నౌకారవాణా మంత్రిత్వ శాఖ
స్వాతంత్య్రం తర్వాత తొలిసారి దిబ్రూగఢ్ బోగీబీల్ నుంచి బంగ్లాదేశ్‌కు అంతర్జాతీయ సరకు రవాణా ప్రారంభం
బోగీబీల్ నుంచి ఢాకాకు 540 టన్నుల ఏపీసీఎల్ మిథనాల్.. జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్
ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ
భారత ఈశాన్య ప్రాంతాన్ని విదేశీ మార్కెట్లతో అనుసంధానించే సరుకు రవాణా మార్గంగా బ్రహ్మపుత్ర (ఎన్‌డబ్ల్యూ-2) జలమార్గం సామర్థ్య పరిశీలన
1956లో ఆగిపోయిన స్టీమర్ శబ్దం.. మళ్లీ నేడు బోగీబీల్‌లో వినిపించింది: సర్బానంద సోనోవాల్
నాడు పోస్టు చేయడమైనది:
05 OCT 2026 4:02PM by PIB Hyderabad
అస్సాంలోని దిబ్రూగఢ్ బోగీబీల్ టెర్మినల్ నుంచి 540 మెట్రిక్ టన్నుల మిథనాల్‌తో ఒక బార్జ్ నేడు బంగ్లాదేశ్‌లోని ఢాకాకు బయలుదేరింది. కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాలశాఖ మంత్రి (పీఎస్‌డబ్ల్యూపీ) శ్రీ సర్బానంద సోనోవాల్ బోగీబీల్ నుంచి టగ్ కుశాల్ కోన్వార్‌తో నడిచే డీఎల్‌బీ పట్కాయ్ నౌకను జెండా ఊపి ప్రారంభించారు. అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. 1947లో భారత్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఎగువ అస్సాం ప్రాంతం నుంచి విదేశీ ఓడరేవుకు సరకు రవాణా జరగడం ఇదే తొలిసారి. దాదాపు 70 ఏళ్ల క్రితం బోగీబీల్‌లోని నదీ ఘాట్ మూతపడిన తర్వాత మళ్లీ ఇక్కడి నుంచి ఇప్పుడే అంతర్జాతీయ సరకు రవాణా ప్రారంభమైంది.
నమ్రూప్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ అస్సాం పెట్రో-కెమికల్స్ లిమిటెడ్ (ఏపీసీఎల్) ఉత్పత్తి చేసిన ఈ మిథనాల్‌ను బంగ్లాదేశ్‌లోని ఢాకా పంగావ్ ఓడరేవుకు తరలిస్తున్నారు. ఈ నౌక భారత్‌లోని బ్రహ్మపుత్ర నదిపై ఉన్న జాతీయ జలమార్గం-2 (ఎన్‌డబ్ల్యూ-2)లో సుమారు 768 కిలోమీటర్లు ప్రయాణించి భారత్–బంగ్లాదేశ్ సరిహద్దుకు చేరుకుంటుంది. అక్కడి నుంచి భారత్–బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గం (ఐబీపీఆర్) ద్వారా ముందుకు సాగుతుంది. దిబ్రూగఢ్‌లోని బోగిబీల్ నుంచి బంగ్లాదేశ్‌లోని ఢాకా సమీపంలోని నారాయణ్‌గంజ్ వరకు నౌక మొత్తం సుమారు 1,300 కిలోమీటర్లు ప్రయాణించనుంది.
ఈ ప్రయాణాన్ని ఈశాన్య భారత్‌ను విదేశీ మార్కెట్లతో అనుసంధానించే వాణిజ్యపరంగా ప్రయోజనకరమైన సరకు రవాణా మార్గంగా బ్రహ్మపుత్ర నది ఎంతవరకు ఉపయోగపడుతుందో పరీక్షించే మార్గంగా పరిగణిస్తున్నారు. భవిష్యత్తులో బంగ్లాదేశ్‌కు క్రమం తప్పకుండా మిథనాల్ సరఫరా చేయాలని ప్రణాళిక రూపొందించారు.ఇటీవల బోగీబీల్, ధుబ్రీ ప్రాంతాల్లో కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ సదుపాయాలతో కూడిన సముదాయాలను ఏర్పాటు చేయడంతో ఈ అంతర్జాతీయ సరకు రవాణా సాధ్యమైంది.
‘‘మా తాతలు, అమ్మమ్మలు దిబ్రూగఢ్ రేవులో స్టీమర్ సైరన్ శబ్దాన్ని వింటూ పెరిగారు. 70 ఏళ్లుగా ఆ శబ్దం వినిపించలేదు, నౌకల రాక కూడా ఆగిపోయింది. ఈరోజు దిబ్రూగఢ్ నుంచి మళ్లీ ఒక నౌక ప్రపంచం వైపు బయలుదేరింది. ఈ నది ఎప్పుడూ మనల్ని నిరాశపరచలేదు. దశాబ్దాలుగా దాన్ని పునరుద్ధరించాలనే సంకల్పం లేకపోవడమే సమస్య” అని కేంద్రమంత్రి శ్రీ సోనోవాల్ అన్నారు.
అస్సాంకు ఇది గర్వించదగిన రోజని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. “నామ్రూప్‌లో తయారైన అస్సాంకు చెందిన ఉత్పత్తి.. ఇప్పుడు రాష్ట్ర సొంత నదిపై ప్రయాణిస్తూ అంతర్జాతీయ మార్కెట్‌కు చేరుతోంది. ఈశాన్య ప్రాంతం ఇకపై దేశానికి అంచున ఉన్న ప్రాంతం కాదు. ఇది తూర్పు దేశాలకు భారత్‌కు ఉన్న ప్రవేశ ద్వారం” అని ఆయన పేర్కొన్నారు.
ఈ సరకు రవాణా ఒక ప్రారంభం మాత్రమేనని సోనోవాల్ అన్నారు. “ఇది తొలి ప్రయాణం.. చివరిది కాదు. అస్సాం యువతకు నేను చెప్పేది ఒక్కటే, ఈ నదిని చూస్తూ పెద్ద కలలు కనండి. ప్రపంచం ఇక దూరంగా లేదు. నది దిగువకు ప్రయాణిస్తే ప్రపంచాన్ని చేరుకోవచ్చు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ తేయాకు రాజధానిగా పేరుగాంచిన దిబ్రూగఢ్.. ఒకప్పుడు గొప్ప నదీ రేవుగా ఉన్న తన పూర్వ వైభవాన్ని మళ్లీ సొంతం చేసుకుంటోంది. చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూనే ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో దిబ్రూగఢ్‌ను అభివృద్ధి చేస్తున్నాం. 1956లో ఆగిపోయిన స్టీమర్ సైరన్ శబ్దం మళ్లీ వినిపిస్తోంది” అని సోనోవాల్ అన్నారు.
ఒకప్పుడు తూర్పు భారత్‌లోని అత్యంత రద్దీగా ఉండే నదీ రేవుల్లో దిబ్రూగఢ్ ఒకటిగా ఉండేది. 1856 నాటికే అప్పటి కలకత్తా, ప్రస్తుతం కోల్‌కతా నుంచి ప్రభుత్వ స్టీమర్లు దిబ్రూగఢ్‌కు చేరుకునేవి. 1882లో దిబ్రూగఢ్ స్టీమర్ రేవు నుంచి దిబ్రూ–సాదియా రైల్వే సేవలు ప్రారంభమయ్యాయి. 1913 నాటికి ప్రతిరోజూ స్టీమర్లు బ్రహ్మపుత్ర నదిపై ప్రయాణిస్తూ దిబ్రూగఢ్‌కు చేరుకునేవి. అవి తేయాకు, కలపతో పాటు ప్రయాణికులను కూడా రవాణా చేసేవి.
1947లో దేశ విభజనతో ఈ జలమార్గం తెగిపోయింది. దీంతో అస్సాం నుంచి సరుకులను కోల్‌కతాకు తరలించాలంటే తూర్పు పాకిస్థాన్ మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1950లో సంభవించిన భూకంపం కారణంగా దిబ్రూగఢ్ వద్ద నది అడుగుభాగంలో మార్పులు చోటుచేసుకున్నాయి. 1954లో దిబ్రూగఢ్ రేవు నుంచి సాధారణ సరకు బుకింగ్‌లు నిలిచిపోయాయి. తేయాకు సరఫరా రైలు మార్గానికి మారడంతో 1956 అక్టోబర్ 15న ఈ రేవు పూర్తిగా మూతపడింది. 1965లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధం కారణంగా సరిహద్దుల మధ్య నదీ మార్గం ద్వారా సరకు రవాణా నిలిచిపోయింది. 1972లో భారత్, బంగ్లాదేశ్ నదీ వాణిజ్యానికి సంబంధించిన ప్రోటోకాల్‌పై సంతకాలు చేశాయి. 1988లో సాదియా నుంచి ధుబ్రీ వరకు బ్రహ్మపుత్ర నదిలోని 891 కిలోమీటర్ల మార్గాన్ని జాతీయ జలమార్గం-2 (ఎన్‌డబ్ల్యూ-2)గా ప్రకటించారు. అయితే ఈ జలమార్గంలో సాధారణ సరకు రవాణా సేవలు ప్రారంభం కావడానికి 2017 డిసెంబర్ వరకు సమయం పట్టింది. ఆ సమయంలో పాండు నుంచి ధుబ్రీకి సిమెంట్‌ను రవాణా చేయడం ద్వారా ఈ సేవలు ప్రారంభమయ్యాయి
“దశాబ్దాలుగా దిబ్రూగఢ్ పూర్వ వైభవం క్రమంగా కనుమరుగైంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దిబ్రూగఢ్‌కు దక్కాల్సిన ప్రాధాన్యాన్ని తిరిగి తీసుకురావడానికి మేం చర్యలు ప్రారంభించాం. బోగీబీల్ టెర్మినల్, కస్టమ్స్, వలసల తనిఖీ సదుపాయాలతో కూడిన సముదాయం, ‘జలవాహక్’ కింద నిర్ణీత షెడ్యూల్‌తో నడిచే సరకు రవాణా సేవలు ఈ చారిత్రక పట్టణానికి ఆధునిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులను అందిస్తున్నాయి. దిబ్రూగఢ్‌కు గొప్ప పేరు తెచ్చిన వారసత్వాన్ని పునరుద్ధరిస్తూనే భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నాం. ఈరోజు దిబ్రూగఢ్ నుంచి మరోసారి విదేశీ ఓడరేవుకు సరకు బయలుదేరుతున్న వేళ.. పట్టణం గతంలోని గర్వకారణమైన చరిత్ర, భవిష్యత్తులోని అవకాశాలు ఒకే నదిపై కలుస్తున్నాయి” అని కేంద్ర మత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ అన్నారు.
ఆ తర్వాత ఈ జలమార్గంలో కార్యకలాపాలు మరింత పెరిగాయి. 2022 ఫిబ్రవరిలో టాటా స్టీల్‌కు చెందిన బార్జ్‌లు బంగ్లాదేశ్ మీదుగా పాండుకు చేరుకున్నాయి. 2023లో వారణాసి నుంచి బంగ్లాదేశ్ మీదుగా నదీ విహార నౌక ఎంవీ గంగా విలాస్ దిబ్రూగఢ్‌కు చేరుకుంది. బోగీబీల్ ప్రయాణికుల, సరకు రవాణా టెర్మినల్‌కు 2023 జూలైలో శంకుస్థాపన చేయగా.. 2024 ఫిబ్రవరిలో ఇది ప్రారంభమైంది. 2024 డిసెంబర్‌లో ‘జల్‌వాహక్’ సరకు రవాణా ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రకారం, భారత్‌లోని జాతీయ జలమార్గాల ద్వారా సరకు రవాణా 2013-14 ఆర్థిక సంవత్సరంలో 18 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 2025-26లో 218 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఈశాన్య ప్రాంతంలోని జలమార్గాల అభివృద్ధి కోసం రూ.6,800 కోట్లకు (68 బిలియన్లు) పైగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇందులో జాతీయ జలమార్గం-2 అభివృద్ధి, పాండు వద్ద నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటు, పాండు ఓడరేవుకు చివరి దశ రవాణా అనుసంధానం వంటి పనులు ఉన్నాయి.
“నదుల ద్వారా మనం తరలించే ప్రతి టన్ను సరకు అంటే తక్కువ ఇంధనం వినియోగించడం, జాతీయ రహదారులపై తక్కువ సంఖ్యలో ట్రక్కులు నడవడం” అని సోనోవాల్ అన్నారు. ప్రాంతీయ జలమార్గ అనుసంధానాలను అభివృద్ధి చేసేందుకు భారత్ బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్‌లతో కలిసి పనిచేస్తోందని ఆయన తెలిపారు.
ఈ సరకు రవాణా కార్యక్రమంలో ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, అస్సాం పెట్రో-కెమికల్స్, కొచ్చిన్ బంకర్స్ ప్రైవేటు లిమిటెడ్‌తో పాటు బంగ్లాదేశ్‌లోని భాగస్వామ్య సంస్థలు పాల్గొన్నాయి.
ఈ కార్యక్రమానికి అస్సాం రాష్ట్ర మంత్రులు చరణ్ బోరో, బిమల్ బోరా, సుశాంత బోర్గోహైన్‌తోపాటు రాజ్యసభ సభ్యుడు తెరాష్ గోవాల్లా కూడా పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి చెందిన పలువురు రాష్ట్ర శాసనసభ్యులు సైతం కార్యక్రమానికి హాజరయ్యారు. వారిలో దిబ్రూగఢ్ ఎల్‌ఏసీ ఎమ్మెల్యే ప్రశాంత ఫుకాన్, ఖోవాంగ్ ఎల్‌ఏసీ ఎమ్మెల్యే చక్రధర్ గోగోయ్ ఉన్నారు. ఐడబ్ల్యూఏఐ చీఫ్ ఇంజనీర్ ఏకే బన్సల్, అస్సాం పెట్రో-కెమికల్స్ (ఏపీసీఎల్) చైర్మన్ బికుల్ చంద్ర డేకాతో పాటు ఏపీసీఎల్, ఐడబ్ల్యూఏఐ, అస్సాంప్రభుత్వానికి చెందిన అధికారులు ఈ చారిత్రక కార్యక్రమంలో పాల్గొన్నారు.
****
(రిలీజ్ ఐడి: 2319380)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7