జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో భాగంగా జల్‌జీవన్‌ మిషన్‌ 2.0 ద్వారా గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థలపై సమాజానికి పూర్తి బాధ్యత కల్పించేందుకు దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని 1,850కి పైగా గ్రామ పంచాయతీల్లో జల్ అర్పణ్‌ కార్యక్రమం నిర్వహణ

జల్‌ అర్పణ్‌ మాడ్యూల్ ద్వారా ప్రాంతీయ భాషల్లో రూపొందించిన హర్ ఘర్ జల్ సర్టిఫికెట్లు... తొలిసారిగా గ్రామ పంచాయతీలకు జారీ

నాడు పోస్టు చేయడమైనది: 03 OCT 2026 5:16PM by PIB Hyderabad

గాంధీ జయంతి, రాష్ట్రాలు, యూటీల్లో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభల సందర్భంగా 1,850కి పైగా గ్రామ పంచాయతీలు, గ్రామాలు 'జల్ అర్పణ్' కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇది జల్ జీవన్ మిషన్ 2.0కు సంబంధించిన కీలక సంస్కరణ. ఇది గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ బాధ్యతను పూర్తిగా సమాజానికి అప్పగిస్తుంది. పూర్తయిన గ్రామీణ నీటి సరఫరా పథకాలను గ్రామ పంచాయతీలకు, గ్రామ నీటి సరఫరా, పారిశుద్ధ్య కమిటీలకు (వీడబ్ల్యూఎస్‌సీలు) అధికారికంగా అప్పగిస్తుంది. అంతేకాక ఇది మిషన్ దృష్టిని సమాజ-నేతృత్వంలోని నిర్వహణ, తాగునీటి సేవల సుస్థిర పంపిణీ దిశగా మళ్లించటాన్ని ప్రతిబింబిస్తుంది.

 

తొలిసారిగా గ్రామ పంచాయతీలు, గ్రామాలకు జల్‌ అర్పణ్‌ మాడ్యూల్ ద్వారా ప్రాంతీయ భాషల్లో రూపొందించిన హర్ ఘర్ జల్ సర్టిఫికెట్ల జారీని సులభతరం చేసింది. అర్హత గల గ్రామ పంచాయతీలు, గ్రామాల కోసం మొత్తం 346 హర్ ఘర్ జల్ సర్టిఫికెట్లను ప్రాంతీయ భాషల్లో రూపొందించి, జారీ చేశారు. ఇది ధ్రువీకరణ ప్రక్రియను మరింత సులువుగా, ప్రజలకు చేరువయ్యేలా చేయటమే కాక తాగునీటి సేవలపై స్థానిక సమాజానికి యాజమాన్య హక్కును మరింత బలోపేతం చేసింది. జల్ అర్పణ్ మాడ్యూల్ ద్వారా హిందీ, ఇంగ్లీష్‌తో పాటు అస్సామీ, బెంగాలీ, బోడో, గుజరాతీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంస్కృతం, తమిళం, తెలుగు, ఉర్దూ వంటి మరో 17 ప్రాంతీయ భాషల్లో 'హర్ ఘర్ జల్' సర్టిఫికెట్లను పొందే సదుపాయం ఇప్పుడు అందుబాటులో ఉంది. దీనివల్ల ప్రజలు సొంత భాషలోనే కార్యక్రమ సమాచారాన్ని, ధ్రువీకరణ పత్రాలను సులభంగా పొందగలుగుతున్నారు.

 

గ్రామీణ భారతదేశంలో 'జల్ అర్పణ్' వేడుకల్లో గ్రామ పంచాయతీలు, గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీలు, ఫ్రంట్‌లైన్ సిబ్బంది, మహిళా స్వచ్ఛంద కార్యకర్తలు, కమ్యూనిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నిర్దేశిత ట్రయల్ రన్ కాలం విజయవంతంగా ముగిసిన తర్వాత పూర్తయిన గ్రామీణ నీటి సరఫరా పథకాలను... వాటి నిర్వహణ, సంరక్షణ, దీర్ఘకాలిక మనుగడ కోసం గ్రామ పంచాయతీలకు, వీడబ్ల్యూఎస్‌సీలకు అధికారికంగా అప్పగించారు. పలు గ్రామాల్లో జల్ సంకల్ప్, జల్ బంధన్, ఫీల్డ్ టెస్ట్ కిట్ల (ఎఫ్‌టీకేల) ద్వారా నీటి నాణ్యత పరీక్షలపై ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు, సమాజం కోసం పాటుపడిన వారిని అభినందించటం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. సురక్షితమైన, విశ్వసనీయమైన తాగునీటి సేవలను అందించేందుకు వీలుగా రాష్ట్రాలు, యూటీల్లో నీటి నాణ్యత పరిశీలన, పర్యవేక్షణ కార్యక్రమాలతో పాటు వర్షాకాలం తర్వాత నీటి వనరుల నాణ్యత పరీక్షలను కూడా చేపట్టారు. మహిళల క్రియాశీల భాగస్వామ్యంతో కమ్యూనిటీ ఆధారిత నీటి నాణ్యత పర్యవేక్షణ మరింత బలపడుతోంది.

జల్ జీవన్ మిషన్ 2.0 సుజలం భారత్ ద్వారా డిజిటల్ పాలన, ఆస్తుల నిర్వహణను బలోపేతం చేస్తున్నారు. దీనిలో భాగంగా నీటి సరఫరా ఆస్తులు, పైపుల ద్వారా నీటిని అందించే వనరులను జియోట్యాగింగ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 700 వనరులతో సహా 2,691 నీటి సరఫరా ఆస్తులను జియోట్యాగింగ్ చేశారు. ఈ ప్రయత్నాలు గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థల మెరుగైన ప్రణాళిక, పర్యవేక్షణ, దీర్ఘకాలిక సుస్థిరతకు తోడ్పడటమే కాక, తాగునీటి ఆస్తులకు సంబంధించి సమగ్రమైన డిజిటల్ జాబితా తయారీకి సహాయపడుతున్నాయి.

 

దేశ నీటి భద్రత, స్వావలంబన ప్రయాణంలో భాగంగా, ప్రస్తుతం జల్ జీవన్ మిషన్ ద్వారా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 15.96 కోట్లకు పైగా కుటుంబాలకు తాగునీటి కోసం నల్లా కనెక్షన్లను ఇచ్చారు. ఈ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం, ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రత్యేకంగా జల్ అర్పణ్‌ డిజిటల్ మాడ్యూల్‌ను తాగునీటి, పారిశుద్ధ్య శాఖ అభివృద్ధి చేసింది. పథకం అప్పగింతకు సంబంధించిన డిజిటల్ రికార్డును ఈ మాడ్యూల్ అందిస్తుంది. గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణలో గ్రామ పంచాయతీల నాయకత్వాన్ని బలపరుస్తుంది. ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన, తగినంత, విశ్వసనీయమైన తాగునీటి సేవలు నిరంతరం అందేలా చూసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, గ్రామ పంచాయతీలు, స్థానిక కమ్యూనిటీల భాగస్వామ్యంతో పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.

 

తాగునీటి సేవలను స్థిరంగా కొనసాగించటంలో, దీర్ఘకాలిక నీటి భద్రతను నిర్ధారించటంలో గ్రామ పంచాయతీలు, గ్రామ సంఘాలు కీలక పాత్ర పోషిస్తూ మహాత్మాగాంధీ ప్రతిపాదించిన సామాజిక భాగస్వామ్యం, స్థానిక స్వపరిపాలన, ఉమ్మడి బాధ్యత ఆదర్శాలను జల్ అర్పణ్‌ ప్రతిబింబిస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 2318759) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Kannada , Malayalam