వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ వాణిజ్యంలో లోపాలను సరిదిద్దడానికి డబ్ల్యూటీఓ నిబంధనలకు కట్టుబడి ఉండాలి: మిల్‌వాకీ జీ20 వాణిజ్య మంత్రుల సమావేశం ముగింపులో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టీకరణ

నిర్బంధ కార్మిక వ్యవస్థ నిర్మూలనకు భారత్‌ కట్టుబడి ఉందని స్పష్టం చేసిన పీయూష్‌ గోయల్‌
 - ఆధారాల ప్రాతిపదికన వాణిజ్య చర్యలు చేపట్టాలని పిలుపు

నాడు పోస్టు చేయడమైనది: 02 OCT 2026 12:32PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో జరిగిన జీ20 వాణిజ్య మంత్రుల సమావేశం ముగింపు రోజు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పరిశ్రమల్లో మితిమీరిన ఉత్పత్తి సామర్థ్యం, ఉత్పత్తి విధానాలు, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (ఎంఎఫ్ఎన్) సూత్రాల నవీకరణ, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో వెట్టి చాకిరీ/ నిర్బంధ శ్రమను అరికట్టడం వంటి కీలక అంశాలపై జరిగిన వివిధ చర్చా గోష్ఠులతో పాటు ముగింపు సమావేశంలోనూ ప్రసంగించారు.

 

పరిశ్రమల్లో మితిమీరిన ఉత్పత్తి సామర్థ్యం, ఉత్పత్తి విధానాలపై శ్రీ గోయల్ మాట్లాడుతూ, 140 కోట్ల జనాభా అవసరాలను తీర్చే అంతర్గత డిమాండ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థతో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న బహుళ ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని తెలిపారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తూ డిజైన్ నుంచి తుది ఉత్పత్తుల వరకు తయారీ రంగాన్ని విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. భారత తయారీ సామర్థ్యం దేశీయ అవసరాలతో పాటు అంతర్జాతీయ అవసరాలను కూడా తీరుస్తుందని, జీ20 అధ్యక్ష వర్గం గుర్తించిన రంగాలలో భారత్‌కు ఎటువంటి మితిమీరిన ఉత్పత్తి సామర్థ్యం లేదని స్పష్టం చేశారు.

 

కొన్ని దేశాల్లో ఇస్తున్న వ్యాపార సంబంధ రాయితీలు ఇతర దేశాల మార్కెట్లలోకి చౌకైన సరుకులను చొరబడేలా చేయడం, పోటీని దెబ్బతీసే విధంగా చాలా తక్కువ ధరలకు అమ్మడం వంటి చర్యలకు దారితీస్తున్నాయనే పలు జీ20 సభ్య దేశాల ఆందోళనలను భారత్ సమర్థిస్తుందని శ్రీ గోయల్ తెలిపారు. తగిన ఆధారాల పరిశీలన, న్యాయ సమీక్షలకు లోబడి ఉండే యాంటీ డంపింగ్, కౌంటర్ వెయిలింగ్ సుంకాల వంటి డబ్ల్యూటీఓ నిబంధనలకు కట్టుబడే చర్యల ద్వారానే ఈ ఆందోళనలకు పరిష్కారం చూపవచ్చని ఆయన పేర్కొన్నారు. పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యం ఎంత ఉందనేది సమస్య కాదని, రహస్య రాయితీలు, ప్రభుత్వ అండతో ఉత్పత్తి అంతా ఒక్క ప్రాంతంలో కేంద్రీకృతమైనప్పుడే వాణిజ్యపరమైన లోపాలు ఉత్పన్నమవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఉత్పత్తిని, సరఫరా వ్యవస్థలను విభిన్న ప్రాంతాలకు విస్తరించడం సమంజసమైన లక్ష్యమే అయినప్పటికీ.. దానిని సాకుగా పెట్టుకుని డబ్ల్యూటీఓ నిబంధనలకు విరుద్ధమైన చర్యలు చేపట్టడం గానీ, సర్దుబాటు భారాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలపై నెట్టడం గానీ సరికాదని ఆయన తేల్చి చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ పారిశ్రామికీకరణకు అవసరమైన విధానపరమైన స్వేచ్ఛను తప్పనిసరిగా నిలుపుకోవాలని పేర్కొన్నారు. అలాగే గణాంకాలు, డేటా భాగస్వామ్యం అనేది ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యవస్థల పరిధిలోనే జరగాలని ఆయన సూచించారు.

అత్యంత ప్రాధాన్య దేశం (మోస్ట్ ఫేవర్డ్ నేషన్ - ఎంఎఫ్ఎన్) సూత్రాల నవీకరణపై శ్రీ గోయల్ మాట్లాడుతూ.. జీ20 సభ్య దేశాలతో భారత్ జరిపే వ్యాపారం పారదర్శకమైన, పక్షపాతం లేని, నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థపైనే ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. ఈ విశ్వసనీయ వ్యవస్థకు 'మోస్ట్ ఫేవర్డ్ నేషన్' హోదానే ప్రాథమిక హామీ అని, చిన్నపాటి వ్యాపారి నుంచి అతిపెద్ద వ్యాపారి వరకు అందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తించేలా ఇది నిర్ధారిస్తుందని ఆయన తెలిపారు. డబ్ల్యూటీఓ కు ఏకాభిప్రాయమే అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఎదిగేందుకు ప్రత్యేక, వ్యత్యాసపూరితమైన వెసులుబాట్లను కొనసాగించాల్సిందేనని అన్నారు. అలాగే, నిలిచిపోయిన రెండు అంచెల వివాద పరిష్కార వ్యవస్థను పునరుద్ధరించాలని ఆయన పిలుపునిచ్చారు.

 

అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో శ్రమ దోపిడీని అరికట్టడంపై శ్రీ గోయల్ మాట్లాడుతూ.. శ్రమ దోపిడీని రూపుమాపే విషయంలో భారత ప్రభుత్వం సంపూర్ణమైన, షరతులు లేని కట్టుబాటుతో ఉందన్నారు. రాజ్యాంగంలోని 23వ ప్రకరణ (ఆర్టికల్ 23) శ్రమ దోపిడీని ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా నిషేధించిందని, దీని అమలును సుప్రీంకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తుందని ఆయన గుర్తుచేశారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ నిబంధనలు 29, 105లను భారత్ ఇప్పటికే ఆమోదించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా, శ్రమ దోపిడీతో తయారుచేసిన వస్తువుల దిగుమతిని నిషేధిస్తూ జూలై 2026లో తమ విదేశీ వాణిజ్య విధానంలో సవరణలు కూడా చేసినట్లు మంత్రి తెలిపారు.

 

సరిహద్దు వద్ద తీసుకునే చర్యలు నిర్దిష్టమైన, ప్రామాణికమైన ఆధారాలపై ఉండాలి తప్ప ఒక దేశం, ప్రాంతం లేదా రంగానికి సంబంధించి కేవలం ముందస్తు అంచనాలతో కాదని శ్రీ గోయల్ తేల్చిచెప్పారు. ఈ ప్రక్రియలో సరైన పద్ధతులను, డబ్ల్యూటీఓ నిబంధనలను కచ్చితంగా గౌరవించాలని సూచించారు. కార్మిక ప్రమాణాల అమలుకు అంతర్జాతీయ కార్మిక సంస్థ మాత్రమే అత్యున్నత, సార్వత్రిక, త్రైపాక్షిక అధికారిక సంస్థ అని స్పష్టం చేశారు. శ్రమ దోపిడీని రూపుమాపడం, జీ20 దేశాల మధ్య అత్యుత్తమ విధానాల సమాచారాన్ని స్వచ్ఛందంగా మార్పిడి చేసుకోవడం వంటి లక్ష్యాలకు భారత్ మద్దతు ఇస్తుందన్నారు. అయితే, ఈ సహకారం నెపంతో సభ్య దేశాలపై నిఘా పెట్టడం, కొత్త నిబంధనలు రుద్దడం లేదా ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఏకపక్ష వాణిజ్య చర్యలకు పాల్పడటం వంటివి చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. 

 

మిల్‌వాకీలో ఏర్పాటు చేసిన అద్భుతమైన ఏర్పాట్లకు, చూపించిన ఆతిథ్యానికి గానూ అంబాసిడర్ గ్రీర్‌తో పాటు అమెరికా జీ20 అధ్యక్ష వర్గానికి శ్రీ గోయల్ ధన్యవాదాలు తెలిపారు. "కలిసి పరిష్కరించుకోలేని సమస్యలు మనం పరిష్కరించుకోగలిగే ఇతర అంశాలకు అడ్డంకిగా మారకూడదు" అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గతంలో చెప్పిన అంశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. భారత్ అదే స్పూర్తితో ఈ సమావేశంలో పాల్గొని, నాలుగు ముఖ్యమైన అంశాలపై తన ఆందోళనలను తెలియజేయడంతో పాటు నిర్మాణాత్మకమైన సలహాలను కూడా అందించిందని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలతో కూడిన, సమన్యాయంతో కూడిన, పక్షపాతం లేని, పారదర్శకమైన, బహిరంగ, సమ్మిళిత, బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందనే విషయాన్ని కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు. ఏకాభిప్రాయం, ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకునే పద్ధతిని కాపాడుతూనే.. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థికంగా ఎదిగేందుకు, తమ ప్రజల ఆకలి తీర్చేందుకు అవసరమైన విధానపరమైన స్వేచ్ఛను అందించడం చాలా ముఖ్యమని ఆయన చెప్పారు. 2027లో జి20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టబోతున్న బ్రిటన్ కు శ్రీ గోయల్ భారత్ తరఫున పూర్తి మద్దతు ప్రకటించారు.

 

ఈ సమావేశాల సందర్భంగా ఆస్ట్రేలియా వాణిజ్య, పర్యాటక శాఖ మంత్రి, సౌదీ అరేబియా వాణిజ్య శాఖ మంత్రి, ఫ్రాన్స్‌ విదేశీ వాణిజ్యం, పెట్టుబడుల ఆకర్షణ వ్యవహారాల మంత్రి ప్రతినిధి, రిపబ్లిక్ ఆఫ్ కొరియా వాణిజ్య శాఖ మంత్రి, కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రులతో శ్రీ గోయల్ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.

***

 


(రిలీజ్ ఐడి: 2318380) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Malayalam