రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

మొదటి స్వదేశీ ఫ్లీట్ సపోర్ట్ ఓడ ‘ఐఎన్ఎస్ సూర్య’ను విశాఖపట్నం హిందుస్తాన్ షిప్‌యార్డ్‌లో ప్రారంభించిన కేంద్ర రక్షణ మంత్రి


‘‘ఎఫ్ఎస్ఎస్1 ప్రారంభం ఓ విజయ సూచిక.. దీనికి కీల్ అమరిక దృఢసంకల్పానికి ప్రతీక.. పెంపొందుతున్న మన సామర్థ్యానికి కొత్త స్లిప్‌వే నిదర్శనం’’ అన్న శ్రీ రాజ్‌నాథ్ సింగ్

‘‘హెచ్ఎస్ఎల్‌ను మనం నాణ్యత, ఉత్పాదకతతో పాటు అనుకున్న సమయానికి డెలివరీ చేసేందుకు ఓ ప్రమాణంగా తీర్చిదిద్దాలి’’ అన్న మంత్రి

‘‘విశాఖపట్నాన్ని ఓ ప్రధాన నౌకావాణిజ్య పారిశ్రామిక కూడలిగా అభివృద్ధి చేయాలి’’

నాడు పోస్టు చేయడమైనది: 06 OCT 2026 12:50PM by PIB Hyderabad

మొదటి ఫ్లీట్ సపోర్ట్ షిప్ (ఎఫ్ఎస్ఎస్-1)ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్ (హెచ్ఎస్ఎల్)లో ఈ రోజు ప్రారంభించారు. ఎఫ్ఎస్ఎస్-5 నిర్మాణ పనులకు ఆయన శుభారంభం చేశారు. ఉన్నతీకరించిన స్లిప్‌వే-4 (పడవలను నీటిలోకి దింపే మార్గం)తో పాటు, 300 టన్నుల సామర్థ్యం కలిగిన బరువులెత్తే యంత్రం గోలియత్ క్రేనును కూడా మంత్రి ప్రారంభించారు. ఈ పరిణామాలు పెద్దవైన, జటిలమైన నౌకలను నిర్మించడానికి హెచ్ఎస్ఎల్‌‌కు ఉన్న సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే కాక భారత స్వదేశీ నౌకావాణిజ్య శక్తియుక్తులను పెంచే దిశగా కూడా ఓ ముఖ్య ముందడుగును సూచిస్తున్నాయి.  

సభను ఉద్దేశించి రక్షణ మంత్రి ప్రసంగిస్తూ, ఈ మూడు ప్రధాన విజయాలూ వ్యక్తిగత విజయాల కన్న మించినవిగా వర్ణించారు. ‘‘ఎఫ్ఎస్ఎస్1కు శ్రీకారం చుట్టడం ఓ విజయప్రస్థానం. ఎఫ్ఎస్ఎస్5కు కీల్ లేయింగ్ మన సంకల్పాన్ని చాటుతోంది. పడవలను నీటిలోకి దింపే కొత్త మార్గ నిర్మాణం మన సత్తా అంతకంతకూ పెరుగుతోందనడానికి నిదర్శనం’’ అని ఆయన వివరించారు. హెచ్ఎస్ఎల్‌ తన నౌకానిర్మాణ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు, భారతదేశ నౌకావాణిజ్య శక్తి పునాదులను కూడా పటిష్ఠపరుస్తోందని మంత్రి అన్నారు.

 

స్వతంత్ర భారతదేశంలో 1948లో మొదటి ఓడ ‘జల ఉష’ను 1948లో ప్రారంభించుకున్న సంగతిని కేంద్ర రక్షణ మంత్రి గుర్తు చేస్తూ, సముద్ర వారసత్వాన్ని భారత్ శతాబ్దాల నాటి నుంచే పరిరక్షించుకుంటూ వచ్చిందన్నారు. ప్రాచీన కాలం నుంచీ మన దేశం సముద్రాలతో తన అనుబంధాన్ని పెంచుకొంటూ వచ్చిందని ఆయన అన్నారు. భారత జాతీయ నౌకావాణిజ్య సామర్థ్యానికి సంరక్షకురాలి పాత్రను హెచ్ఎస్ఎల్ పోషిస్తోందనీ, ఎనిమిది కన్న ఎక్కువ దశాబ్దాల నుంచి దేశ నౌకావాణిజ్య, రక్షణ సంబంధ అవసరాలను తీర్చడంలో ఈ సంస్థ గొప్ప తోడ్పాటును అందిస్తోందన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలోకి హెచ్ఎస్ఎల్ వచ్చిన తరువాత, 2025లో మినీరత్న కేటగిరీ-I స్థాయిని అందుకున్న విషయాన్ని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావించారు. ఇది ఈ సంస్థ ప్రగతినీ, నిరంతర కృషినీ చాటుతోందని ఆయన అన్నారు.

