ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జె.పి. నడ్డా నేతృత్వంలో భారత్ మండపంలో రేపు ‘జోష్’ బృందాల జాతీయ స్థాయి ప్రారంభ కార్యక్రమం
హాజరు కానున్న కేంద్ర మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్త
తొలిదశలో 11 రాష్ట్రాల్లోని 55 జిల్లాల్లో ‘జోష్’ బృందాల ఏర్పాటు... టీబీ ముక్త భారత్ దిశగా యువత నేతృత్వంలో బలంగా సామాజిక సమీకరణ
టీబీ ముక్త్ భారత్ సందేశాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లనున్న జోష్ బృందాలు.. క్లాస్-I అధికారులు, మై భారత్ వలంటీర్లు, ఎన్‌సీసీ కేడెట్లతో మెరుగైన సామాజిక భాగస్వామ్యం
2025 నాటికి 697 జిల్లాల పరిధిలో 67,933 పంచాయతీలకు టీబీ రహిత ప్రాంతాలుగా గుర్తింపు.. టీబీ నిర్మూలన దిశగా దేశ ప్రయత్నాల్లో క్షేత్రస్థాయి భాగస్వామ్యాన్ని బలోపేతం చేయనున్న జోష్ బృందాలు
టీబీపై పోరాటంలో ఆరోగ్య, యువజన, రక్షణ రంగాలను ఏకతాటిపైకి తెస్తూ.. ఏకోన్ముఖ ప్రభుత్వ, సమాజ సమగ్ర భాగస్వామ్య విధానాన్ని చాటేలా కార్యక్రమం
నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2026 10:05AM by PIB Hyderabad
యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ, రక్షణ మంత్రిత్వశాఖల సహకారంతో 2026 అక్టోబరు 8న న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ‘జోష్’ (జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్) బృందాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రారంభించనుంది. తొలి విడతలో 11 రాష్ట్రాల్లోని 55 జిల్లాల్లో ఈ జోష్ బృందాలను రంగంలోకి దించనున్నారు. యువత ఆధ్వర్యంలో సామాజిక చైతన్యాన్ని పెంపొందించడం, టీబీ ముక్త్ భారత్ సందేశాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. దేశంలో క్షయవ్యాధి (టీబీ) నిర్మూలన దిశగా సాగుతున్న పోరాటంలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇదొక ముఖ్యమైన ముందడుగు.
కేంద్ర కార్మిక, ఉపాధి - యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్త సమక్షంలో.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ - రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా ఈ జోష్ బృందాల జాతీయ స్థాయి ప్రారంభోత్సవానికి నేతృత్వం వహిస్తారు. భాగస్వామ్య మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు, ప్రజాప్రతినిధులు, క్లాస్-I అధికారులు, మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, ఎన్‌సీసీ కేడెట్లు, దేశ టీబీ నిర్మూలన కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ కార్యక్రమంలో భాగంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ సాధించిన కీలక విజయాలను వివరిస్తూ రూపొందించిన వీడియో ప్రదర్శన ఉంటుంది. అనంతరం జోష్ బృందాలను అధికారికంగా ప్రారంభిస్తారు. దీనితోపాటు టీబీ ముక్త్ భారత్ అభియాన్‌కు సంబంధించిన కొత్త సమాచారం, విద్య, ప్రచార సాధనాలనూ ఆవిష్కరిస్తారు. అంతేకాకుండా ప్రజల్లో అవగాహనను పెంపొందించడం, సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, టీబీ నిర్మూలన జాతీయ లక్ష్య సాధనలో సమాజ క్రియాశీల పాత్రను పెంచడం ధ్యేయంగా.. ఏఐ ఆధారిత చాట్‌బాట్ ‘ఖుషి అవతార్’ను కూడా ఆవిష్కరిస్తారు.
క్షేత్రస్థాయిలో టీబీ నిర్మూలన దిశగా నిర్మాణాత్మక యువజన భాగస్వామ్యం
దేశ యువత ఉత్సాహాన్నీ, వారి విస్తృత పరిధినీ టీబీ నిర్మూలన దిశగా ఒక వ్యవస్థీకృత ప్రజా ఉద్యమంగా మలిచేందుకు ఒక నిర్మాణాత్మక యంత్రాంగంగా ‘జోష్’ బృందాలను రూపుదిద్దారు. పాలనపరమైన నాయకత్వాన్నీ, మై భారత్, ఎన్‌సీసీ వ్యవస్థల విస్తృత యువజన నెట్‌వర్క్, సామాజిక భాగస్వామ్య సామర్థ్యాలనూ మేళవిస్తూ... క్లాస్-I అధికారులు, మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, ఎన్‌సీసీ కేడెట్లను ఈ బృందాలు ఏకతాటిపైకి తెస్తాయి.
మొదటి దశలో ఈ కార్యక్రమం బ్లాక్/వార్డు, కమ్యూనిటీ స్థాయుల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుంది. తద్వారా టీబీ ముక్త్ భారత్ సందేశాన్ని ఆరోగ్య కేంద్రాలకే పరిమితం చేయకుండా.. జనావాసాలకు, పని ప్రదేశాలకు, ప్రజల కూడళ్లకు మరింత చేరువ చేస్తుంది.
సామాజిక అవగాహన కార్యక్రమాలు, సమాజ భాగస్వామ్యం ద్వారా.. టీబీ లక్షణాలు, నివారణ, సకాలంలో రోగనిర్ధారణ, చికిత్సను పూర్తి చేయడంపై కీలక సందేశాలను విస్తృతంగా ప్రచారం చేయడంలో జోష్ బృందాలు తోడ్పాటునందిస్తాయి. అలాగే టీబీపై అపోహలను తొలగించడం, టీబీ బాధితులపై సామాజిక వివక్షను తగ్గించడం, దేశవ్యాప్త టీబీ నిర్మూలన ఉద్యమంలో వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సమాజపరంగా ప్రతి ఒక్కరూ క్రియాశీలంగా పాల్గొనేలా ప్రోత్సహించడంలో ఇవి విశేష పాత్ర పోషిస్తాయి.
టీబీ నిర్మూలన పోరాటంలో యువతను భాగస్వాములను చేయడం, అవగాహన పెంపొందించడం, సామాజిక చైతన్యాన్ని తీసుకురావడం, సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించడం కోసం వారికి ఒక స్పష్టమైన వేదికను కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం. క్లాస్-I అధికారులు, మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, ఎన్‌సీసీ కేడెట్ల మధ్య సమన్వయం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలతో మరింత బలంగా అనుసంధానించడానికి ఎంతగానో తోడ్పడుతుంది.
ప్రజా భాగస్వామ్య శక్తిని చాటడం
జన భాగీదారీని దేశ టీబీ నిర్మూలన చర్యలకు మౌలిక ప్రాతిపదికగా జోష్ నిలుపుతోంది. 2025లో.. 697 జిల్లాల్లోని 67,933 పంచాయతీలు టీబీ రహిత గ్రామాలుగా గుర్తింపును పొందాయి. దేశ టీబీ నిర్మూలన లక్ష్య సాధనలో ఆరోగ్య కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవకులు, సమాజ భాగస్వామ్యంతో కూడిన సమష్టి కృషికి ఇది నిదర్శనం.
టీబీ నిర్మూలన సందేశాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో.. స్థానిక నాయకత్వం, సామాజిక నేతృత్వం, నిరంతర భాగస్వామ్యాల ఆవశ్యకతను ఇది చాటుతోంది. క్షయవ్యాధి నివారణ చర్యలపై అవగాహన, ఆ దిశగా సామాజిక సమీకరణ, భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా.. యువత శక్తి, విస్తృత ప్రచారం, సామాజిక వ్యవస్థల సద్వినియోగం ద్వారా ఈ జన భాగిదారీ స్ఫూర్తిని జోష్ బృందాలు మరింత ముందుకు తీసుకెళ్తాయి.
ఏకోన్ముఖ ప్రభుత్వం, సామాజిక సమగ్రత
ఆరోగ్య, యువజన, రక్షణ రంగాల సంస్థాగత బలాలు, సామాజిక ప్రచార వ్యవస్థలను ఏకతాటిపైకి తేవడం ద్వారా.. ఏకోన్ముఖ ప్రభుత్వ, సామాజిక సమగ్రతా విధానానికి జోష్ బృందాలు ప్రతినిధులుగా నిలుస్తాయి.
ప్రజారోగ్య విధానాన్ని, టీబీ నిర్మూలన కార్యాచరణను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమంలో వివరిస్తుంది. కాగా మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, ఎన్‌సీసీ కేడెట్ల ప్రాతినిధ్యానికి మార్గం సుగమం చేస్తూ... క్షేత్రస్థాయిలో ప్రజలను సమీకరించడంలోనూ, అవగాహన ప్రచారంలోనూ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ, రక్షణ మంత్రిత్వశాఖలు ముఖ్యభూమిక పోషిస్తున్నాయి.
ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు, రంగాల మధ్య సమన్వయానికి ఇస్తున్న ప్రాధాన్యానికి ఈ కార్యక్రమం నిదర్శనం. విభిన్న సంస్థాగత, సామాజిక వ్యవస్థలు కలిసి ఒక ఉమ్మడి జాతీయ లక్ష్యానికి దోహదపడేలా ఇది వీలు కల్పిస్తుంది.
ప్రజలే కేంద్రంగా ఉన్న, ప్రాతినిధ్య, సామాజిక టీబీ నిర్మూలన కార్యక్రమాల దిశగా ప్రభుత్వ చర్యల్లో ‘జోష్’ బృందాలు మరో కీలకమైన ముందడుగు. మంత్రులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆరోగ్య కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, యువత, ప్రజలందరి సమష్టి కార్యాచరణే ఇందుకు ప్రాతిపదిక.
క్షేత్రస్థాయిలో బలమైన భాగస్వామ్యం, క్రియాశీల జనభాగిదారీ ద్వారా... టీబీ ముక్త్ భారత్ నిర్మాణం దిశగా సమష్టి సంకల్పాన్ని జోష్ బృందాలు మరింత బలోపేతం చేస్తాయి.
***
(రిలీజ్ ఐడి: 2320221)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada