ఆయుష్
విద్యా సంవత్సరం 2026–27కు బీఎన్‌వైఎస్ డిగ్రీ కోర్సుకు దరఖాస్తులను
ఆహ్వానిస్తున్న అఖిల భారత ప్రకృతి వైద్య విద్యాసంస్థ
నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2026 12:04PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అఖిల భారత ప్రకృతి వైద్య విద్యాసంస్థ (ఎన్ఐఎన్) పుణేలోని ఏవలేవాడిలో ఉన్న ప్రతిష్ఠాత్మక నిసర్గ్ గ్రామ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ (బీఎన్‌వైఎస్) కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఆయుష్ మంత్రిత్వశాఖలో అటానమస్ సంస్థగా ఎన్ఐఎన్ పనిచేస్తోంది. నేచురోపతి, యోగా ద్వారా ఆరోగ్య సేవలు, విద్య, శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించాలనే మహాత్మాగాంధీ ఆలోచనను, లక్ష్యాన్ని ముందుకు తీసుకెళుతోంది. న్యూఢిల్లీలోని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి అనుబంధంగా బీఎన్‌వైఎస్ కోర్సును అందిస్తున్న తొలి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐఎన్. ఇది నేచురోపతి, యోగాలో సంస్థాగత విద్యను, విద్యా ప్రమాణాలను బలోపేతం చేయడంలో కీలక ఘట్టంగా నిలుస్తుంది.
రెసిడెన్షియల్ బీఎన్‌వైఎస్ పూర్తి కాల రెసిడెన్షియల్ కోర్సు వ్యవధి అయిదున్నర సంవత్సరాలు. దీనిలో నాలుగున్నర సంవత్సరాలు విద్య, వైద్యపరమైన శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత ఒక సంవత్సరం కంపల్సరీ రొటేటరీ రెసిడెన్షియల్ ఇంటర్న్‌షిప్ (సీపీఆర్ఐ) ఉంటుంది. ఈ కార్యక్రమం ప్రకృతి వైద్యం, యోగాలో విస్తృతమైన క్లినికల్ అనుభవంతో పాటు సమగ్ర విద్యాబోధనను అందిస్తుంది. 2026–27 సంవత్సరానికి మొత్తం 100 సీట్లను కేటాయించారు.
గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (పీసీబీ), ఇంగ్లీషు సబ్జెక్టులతో 10+2 లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన, నిర్దేశించిన అర్హతలను, మెడికల్ ఫిట్‌నెస్ అర్హతలను కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నీట్–యూజీ 2026కు హాజరైన అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తారు. మిగిలిన సీట్లను నిర్దేశిత ప్రవేశ విధానం, రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా 10+2 పీసీబీ మెరిట్ ఆధారంగా కేటాయిస్తారు.
25 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిసర్గ్ గ్రామ్ క్యాంపస్ విస్తరించింది. దీనిలో 250 పడకల నేచురోపతి ఆసుపత్రి, విద్యా, పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. బాలబాలికల కోసం వేర్వేరు వసతిగృహాలు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన యోగా హాళ్లు, ఆధునిక నేచురోపతి చికిత్సా సౌకర్యాలు కూడా ఉన్నాయి. విద్య, వైద్య శిక్షణ, పరిశోధన, ఆరోగ్య సంరక్షణకు అవసరమైన సమగ్ర వాతావరణాన్ని ఈ క్యాంపస్ అందిస్తుంది.
ఆన్‌లైన్ అప్లికేషన్ల ప్రక్రియ 2026 సెప్టెంబర్ 29న ప్రారంభమయింది. 2026 అక్టోబర్ 19 సాయంత్రం 5 గంటలతో గడువు ముగుస్తుంది. 2026 అక్టోబర్ 27న ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదలవుతుంది. 2026 అక్టోబర్ 30న తుది మెరిట్/వెయిటింగ్ జాబితా విడుదలవుతుంది. 2026 నవంబర్ 12, 13, 18, 19 తేదీల్లో కౌన్సెలింగ్ జరుగుతుంది. 2026 నవంబర్ 30 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
ప్రవేశాలు, ఫీజు వివరాలు, దరఖాస్తు విధానానికి సంబంధించిన పూర్తి సమాచారం ఎన్ఐఎన్ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంది: www.ninpune.ayush.gov.in.
ప్రవేశాల హెల్ప్‌లైన్: +91 7965220180, 9511693564
ఈ–మెయిల్: admission@bnysnin.in
***
(రిలీజ్ ఐడి: 2320148)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2