సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రికి వచ్చిన బహుమతుల పీఎం మెమెంటోస్ ఈ–వేలం అక్టోబర్ 31, 2026 వరకు పొడిగింపు
పీఎం మెమెంటోస్ వేలం 8వ విడతలో ఢిల్లీకి చెందిన 30 జ్ఞాపికల ప్రదర్శన
కళాఖండాలు, ఆధ్యాత్మిక వస్తువులు, సంస్థాగత జ్ఞాపికలు, ప్రజా విజయాలకు సంబంధించిన వస్తువులతో ప్రత్యేక సేకరణ
ఈ-వేలం ద్వారా వచ్చిన ఆదాయం నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయింపు
నాడు పోస్టు చేయడమైనది:
02 OCT 2026 2:13PM by PIB Hyderabad
ప్రధానమంత్రికి వచ్చిన ప్రత్యేకమైన బహుమతులు, కళాఖండాలను ప్రదర్శించే పీఎం మెమెంటోస్ 8వ విడత వేలం ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ–వేలం గడువును 2026 అక్టోబర్ 31 వరకు పొడిగించారు.
ఈ విడతలో ఢిల్లీ నగరంలోని విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు ఉన్నాయి. ప్రజా వేలానికి అందుబాటులో ఉన్న ఈ సేకరణలో వివిధ రకాల కళాఖండాలు, భక్తి సంబంధిత వస్తువులు, హస్తకళా వస్తువులు, సంస్థాగత జ్ఞాపికలు ఉన్నాయి. ఇవి ప్రత్యేకమైన జ్ఞాపకాలుగా నిలిచే అవకాశం ఉంది. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు అందించనున్నారు.
ఈ 30 జ్ఞాపికల్లో తొమ్మిది ఫొటో ఫ్రేమ్‌లు, 9 ఇతర జ్ఞాపికలు, ఆరు విగ్రహాలు, శిల్పాలు, ప్రతిమలు ఉన్నాయి. వీటితో పాటు ఢిల్లీ మెట్రోకు సంబంధించిన 2 నమూనాలు, ఒక క్రీడా జ్ఞాపిక, ఒక పెయింటింగ్, కళా, హస్తకళా వస్తువులు తదితరాలు కూడా ఈ సేకరణలో ఉన్నాయి.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలు
దేశ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు సంబంధించిన పలు స్మారక చిహ్నాలు ఈ సేకరణలో ఉన్నాయి. వీటిలో నాలుగు జ్ఞాపికలు శ్రీరాముడు లేదా రామాయణంలోని ఘట్టాలను ప్రతిబింబిస్తాయి. వీటిలో రామ దర్బార్ శిల్పం, కేవట్‌తో కలిసి శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు నదిని దాటుతున్న దృశ్యాన్ని చిత్రించిన ఇత్తడి ఫలకం, పాలం గ్రామానికి చెందిన సంత్ దాదా దేవ్ చిత్రపటం, చెక్కతో చెక్కిన రామలల్లా విగ్రహం ఉన్నాయి.
బౌద్ధమతంలోని అష్ట మంగళ చిహ్నాల ప్రతిరూపం కూడా ఈ సేకరణలో ఉంది. అష్టమంగళం అని కూడా పిలిచే ఈ ఎనిమిది శుభ చిహ్నాలకు లోతైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఇవి సంప్రదాయంగా బౌద్ధ బోధనలు, బుద్ధుని జ్ఞానోదయంతో అనుబంధం కలిగి ఉన్నాయి.
ఢిల్లీ సంస్థలు, మౌలిక సదుపాయాలు
ఈ సేకరణలో ఢిల్లీలోని ప్రముఖ సంస్థలు, చారిత్రక ప్రదేశాలకు సంబంధించిన అనేక కళాఖండాలు ఉన్నాయి. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీని చిత్రించిన ఫ్రేమ్ చేసిన కళాఖండం, పాత సచివాలయ భవనం క్రిస్టల్ జ్ఞాపిక, కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రతిబింబించే వస్త్ర కళాఖండం ఢిల్లీ సంస్థాగత వారసత్వంలోని విభిన్న కోణాలను ప్రతిబింబిస్తున్నాయి.
ప్రజా జీవితం, విజయాలు
విజయం, ప్రజాసేవ, వ్యక్తిగత భావ వ్యక్తీకరణకు ప్రతీకలుగా నిలిచే వివిధ వస్తువులను ఈ సేకరణలో చేర్చారు. వీటిలో రోహిణికి చెందిన ఒక విద్యార్థి గీసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముఖచిత్రానికి సంబంధించిన అత్యంత సూక్ష్మమైన పెన్సిల్ స్కెచ్ ప్రత్యేకంగా ఉంది.
పారాలింపిక్స్‌లో రజత పతక విజేత యోగేశ్ కథునియా డిస్కస్ క్రీడా విజయం, పట్టుదలకు ప్రతీకగా నిలుస్తోంది. ఎన్‌సీసీకి చెందిన బంగారు పూతతో రూపొందించిన పరమ్ వీర్ మట్టి కలశ్ సేవ, స్మరణ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. వీటితో పాటు సహజంగా ఎండిపోయి, అస్థిపంజరంలా మారిన బోధి ఆకుపై అత్యంత నైపుణ్యంతో రూపొందించిన ఒక చిత్రపటం వ్యక్తిగత, కళాత్మక భావ వ్యక్తీకరణకు మరో కోణాన్ని తెలియజేస్తుంది.
రోహిణికి చెందిన ఒక విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ, కొత్త పార్లమెంట్ భవనం వరకు.. ఈ జ్ఞాపికలు ఢిల్లీ నగరంలోని వివిధ ప్రాంతాలు, సంస్థలకు సంబంధించిన కథలను తమలో మోసుకొస్తున్నాయి. ఈ వేలం ద్వారా ఈ జ్ఞాపకాలకు మరింత విస్తృత ప్రజా ప్రయోజనం లభించనుంది. వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు అందించనున్నారు.
వేలం తేదీలు, పాల్గొనే వివరాలు, పూర్తి జాబితా కోసం అధికారిక పీఎం మెమెంటోస్ ఈ–వేలం వేదిక pmmementos.gov.inను సందర్శించండి.
(రిలీజ్ ఐడి: 2318386)
సందర్శకుల సూచీ సంఖ్య : : 19