రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో హై-ఆల్టిట్యూడ్‌ వేదిక గగనతల ప్రయోగాత్మక పరీక్ష విజయవంతం

నాడు పోస్టు చేయడమైనది: 06 OCT 2026 3:33PM by PIB Hyderabad

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అధిక ఎత్తులో పనిచేసే వేదిక (హైఆల్టిట్యూడ్‌ ప్లాట్‌ఫాం) గగనతల ప్రయోగ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగంలో ఎయిర్‌షిప్‌ (విమాన వాహనం) సముద్ర మట్టానికి 21 కిలోమీటర్ల గరిష్ఠ ఎత్తుకు చేరుకొని రికార్డు సృష్టించింది. అనంతరం సముద్ర మట్టానికి 20 కిలోమీటర్ల ఎత్తులో దాదాపు 30 నిమిషాలకు పైగా నిలకడగా ప్రయాణించింది. ఆ తర్వాత నియంత్రణ ఆదేశాలతో తిరిగి కిందికి రప్పించారు. ఈ వ్యవస్థను విజయవంతంగా తిరిగి భూమికి తీసుకువచ్చి, ప్రయోగ సమయంలో సేకరించిన పనితీరు సమాచారాన్ని విశ్లేషించారు.

 

ప్రయోగం మొత్తం సమయంలో ఎప్పటికప్పుడు వీడియో డేటా, అలాగే వాహనానికి సంబంధించిన ఇతర అన్ని పనితీరు వివరాలను గ్రౌండ్‌ కంట్రోల్‌ స్టేషన్‌ నుంచి సేకరించారు. ఈ సమాచారం ద్వారా నిర్దేశించిన విధంగానే ఎయిర్‌షిప్‌ పనిచేసినట్లు చూపించింది. ఈ వ్యవస్థలో వివిధ రకాల పర్యవేక్షణ, నియంత్రణకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ పరికరాలను అమర్చారు. వీటిలో ఇనర్షియల్‌ మెజర్‌మెంట్‌ యూనిట్‌ (ఐఎంయూ), గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌) రిసీవర్‌, ఆన్‌బోర్డ్‌ కెమెరాలు, ఎత్తు నియంత్రణ వ్యవస్థతో పాటు ఇతర ఉపవ్యవస్థలు ఉన్నాయి. వీటి ద్వారా విమాన వాహనం ప్రయాణించే సమయంలో దాని స్థానం, ఎత్తు, కదలికలు, పనితీరును పర్యవేక్షించి నియంత్రించవచ్చు. ఈ గగనతల ప్రయోగ పరీక్షను భారత వైమానిక దళం, సీఈఎంఐఎల్‌ఏసీ, డీజీసీఏ,భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)తో పాటు ఇతర పౌర సంస్థల సమన్వయంతో నిర్వహించారు.

దీర్ఘకాలం పాటు స్ట్రాటోస్ఫియర్‌లో గగనతల నిఘా నిర్వహించగల హై-ఆల్టిట్యూడ్‌ వేదిక ఒక తేలికపాటి గాలి ఆధారిత వ్యవస్థ. దీనిని ఆగ్రాలోని వైమానిక సరఫరా పరిశోధన, అభివృద్ధి సంస్థ (ఏడీఆర్‌డీఏ) రూపొందించి అభివృద్ధి చేస్తోంది.

 

 

 

హై-ఆల్టిట్యూడ్‌ వేదిక విజయవంతమైన విమాన పరీక్షను పురస్కరించుకుని డీఆర్‌డీఓ, ఐఏఎఫ్‌, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు. దీర్ఘకాలం పాటు స్ట్రాటోస్ఫియర్‌లో పనిచేసే ఎయిర్‌షిప్‌ను అభివృద్ధి చేసే దిశగా ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్రయాణంలో ఈ విజయవంతమైన పరీక్ష ఒక ముఖ్యమైన ప్రస్థానంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

 

 

 

 హై-ఆల్టిట్యూడ్‌ ఎయిర్‌షిప్‌ వేదిక విమాన పరీక్షలో పాల్గొన్న బృందాలను రక్షణ శాఖ కార్యదర్శి, రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శి, డీఆర్‌డీఓ చైర్మన్‌ శ్రీ రాజేష్‌ కుమార్‌ సింగ్‌ అభినందించారు.

***


(రిలీజ్ ఐడి: 2319880) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese