడం, శిక్షణ-ధ్రువీకరణ కేంద్రాలు, అప్రెంటిస్‌షిప్ కార్యక్రమాల ఏర్పాటు, పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా ఈవెంట్ ఆధారిత పర్యాటకానికి భారత్‌ను ప్రపంచ కూడలిగా ప్రోత్సహించడం సహా సంబంధిత మంత్రిత్వశాఖల ద్వారా జీఎస్టీ హేతుబద్ధీకరణ, సీఎస్ఆర్ అనుసంధానం, వీజీఎఫ్-బ్లెండెడ్ ఫైనాన్స్ ద్వారా మౌలిక సదుపాయాలకు ఆర్థిక సహాయం, ‘ఎంఎస్ఎంఈ’ కింద ప్రత్యక్ష వినోద రంగానికి గుర్తింపు సహా ఆర్థిక ప్రోత్సాహకాలను అందించడం వంటివి ఇందులో ఉన్నాయి.

 

మరోవైపు బహుళ హక్కుల సంఘాల నుంచి వినిపించే పునరావృతమవుతున్న డిమాండ్ల స్థానంలో నోటిఫైడ్ టారిఫ్‌ సహిత ఒకే జాతీయ సంగీత లైసెన్సు, శబ్ద కాలుష్య (నియంత్రణ-అదుపు) నిబంధనలు-2000 కింద నోటిఫైడ్ వినోద ప్రాంగణాలు, అంతర్జాతీయ కళాకారులకు చెల్లింపుల కోసం విదేశీ రెమిటెన్సులపై పరిమితుల సడలింపు వంటి తదుపరి తరం సంస్కరణలపైనా ‘ఎల్‌ఈడీసీ’ చర్చించింది.

ముందస్తు ఆమోదిత వేదికల విషయానికొస్తే- ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐ) తమ ప్రాంగణాల్లో ప్రత్యక్ష కార్యక్రమాల నిర్వహణకు ప్రామాణిక నిర్వహణ ప్రక్రియ ఆదేశాలు జారీ చేశాయి. ఆ మేరకు నిర్వాహకులు ప్రతి కార్యక్రమానికీ ఒకే రకమైన వేదిక స్థాయి అనుమతులు కోరాల్సిన అవసరం లేకుండా ప్రధాన వేదికలను ముందస్తుగా ఆమోదించాల్సి ఉంటుందని ఈ ఆదేశాలు స్పష్టం చేశాయి.

 

ప్రత్యేకంగా నిర్మించిన వేదికల కొరత పరిష్కారం దిశగా ‘బ్రౌన్‌ఫీల్డ్, గ్రీన్‌ఫీల్డ్ వేదికల నిర్మాణ” చట్రాన్ని కూడా ‘ఎల్‌ఈడీసీ’ సమీక్షించింది. ఈ ముసాయిదా చట్రంపై తమ అధికారిక అభిప్రాయాన్ని ప్రకటించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలు, పారిశ్రామిక భాగస్వాములు, క్రీడా సంస్థలను కోరింది. రాష్ట్రాల ద్వారా ప్రత్యేక ప్రయోజనార్థం వేదికలను గుర్తించి అభివృద్ధి చేయడం, నిర్దిష్ట పరిమితికి మించిన సామర్థ్యం గల లైవ్ ఈవెంట్-ప్రదర్శన వేదికల మౌలిక సదుపాయాల ఉప-రంగాలను ఏకీకృత మాస్టర్ జాబితాలో చేర్చడం, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పథకం ద్వారా ప్రాజెక్టులకు మద్దతు వంటి అనేక ప్రతిపాదనలపై సమావేశం చర్చించింది.

 

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ) వైస్ ఛాన్సలర్ అధ్యక్షతన ఏర్పాటైన ‘లైవ్ ఈవెంట్ స్కిల్లింగ్ కమిటీ’ నైపుణ్య శిక్షణ పాఠ్యప్రణాళిక పురోగతిని సమావేశంలో సమర్పించింది. ఇందులో ‘ఐఐఎంసీ, ఎంఈఎస్‌సీ, ఈఈఎంఏ’ల మధ్య అవగాహన ఒప్పందం, ప్రత్యక్ష ప్రదర్శనలలో సర్టిఫికేట్-స్వల్పకాలిక కోర్సులు వంటి అంశాలు కూడా ఉన్నాయి. సంబంధిత వర్గాలు తమ నైపుణ్య శిక్షణ సంస్థల ద్వారా ఈ మాడ్యూళ్లను ఆమోదించాలని సమావేశం కోరింది. పరిశ్రమ మద్దతుతో వేవ్స్‌-2027లో లైవ్ ఈవెంట్లు, సంగీత కచేరీలలో మహిళలు-దివ్యాంగుల భద్రతకు సమ్మిళిత మార్గదర్శకాలు, గ్రీన్ కాన్సర్ట్ ప్రోటోకాల్‌కు శ్రీకారం చుట్టాలని కూడా ప్రతిపాదించింది.

 

భారత లైవ్ ఈవెంట్స్ రంగానికి సహాయక, వృద్ధి ఆధారిత వ్యవస్థను ప్రోత్సహించడానికి సంబంధిత వర్గాలన్నింటితో కలిసి పనిచేయడంపై తన నిబద్ధతను సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ పునరుద్ఘాటించడంతో ఈ సమావేశం ముగిసింది.

****


(రిలీజ్ ఐడి: 2320397) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , English , Urdu , हिन्दी , Gujarati , Kannada , Malayalam