హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మాదకద్రవ్యాలపై పోరాటంలో పెద్ద విజయం

భారత ఈఈజడ్‌లో ఓ ఇరానీ పడవ నుంచి 526 కిలోల మెథంఫెటమైన్, హెరాయిన్ జప్తు..
5 పాకిస్తానీలు అరెస్టు..
ఇది గుజరాత్ ఏటీఎస్, భారతీయ కోస్తా రక్షకదళం, కేంద్రీయ రహస్య సమాచార ఏజెన్సీలు
కలిసికట్టుగా చేపట్టిన ఆపరేషన్ అని తెలిపిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా

మాదకద్రవ్యాల భూతం బారి నుంచి యువతను కాపాడడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది

16 రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో ఓ ఇరానీ పడవ కూడా స్వాధీనం..
ఇది కేంద్రీయ ఏజెన్సీల సహకార, సమన్వయాలకు చక్కని ఉదాహరణ

భారతదేశ సముద్ర సరిహద్దులను రక్షించడంలో రహస్యసమాచార ఆధారిత, ఏజెన్సీల పరస్పర సమన్వయ శక్తిని చాటిన ఆపరేషన్ ఇది

ఈ నెట్‌వర్క్ విస్తృత సంబంధాలు, దీని లక్షిత లబ్ధిదారుల గుర్తింపునకు దర్యాప్తు తీవ్రతరం

సురక్షిత, ఆరోగ్యదాయక, మత్తుమందుల జాడ ఉండని భారతదేశమే మన అందరి జాతీయ సంకల్పం

నేరనియంత్రణను బలోపేతం చేసేందుకు, మాదకద్రవ్యాల నెట్‌వర్కులను ధ్వంసం చేసేందుకు,
మత్తుపదార్థాల నుంచి మన యువతను, మన సమాజాన్ని కాపాడేందుకు
విస్తృత కార్యాచరణను అందిస్తున్న
మాదకద్రవ్యాల నియంత్రణ సంబంధిత మోదీ ప్రభుత్వ దార్శనిక పత్రం (2026–2029)

నాడు పోస్టు చేయడమైనది: 30 SEP 2026 3:54PM by PIB Hyderabad

మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరులో ప్రధాన విజయమిది.. భారత ప్రత్యేక ఆర్థిక మండలం (ఈఈజడ్) పరిధిలో ఓ ఇరాన్ పడవలో నుంచి 526 కిలోల మెథంఫెటమైన్‌, హెరాయిన్‌‌ అనే మాదకద్రవ్యాలను జప్తు చేసుకోవడంతో పాటు అయిదుగురు పాకిస్తానీ పౌరులను అరెస్టు చేశారని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు తెలిపారు. ఈ ఆపరేషన్లో గుజరాత్ తీవ్రవాద నిరోధక దళం (ఏటీఎస్), భారతీయ కోస్తాతీర రక్షకదళంతో పాటు కేంద్రానికి చెందిన రహస్య సమాచార ఏజెన్సీలు కలిసికట్టుగా పాల్గొన్నాయని మంత్రి వెల్లడించారు.

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్నికేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా పొందుపరుస్తూ, ‘‘మత్తుమందుల భూతం బారి నుంచి దేశ యువతను రక్షించాలని మోదీ ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉంది. గుజరాత్ ఏటీఎస్, భారతీయ కోస్తా తీరరక్షక దళం, కేంద్రీయ రహస్య సమాచార ఏజెన్సీలు కలిసికట్టుగా ఓ ఆపరేషన్‌‌ను నిర్వహించి భారత ఈఈజడ్‌ పరిధిలోకి వచ్చిన ఓ ఇరాన్ పడవలో నుంచి 526 కిలోల మెథంఫెటమైన్‌ను, హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఈ మత్తుపదార్థాలను జప్తు చేసుకున్న ప్రాంతం ముంబయికి నైరుతి దిక్కున 460 నాటికల్ మైళ్లు, లక్షద్వీప్‌కు వాయవ్య దిక్కున 160 నాటికల్ మైళ్ల దూరంలో నెలకొంది. ఈ సందర్భంగా అయిదుగురు పాకిస్తానీలను అరెస్టు చేశారు. విస్తృత నెట్‌వర్క్ గుట్టును ఛేదించాలని, లక్షిత లబ్ధిదారులను కనుగొనాలనే లక్ష్యాలతో దర్యాప్తును తీవ్రతరం చేశారు. 16 రోజుల పాటు సాగిన ఆపరేషన్లో ఇరాన్‌కు చెందిన ఓ పడవను కూడా స్వాధీనం చేసుకున్నారు. పలు ఏజెన్సీల మధ్య పరస్పర సమన్వయానికి, సహకారానికి ఇది ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తోంది’’ అని పేర్కొన్నారు.

ఈ నెల 14 నుంచి 30 వరకు నిర్వహించిన ఈ ఆపరేషన్‌.. భారత సముద్ర సరిహద్దులను సురక్షితంగా ఉంచడంలో వివిధ ఏజెన్సీలు రహస్య సమాచారం ఆధారంగా చేసుకుని పరస్పర సమన్వయంతో విధులను శక్తిమంతంగా నిర్వహించాయని చాటుతోంది.

నేర నియంత్రణను బలోపేతం చేసేందుకు, మాదకద్రవ్యాల నెట్‌వర్కులను ధ్వంసం చేసేందుకు, మత్తుపదార్థాల నుంచి మన యువతను, మన సమాజాన్ని కాపాడేందుకు మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘మాదకద్రవ్యాల నియంత్రణ సంబంధిత దార్శనిక పత్రం (2026–2029)’ విస్తృత కార్యాచరణను అందిస్తోంది.

సురక్షిత, ఆరోగ్యప్రద, మత్తుమందులకు తావు ఇవ్వని భారత్ (‘నషా ముక్త్ భారత్’)ను తీర్చిదిద్దడమే మన అందరి ఉమ్మడి జాతీయ సంకల్పం.

***


(రిలీజ్ ఐడి: 2317399) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam