ఆర్థిక మంత్రిత్వ శాఖ
డ్రగ్స్ అక్రమ రవాణాపై చర్యల నేపథ్యంలో మూడు వేర్వేరు దాడుల్లో సుమారు 7 కేజీల ఆంఫెటమైన్, 5 కేజీల కొకైన్, 3.5 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ అధికారులు… అయిదుగురు అరెస్టు
దేశవ్యాప్తంగా నిఘా ఆధారిత దాడుల్లో భాగంగా హైస్పీడ్ ఛేజింగ్, చాక్లెట్ల రూపంలో దాచిన కొకైన్, కార్-పూలింగ్ ట్యాక్సీలో ప్రయాణిస్తున్న వ్యక్తి నుంచి హెరాయిన్ స్వాధీనం
నాడు పోస్టు చేయడమైనది:
04 OCT 2026 9:05PM by PIB Hyderabad
డ్రగ్స్ అక్రమ రవాణాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో 2026 సెప్టెంబర్ 29, 30 తేదీల్లో నిర్వహించిన మూడు వేర్వేరు దాడుల్లో మొత్తం 15.59 కేజీల ప్రమాదకరమైన ఆంఫెటమైన్, కొకైన్, హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. ఎన్‌డీపీఎస్ చట్టం-1985 ప్రకారం అయిదుగురు అరెస్టయ్యారు.
డీఆర్ఐ, నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో (సీబీఎన్) సంయుక్తంగా సెప్టెంబర్ 30, 2026న తనిఖీలు చేపట్టాయి. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని-దేవాస్ టోల్ ప్లాజా వద్ద ఆంఫెటమైన్ తరలిస్తున్నారన్న అనుమానంతో మహీంద్రా థార్ వాహనాన్ని అడ్డుకున్నాయి. వాహనం ఆపమని సంకేతాలిచ్చినప్పటికీ, బారికేడ్‌ను ఢీకొట్టి వాహనం వేగంగా ముందుకు దూసుకెళ్లింది. వేగంగా వాహనంలో పారిపోతున్న నిందితుడిని సుమారు ఒకటిన్నర గంటల పాటు అంతే వేగంతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు ఇండోర్‌లోని బిచోలి మర్దానా సమీపంలో అతన్ని పట్టుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా, వెనక డోర్‌కు అమర్చిన స్పేర్- టైరు లోపల డ్రగ్స్ బయటపడ్డాయి. అందులో 21 ప్యాకెట్లలో తెలుపు-పసుపు రంగులో 7.116 కేజీల స్పటిక ఆకారంలోని ఉన్న పదార్థాన్ని గుర్తించారు. ఎన్‌డీపీఎస్ ఫీల్డ్ టెస్ట్ కిట్ ద్వారా దాన్ని పరీక్షించగా, అది ఆంఫెటమైన్‌గా నిర్థారణ అయింది. వాహనంతో పాటు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని, ఎన్‌డీపీఎస్ చట్టం-1985 ప్రకారం ముగ్గురు వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు.
కొకైన్ అక్రమ రవాణాకు సంబంధించి నిఘా వర్గాల సమాచారం ఆధారంగా 29.09.2026న డీఆర్ఐ అధికారులు దాడులు నిర్వహించారు. దోహా నుంచి హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన భారత ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు అడ్డుకున్నారు. అతని లగేజీ బ్యాగును పరిశీలించగా, ఏడు చాక్లెట్ ట్యూబులు దొరికాయి. ఉండాల్సిన దానికన్నా అవి బరువు ఎక్కువ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ ట్యూబుల్లో చాక్లెట్లతో పాటు 207 లేత పసుపు రంగు క్యాప్సూల్స్ ఉన్నాయి. నార్కోటిక్ డ్రగ్ డిటెక్షన్ కిట్ సాయంతో క్యాప్సూల్స్‌లోని తెల్లని పొడిని కొకైన్‌గా అధికారులు నిర్ధారించారు. మొత్తం 4.9 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌డీపీఎస్ చట్టం-1985 ప్రకారం ప్రయాణికుడిని అరెస్టు చేశారు.
మాదకద్రవ్యాలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారంతో 29.09.2026న డీఆర్ఐ అధికారులు పంజాబ్‌లోని జలంధర్ నగర శివార్లలోని ఫిల్లౌర్ సమీపంలో నిఘా ఏర్పాటు చేశారు. సట్లెజ్ నదిపై వంతెన వద్ద ఎన్నో వాహనాలను తనిఖీ చేసిన తర్వాత అనుమానితుడు రెంటల్ కార్-పూలింగ్ టాక్సీలో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు.
అనుమానితుడిని తనిఖీ చేయగా, అతని వద్ద ఉన్న నీలిరంగు బ్యాక్ ప్యాక్ లోపల మూడు ప్యాకెట్లు లభించాయి. ప్రతి ప్యాకెట్‌లో రెండు చిన్న ప్యాకెట్లున్నాయి. ఫీల్డ్ టెస్ట్ కిట్ ద్వారా పరీక్షించగా, ఆ ప్యాకెట్లలోని పదార్థం హెరాయిన్ గా తేలింది. మొత్తం 3.574 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని, ఎన్‌డీపీఎస్ చట్టం-1985 ప్రకారం నిందితుడిని అరెస్టు చేశారు.
విభిన్న రవాణా మార్గాలను, నూతన గోప్యతా విధానాలను పసిగట్టటంలో డీఆర్ఐ విజయం సాధించారు. డ్రగ్స్ అక్రమ రవాణా వ్యవస్థలను అణచివేసేందుకు, దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల కదలికలను నిరోధించేందుకు డీఆర్ కట్టుబడి ఉంది.
****
(రిలీజ్ ఐడి: 2319027)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7