నౌకాదళ విస్తృతినీ, సామర్థ్యాన్నీ పెంచనున్న ఓడ సహాయక నౌకలు

ఫ్లీట్ సపోర్ట్ షిప్ కార్యక్రమాన్ని గురించి రక్షణ మంత్రి చెబుతూ, ఈ నౌకలు హిందూ మహాసముద్ర ప్రాంతంలో నౌకాదళ విస్తృతినీ, సామర్థ్యాన్నీ, కార్యకలాపాల పరంగా దక్షతనీ బలోపేతం చేస్తాయన్నారు. సముద్రాల్లో దూర ప్రాంతాల్లో దీర్ఘకాలం పాటు కార్యకలాపాలను నిర్వహించే నౌకాదళానికి ఒక్క యుద్ధనౌకల అవసరం మాత్రమే ఉండదనీ, ఆధునిక రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్), నిర్వహణ, నిరంతర సహాయం, కార్యకలాపాలను కొనసాగించగలగడం వంటి అవసరాలు కూడా నౌకాదళానికి ఉంటాయనీ మంత్రి వివరించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్‌లు సముద్రాల్లో రక్షణ కార్యకలాపాలకూ, నౌకాదళ దాడులకూ నిరంతర మద్దతును అందిస్తూ ఈ అవసరాలను తీరుస్తాయని ఆయన తెలిపారు. ఎఫ్ఎస్ఎస్-1 ప్రారంభం నౌకాదళ దాడుల విస్తృతినీ, సామర్థ్యాన్నీ పెంచే దిశగా ఓ కీలక ఘట్టమనీ, ఇక ఎఫ్ఎస్ఎస్-5 కు శంకుస్థాపన భారతదేశ నౌకావాణిజ్య భవిష్యత్తుకు బలమైన పునాదిని అందించగలదనీ మంత్రి అన్నారు.

నేవీ వైవ్స్ వెల్‌నెస్ అసోసియేషన్ (ఎన్‌డబ్ల్యూడబ్ల్యూఏ) అధ్యక్షురాలు శ్రీమతి లైలా స్వామినాథన్ సాంప్రదాయిక లాంఛనాలను పూర్తి చేసిన తరువాత, ఎఫ్ఎస్ఎస్-1ను ప్రారంభించారు. ఎఫ్ఎస్ఎస్-1కు ‘సూర్య’ అనే పేరును పెట్టారు. ఆహ్వానితుల హర్షధ్వానాల మధ్య ఈ నౌకను బంగాళాఖాతం జలాల్లో ప్రవేశపెట్టారు. ఈ నౌకకు రూపురేఖలను దిద్దడమే కాకుండా దీనిని హెచ్ఎస్ఎల్ నిర్మించింది. ఓడసరుకుతో పాటు ద్రవ రూప పదార్థాలను తీసుకువెళ్లే సామర్థ్యాన్ని ‘సూర్య’కు జతపరిచారు. ప్రథమ శ్రేణికి చెందిన నిర్వహణ కార్యశాలలు, అనేక పనులను చేసిపెట్టగల హెలీకాప్టర్ దిగడానికి వీలుగా ఓడ పైభాగాన్నీ (డెక్), స్వీయ రక్షణ వ్యవస్థల్నీ జోడించారు.

 

 

పెద్ద నౌకానిర్మాణ కార్యక్రమాలకు దన్నుగా నిలిచే

ఉన్నత స్థాయి మౌలిక సదుపాయాలు

ఉన్నతీకరించిన స్లిప్‌వే-4 పరిధిని విస్తరించడంతో పాటు పటిష్ఠపరిచారు. దీని ద్వారా 45,000 వరకు డీడబ్ల్యూటీ (డెడ్‌వెయిట్ టన్నేజి) గరిష్ఠంగా మోసుకుపోగలిగే నౌకల నిర్మాణంతో పాటు ఆ నౌకలను సముద్ర జలాల్లోకి పంపించే పనిని హిందుస్తాన్ షిప్‌యార్డు పూర్తి చేయగలుగుతుంది. 3వ, 4వ స్లిప్‌వేలను కలిపే 300 టన్నుల గోలియత్ క్రేన్ రూపకల్పన, నిర్మాణ బాధ్యతను మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మెసర్స్ ఎల్ అండ్ టీ జియోస్ట్రక్చర్, కోనేక్రేన్స్ స్వీకరించి, నెరవేర్చాయి. దీనిలో పీఎల్‌‌సీ నియంత్రణలు, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్స్, టాండెమ్ లిఫ్టింగ్, రిమోట్ డయగ్నోస్టిక్స్, కండిషన్ మానిటరింగ్‌ సాధనాలను అమర్చారు. వీటి సాయంతో భారీ బ్లాకులను వేగంగానూ, మరింత కచ్చితత్వంతోనూ తీసుకుపోవడం సాధ్యపడుతుంది. ఈ కొత్త సదుపాయం హిందుస్తాన్ షిప్‌యార్డుకు పెద్ద, సంక్లిష్టతర నౌకానిర్మాణ బాధ్యతలను నెరవేర్చడంతో పాటు ఆధునిక బ్లాక్ నిర్మాణ సామర్థ్యాన్ని అందిస్తుంది.  

భారతదేశ నౌకావాణిజ్య భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ది కీలక పాత్ర

‘‘స్వయంసమృద్ధి ఒక ప్రధాన విజయసూచిక. అయితే ప్రపంచంతో పోటీ పడే తత్వం దీని తరువాతి కీలక దశ’’ అని రక్షణ మంత్రి వర్ణించారు. నాణ్యత, ఖర్చు, సాంకేతిక విజ్ఞానం, సమయానికి నిర్మాణ పనులను పూర్తి చేయడం, విశ్వసనీయ పనితనం అంశాల్లో ప్రపంచంలో అగ్రగామి నౌకానిర్మాణ కంపెనీలతో భారతీయ నౌకానిర్మాణ కేంద్రాలు పోటీపడగలగాలని ఆయన స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో విశాల పారిశ్రామిక విస్తారిత అనుబంధ వ్యవస్థతో హెచ్ఎస్ఎల్ మరింత ఎక్కువగా మమేకం కావాలని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ కోరారు. రాష్ట్రంలో సూక్ష్మ చిన్న మధ్యతరహా వాణిజ్య వ్యవస్థ  (ఎమ్ఎస్ఎమ్ఈ)లు సరఫరాదారుల పాత్రను పోషించవచ్చనీ, విశ్వవిద్యాలయాలు పరిశోధనలకీ, నైపుణ్యాభివృద్ధికీ తోడ్పాటును అందించవచ్చనీ, సాంకేతిక వాణిజ్య సంస్థలు డిజిటల్ నౌకానిర్మాణంలో సహయాన్ని అందించవచ్చనీ, అంకుర సంస్థలు నౌకావాణిజ్య సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయవచ్చనీ ఆయన వివరించారు. హెచ్ఎస్ఎల్‌ను కేంద్ర స్థానంలో ఉంచి, ఆధునిక రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్), ఓడరేవుల సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన, పరిశోధన, సాంకేతిక విజ్ఞానం, నైపుణ్యం గల కార్మికులు.. వీటన్నిటి సాయంతో ఒక సంపూర్ణ నౌకానిర్మాణ విస్తారిత అనుబంధ వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యం కావాలి అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

విశాఖపట్నానికి ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని రక్షణ మంత్రి వివరించారు. తూర్పు నౌకాదళ కమాండ్, నౌకాదళ డాక్‌యార్డు, హిందుస్తాన్ షిప్‌యార్డ్, విశాఖపట్నం ఓడరేవులు ఈ నగరాన్ని ఒక ఏకీకృత నౌకావాణిజ్య విస్తారిత అనుబంధ వ్యవస్థకు పునాది వేస్తున్నాయని ఆయన అన్నారు. విశాఖపట్నాన్ని ఒక ప్రధాన నౌకావాణిజ్య పారిశ్రామిక కూడలిగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. దీని కోసం నౌకాదళ ప్రావీణ్యాన్ని, నౌకానిర్మాణ సామర్థ్యాన్ని, ఇంజినీరింగ్ ప్రతిభనీ, ఓడరేవు మౌలిక సదుపాయాలనీ, చేయి తిరిగిన కార్మికులనీ సమీకరించాలని ఆయన సూచించారు. నౌకాదళం, హిందుస్తాన్ షిప్‌యార్డ్, డీఆర్‌డీఓ, విద్యాజగతి, పారిశ్రామిక రంగం, ఎమ్ఎస్ఎమ్ఈలు, అంకుర వ్యవస్థలతో ఒక ఏకీకృత జాతీయ నౌకావాణిజ్య విస్తారిత అనుబంధ వ్యవస్థను నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. ‘‘భారతదేశ నౌకావాణిజ్య శక్తిని నిర్మించడమంటే అది ఒక్క నౌకాదళం లేదా షిప్‌యార్డులతోనే అయ్యే పని కాదు’’ అని మంత్రి అన్నారు. ఆసక్తిదారుల మధ్య మరింత ఎక్కువ సమన్వయం నెలకొనడం కీలకమని ఆయన సూచించారు.

