ఉప రాష్ట్రపతి సచివాలయం
న్యూఢిల్లీలో జరుగుతున్న అయిదో కౌటిల్య ఆర్థిక సదస్సులో ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ప్రారంభోపన్యాసం
‘‘సామాజిక స్థిరత్వం నుంచి ఆర్థిక స్థిరత్వాన్ని వేరు చేయలేం’’: ఉపరాష్ట్రపతి
‘‘వేగంగా మారుతున్న ఈ సమయంలో స్థిరత్వానికి సమ్మిళిత్వమే పునాది’’: ఉపరాష్ట్రపతి
‘‘ఏ వ్యక్తి, సంస్థ లేదా ప్రాంతమైనా వెనకబడకుండా చూడటంలోనే నిజమైన స్థిరత్వం దాగుంది’’: ఉపరాష్ట్రపతి
‘‘ప్రజాస్వామ్యం, అభివృద్ధి కలసి ప్రయాణించగలవని భారత్ నిరూపించింది’’: ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
03 OCT 2026 11:56AM by PIB Hyderabad
ఈ రోజు న్యూఢిల్లీలో ‘‘మారుతున్న యుగంలో స్థిరత్వం’’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న అయిదో కౌటిల్య ఆర్థిక సదస్సులో ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విధాన రూపకర్తలు, ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, ఇతర విశిష్ట అతిథులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో పటిష్టమైన, సమ్మిళితమైన, స్పందించే ఆర్థిక విధానాల ఆవశ్యకత గురించి వివరించారు.
ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ (ఐఈజీ) విశిష్టత గురించి ఉపరాష్ట్రపతి వివరించారు. ప్రొఫెసర్ వీకేఆర్‌వీ రావు నేతృత్వంలో 1952లో ఈ సంస్థ ప్రారంభమైందని, అప్పటి నుంచి భారతదేశ అభివృద్ధి ప్రస్థానంతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పటిష్టమైన విధానాలు రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సరళంగా, స్పందించేలా విధానాలు ఉండాలని తెలియజేశారు.
నిరంతరం మార్పులు చోటు చేసుకుంటున్న సమయంలో ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవాలని శ్రీ సీపీ రాధాకృష్ణన్ సూచించారు. ప్రజాస్వామ్యంలో చర్చలు, వాదోపవాదాలు అంతర్భాగమన్నారు. అయితే అందరి ఆమోదం పొందే నిర్ణయాలకు అవి మార్గం చూపాలన్నారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన చర్చ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని... హక్కులు, బాధ్యతలు రెండూ సమన్వయంతో సాగాలని రాజ్యసభ ఛైర్మన్‌గా స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యం, అభివృద్ధి కలసి ప్రయాణించగలవని భారత్ నిరూపించిందని ఉపరాష్ట్రపతి వెల్లడించారు. ప్రజాస్వామ్య నియమాలతోనే భారతదేశం ఆర్థిక వృద్ధిని, సమ్మిళిత ప్రగతిని సాధించిందని తెలియజేశారు. అదే సమయంలో ఏకాభిప్రాయ నిర్మాణం... ఆర్థిక సంస్కరణలను మరింత పటిష్టంగా, సుస్థిరంగా మార్చిందని వివరించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన ముఖ్యమైన పునాదిని ఈ అనుభవం అందిస్తుందన్నారు.
సామాజిక స్థిరత్వం నుంచి ఆర్థిక స్థిరత్వాన్ని వేరు చేయలేమని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. ఆర్థిక సమ్మిళిత్వాన్ని, పారదర్శకతను, వ్యవస్థీకరణను బలోపేతం చేయడంలో జేఏఎం త్రయం, ప్రత్యక్ష నగదు బదిలీ, జీఎస్టీ కీలకపాత్ర పోషించాయని ఉపరాష్ట్రపతి అన్నారు. 2026 ఆగస్టు నాటికి 590 మిలియన్లకు పైగా జన్‌ధన్ ఖాతాలను తెరిచారని వెల్లడించారు. జీఎస్టీ రిజిష్ట్రేషన్లు 2017లో 6.65 మిలియన్ల నుంచి 2026 మే నాటికి 16.5 మిలియన్లకు పెరిగాయని కూడా తెలియజేశారు.
ప్రజలను వ్యవస్థీకృత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంతో పాటు వారు కూడా సంపదను సృష్టించేలా, ఆదాయాన్ని పొందేలా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలని శ్రీ సి. పి. రాధాకృష్ణన్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 100 మిలియన్లకు పైగా మహిళలకు సుమారు 9.2 మిలియన్ల స్వయం సహాయక బృందాలు అందిస్తున్న తోడ్పాటు గురించి, 34.6 మిలియన్లకు పైగా లఖ్‌పతి దీదీల గురించి ఆయన వివరించారు. మహిళా సాధికారత దశ నుంచి మహిళా నేతృత్వంలో అభివృద్ధి దిశగా మారిన భారత్ ప్రయాణాన్ని విద్య, ఆర్థిక రంగాల్లో క్రమంగా పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం సూచిస్తోందని తెలియజేశారు.
కేవలం బోర్డు రూములు, ఆర్థిక విపణులతోనే స్థిరత్వం సాధ్యం కాదని ఉపరాష్ట్రపతి అన్నారు. గ్రామంలోని మహిళకు కూడా బ్యాంకు ఖాతా ఉండి, ప్రభుత్వ ప్రయోజనాలను నేరుగా పొందుతూ, వ్యవస్థీకృత ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడే, ఓ స్వయం సహాయక బృందాన్ని వ్యాపార సంస్థగా మార్చినప్పుడే నిజమైన స్థిరత్వం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కడు పేదరికం నుంచి 250 మిలియన్ల మంది భారతీయులు బయటపడటాన్ని చారిత్రక విజయంగా ఆయన వర్ణించారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి గ్రామం సమాన భాగస్వామ్యాన్ని పంచుకోవాలన్నారు.
విస్తృత పరిశోధన, సంస్థాగత భాగస్వామ్యాలకు శ్రీ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రోత్ మధ్య సహకారాలను ఆయన స్వాగతించారు. విస్తరిస్తున్న భారతదేశ వాణిజ్య ఒప్పందాలతో పాటుగా ఇలాంటి భాగస్వామ్యాలు పరిశోధనను, విద్యను, ఆవిష్కరణలను, ఔత్సాహిక పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తాయన్నారు.
మార్పును వ్యతిరేకించడం కాకుండా... దానిని విశ్వాసంతో, సమ్మిళిత్వంతో, సామూహిక స్ఫూర్తితో స్వీకరించినప్పుడు మాత్రమే భారత్ స్థిరత్వం సాధిస్తుందంటూ ఉపరాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు. అయిదో కౌటిల్య ఆర్థిక సదస్సులో చేపట్టే చర్చలు 2047 నాటికి వికసిత్ భారత్‌ను సాధించాలనే దేశ లక్ష్యానికి అర్థవంతంగా తోడ్పడతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐఈజీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అధ్యక్షులు శ్రీ ఎన్‌కే సింగ్, ఐఈజీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్ డాక్టర్ మైఖేల్ దేబబ్రత పాత్ర, ఇతర విశిష్ట అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2318617)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8