మన లక్ష్యం సరళంగా, స్పష్టంగా ఉండాలి.. మెరుగైన డిజైన్, వేగంగా తయారీ, చెప్పిన కాలానికి అందజేయడం, సమర్థ నిర్వహణ, ప్రభావవంతమైన మరమ్మతు సేవలు అందించాలి అని రక్షణ మంత్రి చెప్పారు. భారత రక్షణ రంగ విస్తారిత అనుబంధ వ్యవస్థ గత పది సంవత్సరాల్లో చెప్పుకోదగిన మార్పులకు లోనైందనీ, దేశీయ డిజైన్, ఆధునిక వ్యవస్థలు, వేదికల నిర్మాణంపై దృష్టిని కేంద్రీకరించారనీ  ఆయన వివరించారు. చెప్పిన టైముకు సేవల అందజేత, ఉత్పాదకత, స్వదేశీ డిజైన్ సామర్త్యం, సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం, నైపుణ్యం గల కార్మిక శక్తి, సామర్థ్యం, ఖర్చు పరంగా పోటీపడే తత్వం.. ఇవి భారత్‌‌ నౌకానిర్మాణ సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయిలో పోటీ పడగలిగేటట్లు చేస్తాయని మంత్రి వివరించారు.  

హెచ్ఎస్ఎల్ ప్రాధాన్యాలను మంత్రి ప్రస్తావిస్తూ, సకాలంలో పనులను పూర్తి చేయడాన్ని సంస్థాగత సంస్కృతిగా మార్చుకోవాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న నౌకానిర్మాణ కేంద్రాల నుంచి మరింత ఎక్కువ అనుభవాన్ని సంపాదించుకోవాలని సూచించారు. దేశీయంగా డిజైన్ సామర్థ్యాలను పెంపొందించుకోవాలనీ, ఎమ్ఎస్ఎమ్ఈలతో, అంకుర సంస్థలతో భాగస్వామ్యాలను ఏర్పరుచుకోవాలనీ, జీవితకాల సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలనీ కోరారు. నౌకాదళానికీ, నౌకానిర్మాణ కేంద్రాలకీ మధ్య మెరుగైన సమన్వయాన్ని సాధించడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలన్నారు.

 

 

స్వయంసమృద్ధి సాధనకు మించి,  అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే తత్వాన్ని అలవరుచుకోవడాన్ని భారత్ తన లక్ష్యంగా పెట్టుకోవాలని రక్షణ మంత్రి అన్నారు. భారతీయ నౌకానిర్మాణ కేంద్రాలు మిత్ర దేశాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు సేవలను అందించడమే కాకుండా నౌకావాణిజ్య సాంకేతికత, నౌకల మరమ్మతు, నిర్వహణ సేవలు, ఇంజినీరింగ్ నైపుణ్య రంగాల్లో ప్రపంచ స్థాయి ఉనికిని చాటుకొనే స్థితికి ఎదగాలని ఆయన సూచించారు.

 

 

ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వారిలో.. నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జనార్దన్ రెడ్డి, విశాఖపట్నం ఎంపీ శ్రీ శ్రీ భరత్ మతుకుమల్లి, రక్షణ ఉత్పత్తి కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్, తూర్పు నౌకాదళ కమాండ్ ఎఫ్ఓసీ-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, ఈస్టర్న్ సీబోర్డుకు చెందిన కోస్తా తీర రక్షకదళ కమాండరు అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీ డానీ మైఖేల్, హెచ్ఎస్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు రియర్ అడ్మిరల్ (రిటైర్డ్) సి. రఘురామ్‌తో పాటు భారతీయ నౌకాదళానికీ, రక్షణ శాఖకీ చెందిన సీనియర్ అధికారులు ఉన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2319650) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati